Real-facts-about-gulf-

ఆకలి కేకలు - వాస్తవాలు

సౌదీలోని భారతీయ కార్మికుల దుస్థితి గురించి సమాచారమందిన వెన్వెంటనే స్పందిస్తూ ఆ అన్నార్తులకు ఇప్పుడే భోజనం సరఫరా చేస్తున్నామంటూ సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. నిజానికి సుష్మ స్పందించడానికి మూడురోజుల ముందు నుంచే వారికి భోజనాలు సరఫరా అవుతున్నాయి. ఈ విషయాన్ని సుష్మ ఉద్దేశపూర్వకంగా ప్రజలకు తెలియజేయలేదు. 

 
ప్ర‌పంచంలోకెల్లా అత్యధికంగా చమురును ఎగుమతిచేసే దేశం సౌదీ అరేబియా. ఈ సంపద్వంత దేశంలో ప్రవాస భారతీయుల ఆకలికేకల గురించి భారతీయ మీడియా ఇటీవల ప్రముఖంగా ప్రస్తావించింది, పార్లమెంటులో సైతం ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. సహజంగానే ఇప్పుడు సౌదీలోని భారతీయుల దుస్థితిపై ఆసేతు హిమాచలం చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సౌదీతో సహా అన్ని గల్ఫ్‌ దేశాలలో నిర్మాణరంగం కుదేలయింది. ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహాం లేదు. అయితే సౌదీలోగానీ, మరే గల్ఫ్‌ దేశంలో గానీ భారతీయ కార్మికుల పరిస్థితి ఆకలికేకల తరహా దుస్థితికి దిగజారలేదు. ఇది కూడా సందేహాతీత వాస్తవం. 
 
                  సౌదీలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన ‘సౌదీ ఓజర్‌’లో 50వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో భారతీయులతో సహా వివిధ దేశాలవారు వున్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు ఈ సంస్థలో పని చేయడానికి అనేకమంది సదాసంసిద్ధంగా ఉండేవారు. మన తెలుగు రాష్ర్టాలలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ కంటే ఎక్కువగా ‘సౌదీ ఓజర్‌’ ఉద్యోగానికి డిమాండ్‌ ఉండేది. ఇది నమ్మవలసిన నిజం. సకాలంలో వేతనాలు, దాని కంటే ఎక్కువగా లభించే ఓవర్‌టైం, సంవత్సరానికి నిర్దిష్ట సెలవులు, పరిశుభ్రమైన నివాస గదులు, వీటన్నింటినీ మించి ఆయా సంస్కృతులు, ఆహార అలవాట్లకు అనుగుణంగా భోజన సదుపాయం ఈ సంస్థ ప్రత్యేకత.
 
                  సమయం, సందర్భం మనుషులతోపాటు సంస్థలు, దేశాల తలరాతను కూడ మార్చుతాయనంటారు కదా. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. ‘సౌదీ ఓజర్‌’ సంస్థ యజమాని అయిన లెబనాన్‌ దేశ ప్రధాని రఫీక్‌ హారారీ అకస్మాత్తుగా హత్యకు గురయిన తర్వాత సంస్థ పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత మధ్య ప్రాచ్యదేశాలలో నెలకొన్న యుద్ధ పరిస్థితులకు తోడుగా పతనమైన చమురు ధరల కారణాన ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. ఇవన్నీ కలిసి సంస్థపై ప్రభావం చూపాయి, దీంతో గత 8నెలలుగా అందులో పనిచేసే వేలాది ఉద్యోగులకు ఎలాంటి వేతనాలు చెల్లించడం లేదు, వేతనాలు చెల్లించకున్నా సంస్థ మెస్‌ ద్వారా ఉద్యోగులు, కార్మికులకు సమయానికి భోజనం మాత్రం అందించేవారు. అయితే పక్షం రోజుల క్రితం భోజనశాలలను సైతం మూసివేయడంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఈ విషాదవార్త భారతదేశంలోని పార్లమెంటు వరకు వెళ్ళింది.
 
                  భోజనశాల మూతపడిన తర్వాత రాజస్థాన్‌ కార్మికుడు ఒకరు ఫేస్‌బుక్‌ ద్వారా స్వగ్రామంలోని తన బంధుమిత్రులకు సమాచారం అందించాడు. వారు ఆ సమాచారాన్ని విదేశాంగమంత్రి సుష్మ స్వరాజ్‌కు ట్విట్టర్‌ ద్వారా పంపారు. దానికి ఆమె వెన్వెంటనే స్పందిస్తూ సౌదీలోని ప్రవాసభారతీయ కార్మికులకు ఇప్పుడే భోజన సరఫరా చేస్తున్నామంటూ ట్వీట్‌ చేశారు. దీంతో సహజంగానే మీడియాకు పని దొరికింది. అయితే సుష్మ స్పందించడానికి మూడురోజుల ముందు నుంచే సౌదీలో ఆకలితో నకనకలాడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు భోజనాలు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రజలకు తెలియజేయకుండా తాను తక్షణమే స్పందించినట్లుగా సోషల్‌ మీడియాలో మార్కులు కొట్టేశారు.
 
                  మంత్రి వి.కె.సింగ్‌ హుటాహుటిన సౌదీకి వచ్చి, కార్మిక క్యాంపులను సందర్శించి వారితో సమావేశమయ్యారు. భారత మీడియా చెప్పినట్లుగా భోజనంకాదు భారీ మొత్తంలో రావాల్సిన జీతం బకాయిలు, గ్రాట్యూటి డబ్బులగురించి తెలుసుకుని మంత్రి విస్తుపోయారు. భారత మీడియాలో వచ్చిన దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి తేడావున్నట్లుగా కార్మికుల క్యాంపు సందర్శన సందర్భంగా ఆయన నాతో చెప్పడంతో విస్తుపోవడం నా వంతయింది.
 

                  మొత్తానికి సున్నితమైన ఈ సమస్యను భారత ప్రభుత్వం పరిష్కరించింది. అంతేకాకుండా ఈ రకమైన అన్ని సంస్థల, అన్ని దేశాల కార్మికుల బకాయి వేతనాల సమస్యలను పరిష్కరించాలని సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ హుకుం జారీచేయడంలో కూడా పాత్ర వహించింది. ఇది ఎంతో ఆనందించాల్సిన, అభినందించాల్సిన విషయం.

  మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ 
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి