Pakistan-Remains-Single-Over-Kashmir-Issue-

కశ్మీర్‌పై పాకిస్థాన్ ఏకాకి

ఇస్లామిక్ లేదా అరబ్ దేశమేదీ ప్రస్తుతం పాకిస్థాన్‌కు కశ్మీర్ విషయమై మద్దతు ఇవ్వడం లేదు. ఒక్క చైనా మాత్రమే భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు మద్దతు ఇస్తున్నది. చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలో ముస్లింలను చైనా సైన్యం కఠినంగా అణిచి వేస్తోంది. ఇటువంటి అణిచివేత రొహింగ్యాలతో సహా ప్రపంచంలో మరెవ్వరిపైనా, మరే దేశంలోనూ జరగడం లేదు. అలాంటి చైనా మద్దతుతో పాకిస్థాన్, కశ్మీర్ ముస్లింల గురించి గుండెలు బాదుకోవడం హాస్యాస్పదం. 

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అంశంపై పాకిస్థాన్‌లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ అంతర్జాతీయంగా మాత్రం ఈ కీలక విషయంలో మన దాయాది దేశం ఏకాకి అయిందని నిశ్చితంగా చెప్పవచ్చు. గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్‌కు సహజంగానే సన్నిహిత సంబంధాలు వున్నాయి. కశ్మీర్ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకునేందుకు పాకిస్థాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాలు, మరీ ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ)లపై ఆధారపడుతున్నది. అయితే ఈ రెండు కీలక ఇస్లామిక్ దేశాలు కూడా ప్రస్తుతం కశ్మీర్ విషయంలో ఒక స్పష్టమైన తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో భారత్‌కు సౌదీ, యుఏఇ మద్దతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత విజయమని నిస్సందేహంగా అభివర్ణించవచ్చు. 

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై ఒక వ్యూహాత్మక ప్రకటన చేశాయి. కశ్మీర్ వివాదాన్ని భారత్, పాకిస్థాన్‌లు సామరస్య వైఖరితో పరిష్కరించుకోవాలనేది ఆ ప్రకటన సారాంశం. భారత్ విధానాన్ని ఆ ప్రకటన ఏ మాత్రం ఖండించ లేదు. పాకిస్థాన్‌పై సైనికంగా ఆధారపడ్డ ఓమన్, బహ్రెయిన్‌లతో పాటు కువైత్, ఖతర్ దేశాలు కూడా కశ్మీర్‌లో తాజా పరిణామాల విషయమై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా మౌనం వహించాయి. ఈ గల్ఫ్ దేశాలతో సామరస్య పూర్వక సంబంధాలు లేని ఇరాన్ సైతం కశ్మీర్ విషయంలో ఎలాంటి దూకుడు ప్రకటన చేయలేదు. ఇది భారత్‌కు పెద్ద నైతిక విజయం. గల్ఫ్ దేశాల రాజకుటుంబీకులతో మోదీ వ్యక్తిగతంగా సన్నిహితంగా వ్యవహరించే వైఖరి ఇందుకు ఒక ముఖ్య కారణమని చెప్పవచ్చు. అమెరికా – సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచీ భారత్, పాకిస్థాన్ వేర్వేరు శిబిరాలలో ఉంటూ వచ్చాయి.

గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్‌ అమెరికా పక్షం వహించేవి. అలీన దేశమైన భారత్ వాస్తవంగా సోవియట్ యూనియన్ సానుకూల వైఖరి చూపేది. ఈ అంతరాలకు అనుగుణంగానే భారత్, పాకిస్థాన్‌ల విదేశాంగ విధానాలు ఉండేవి. పాక్ విదేశాంగ విధానం ముఖ్యంగా కశ్మీర్, అఫ్ఘానిస్తాన్ అనే రెండు అంశాల ఇతివృత్తంగా నడిచింది. ఈ రెండు అంశాల ఆధారంగా పాకిస్థాన్ ఇప్పటి వరకు ‘ఇస్లామిక్ దేశాల కూటమి’ (ఓఐసి)లో ఒక బలమైన గొంతుకగా వ్యవహరించింది. అదే భావనతో కశ్మీర్ విషయంలో కూడా ఇప్పుడు ఇస్లామిక్ దేశాలన్నీ తనకు దన్నుగా నిలుస్తాయని ఇస్లామాబాద్ పాలకులు ఆశించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. కశ్మీర్ పరిణామాలపై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నిరాశానిస్పృహలతో చేస్తోన్న ప్రకటనలే అందుకు నిదర్శనం. తమకు పెద్ద దిక్కయిన సౌదీ అరేబియా పాలకులతో కశ్మీర్ విషయమై చర్చించేందుకు ఇమ్రాన్ ఖాన్ రెండు సార్లు రియాద్‌కు వచ్చి వెళ్ళారు.

చివరగా ఐక్య రాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళే ముందు కూడా ఆయన సౌదీ అరేబియాకు వచ్చి యువరాజుతో చర్చలు జరిపారు. అనంతరం సౌదీ యువరాజు ఇచ్చిన ప్రత్యేక విమానంలోనే ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్ళారు. అంతకు ముందు ఆబుధాబి, సౌదీ అరేబియా యువరాజుల ప్రతినిధులుగా వారి కుటుంబీకులు ఇస్లామాబాద్‌కు వెళ్ళి ఇమ్రాన్ ఖాన్‌తో కశ్మీర్ వివాదంపై సంయమనం పాటించాలని నచ్చచెప్పి వచ్చారు. సౌదీ అరేబియా, యుఏఇ రాచరిక పాలకులు తలుచుకుంటే తమ పలుకుబడిని ఉపయోగించి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్‌ పై పాకిస్థాన్‌కు మద్దతుగా చర్చ జరిపించి, రచ్చ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆ రెండు దేశాలూ అందుకు పూనుకోకపోవడం గమనార్హం. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా అమెరికా పన్నాగంలో భాగంగానే అఫ్ఘానిస్తాన్‌లో జిహాద్ పోరాటం జరిగింది. ఈ యుద్ధంలో పాకిస్థాన్ ఒక కీలక భాగస్వామి.

ఇస్లామాబాద్ పాలకులు ఇచ్చిన సహాయ సహకారాలకు గాను ప్రతిఫలంగా పాకిస్థాన్‌కు అమెరికా, గల్ఫ్ దేశాలు పలు విధాల అండదండలనందించాయి (ఉసమా బిన్ లాదెన్ ఈ రకంగా అమెరికా ప్రోత్సాహంతో అఫ్ఘానిస్తాన్‌లో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వచ్చి అల్ ఖైదా ఏర్పాటు చేశారు). అఫ్ఘానిస్తాన్‌తో పాటు కశ్మీర్‌లో వేర్పాటువాదానికి పాక్ పాలకులు ఆజ్యం పోశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఇస్లామాబాద్ ఎంతగా ప్రొత్సహిస్తున్నా అరబ్ దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను భారత్ ఓర్పుగా అరబ్ దేశాలకు, ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వివరించి తాము ఏ రకంగా బాధితులమో చెప్పడంలో సఫలమయింది. ఈ సాఫల్యానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాలు, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పార్టీలకతీతంగా కృషి చేశాయి. అదే క్రమంలో మన ఆర్థిక వ్యవస్థ అసాధారణ పురోగతి కూడా గల్ఫ్ దేశాల ఆలోచనా విధానంలో మార్పులు చోటుచేసుకోవడానికి విశేషంగా దోహదం చేసింది.

ఒకప్పుడు అమెరికా, యూరోప్, ఆగ్నేయాసియా దేశాల మార్కెట్లను చూసిన చమురు ఉత్పాదక గల్ఫ్ దేశాలను, అనూహ్యంగా ఎదుగుతోన్న భారత మార్కెట్ బాగా ప్రభావితం చేసింది. భారత మార్కెట్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే అసలు పాకిస్థాన్ ఒక లెక్కలోకి కూడా రాదు. వీటన్నిటి కంటే మించి, ప్రస్తుతం సౌదీ అరేబియా, యుఏఇ లు యెమన్‌లో యుద్ధంలో మునిగి ఉండి కశ్మీర్ లేదా ఇతర వివాదాలను పట్టించుకొనే స్థితిలో లేవు. ఈ వాస్తవం కూడా భారత్‌కు కలిసివచ్చింది. ఇస్లామిక్ లేదా అరబ్ దేశమేదీ ప్రస్తుతం పాకిస్థాన్‌కు కశ్మీర్ విషయమై మద్దతు ఇవ్వడం లేదు. ఒక్క చైనా మాత్రమే భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు మద్దతు ఇస్తున్నది. చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలో ముస్లింలను చైనా సైన్యం కఠినంగా అణిచి వేస్తోంది. ఇటువంటి అణచివేత రొహింగ్యాలతో సహా ప్రపంచంలో మరెవ్వరిపైనా, మరే దేశంలోనూ జరగడం లేదు. అలాంటి చైనా మద్దతుతో పాకిస్థాన్, కశ్మీర్ ముస్లింల గురించి గుండెలు బాదుకోవడం హాస్యాస్పదం.

మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)