Oil-price-will-effect-to-modi

మోదీకి చమురు మంట తప్పదా?

రాబోయే రెండేళ్ళలో చమురు ధరలు క్రమేణా పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపించనున్న తరుణంలో, మోదీ ప్రభుత్వానికి చమురు మంట తగిలే అవకాశం ఎంతైనా ఉన్నది.
 
దేనికైనా కాలం కలిసి రావాలి అంటారు, రాజకీయాల్లో ఇది మరీ ముఖ్యం. దేశంలో కరువు, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొనివున్న పరిస్థితులలో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకొంది. అందునా ఎలాంటి చింత చికాకు లేకుండా పూర్తిచేసుకొంది. ఈ సాఫల్యానికి ప్రభుత్వ సమర్థత కంటే కాలమే ప్రధాన కారణమని చెప్పడం తప్పేమీ కాదు. మోదీ ప్రభుత్వం రెండేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పతనమవుతున్నాయి. ఈ పరిణామం మోదీ ప్రభుత్వానికి గరిష్ఠంగా ప్రయోజనం చేకూర్చి దేశ ఆర్థిక వ్యవస్థ దారి తప్పకుండా చేసింది. ఇది, మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకుండా వుండడానికి ఎంతైనా తోడ్పడింది.
 
              భారతదేశ ఆర్థిక వ్యవస్ధలో చమురు దిగుమతి బిల్లు అత్యంత కీలకమైంది. అంతర్జాతీయ విపణిలో చమురు ధర ఒక్క డాలర్‌ పెరిగితే భారతపై సుమారు రూ.6000కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పుడు అంతర్జాతీయ విపణిలో చమురు పీపాకు 105డాలర్లు ధర ఉన్నది. దీంతో మోదీ సర్కార్‌ తన తొలి వార్షిక బడ్జెటులో 110డాలర్లుగా అంచనా వేసింది. అయితే చమురు ధర అనూహ్యంగా 27డాలర్లకు పడిపోవడం ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చింది. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న దుర్భిక్ష పరిస్థితులకు తోడుగా చమురు ధరలూ అధికమైవుంటే ద్రవ్యోల్బణం పెరిగి మోదీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడివుండేది. అయితే ఆ విధంగా జరుగలేదు. ప్రజలపై ప్రత్యక్ష పన్నుల భారం మోపకుండా, ద్రవ్యోల్బణం పెరగకుండా మోదీ సర్కార్‌ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నది.
 
              సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇరాన్‌ దేశాల నుంచి భారతదేశం చమురును దిగుమతి చేసుకొంటుంది. యూఏఈ, ఇరాన్‌లకంటే సౌదీ నుంచే అత్యధికంగా దిగుమతి చేసుకొంటుంది. ఈ మూడు దేశాలనూ మోదీ సందర్శించారు. ఈ దేశాల ప్రభుత్వాధినేతలతో గరిష్ఠ స్థాయిలో సాన్నిహిత్యం పెంపొందించుకోవడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. సౌదీ పర్యటనలో రాజు సల్మాన్‌ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం గానీ, అబుదాబి యువరాజు మొహమ్మద్‌ భారత పర్యటన సందర్భంగా ప్రొటోకాల్‌కు భిన్నంగా ఆయనకు మోదీ స్వయంగా స్వాగతం పలుకడంగానీ, తాజాగా ఇరాన్‌ పర్యటనలో పర్షియన్‌ నాగరికతను ఘనంగా ప్రశంసిస్తూ చేసిన ప్రసంగంగానీ అందుకు తార్కాణం. ఈ మూడు దేశాలు, ప్రత్యేకించి సౌదీ నుంచి మార్కెట్‌ ధరలతో సంబంధం లేకుండా బాస్కెట్‌ విధానంలో కాకుండా కాంట్రాక్ట్‌ ధరలపై చమురును కొనుగోలు చేయడానికి భారత్‌ ప్రయత్నిస్తుంది, ఇది కేవలం రాజ కుటుంబీకులతో సాన్నిహిత్యం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే ఈ దిశగా మోదీ సర్కార్‌ ప్రయత్నిస్తుంది. భారతీయ కార్మికుల సమస్యలపై స్పందించినట్లుగా కనిపిస్తున్నా న్యూఢిల్లీ ఎక్కడా కూడా గల్ఫ్‌ ప్రభుత్వాలను నొప్పించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందుకు చమురు కారణమని మరి చెప్పాలా?
 
               అంతర్జాతీయంగా గత రెండేళ్ళలో చమురు ధరలు 75శాతానికి పైగా పడిపోయాయి. ఇందుకు అనుగుణంగా భారతలో చమురు ధరలను తగ్గించలేదు. పైగా సుమారు 60 శాతం సుంకాన్ని పెంచారు. చమురు ధర ఎక్కువగా ఉన్నప్పుడు రూ.4.52గా ఉన్న సుంకాన్ని, తక్కువగా ఉన్నప్పుడు మాత్రం 17.33కు మోదీ ప్రభుత్వం పెంచింది. తద్వారా గత రెండేళ్ళలో రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆదాయం సమకూరింది. ఈ భారీ రాబడిని మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. మున్ముందు ఈ అభివృద్ధి బీజేపీకి అనుకూలాంశంగా మారే అవకాశం ఎంతైనా ఉన్నది.
 

                వ్యవసాయానికి అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులలో వినియోగించే సహజవాయువు, ఇతర రసాయనాలనూ గల్ఫ్‌ దేశాల నుంచే భారత దిగుమతి చేసుకొంటోంది. వీటి ధరలు, సరఫరాల్లో మార్పులు రైతులపై గణనీయ ప్రభావం చూపుతాయి. 75శాతం రాయితీతో రైతులకు యూరియాను విక్రయించడం అత్యంత సున్నితమైన ఆంశం. అదృష్టం కొద్దీ సహజవాయువు ధరలూ తగ్గిరావడంతో ఎరువులకు కొరత లేకుండా పోయింది. తాము అధికారంలోకి రాగానే రైతన్నలు యూరియా కొరకు వేచి చూసే అవసరం లేకుండా చేశామని మోదీ ఇంటా బయటా సగర్వంగా చెప్పుకొంటున్నారు. ఒమాన్‌లో యూరియా ఉత్పత్తి కర్మాగారం ఉండగా ఇరాన్‌, సౌదీలలో కూడా యూరియా ప్లాంట్ల ఏర్పాటుకు భారత ప్రయత్నిస్తోంది.

దేశ ఆర్థికాభివృద్ధికి నిర్ణయాత్మకమైన చమురు దిగుమతుల విషయంలో ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదు. అయితే గత రెండు నెలలుగా చమురు ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. ఇది మున్ముందు మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు.
 

                రాబోయే రెండేళ్ళలో చమురు ధరలు క్రమేణా పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే లెక్క మొత్తం తప్పుతుంది. అప్పటికి, అంటే దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపించనున్న తరుణంలో, మోదీ సర్కారుకు చమురు మంట తగులవచ్చు.

 మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ 
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి