NRIs-role-in-increasing-Rupee-value

పతనమవుతున్న రూపాయి- ప్రవాసీ సాయం

దుబాయిలో పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గాదే మన్మధకు గత ఏడాది కాలంగా జీతం ఏ మాత్రం పెరుగలేదు కానీ, ఆయన ప్రతి నెల తన కుటుంబానికి భారత దేశానికి పంపించే డబ్బు మాత్రం పెరుగుతోంది, విచిత్రం కదూ! శరవేగంగా పతనమవుతున్న రూపాయి విలువ ప్రభావం ఇది. ఈ రకమైన పరిస్థితి వలన గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న లక్షలాది ప్రవాస భారతీయులు లబ్ధి పొందుతున్నారు. మరో వైపు ప్రతి వారం ఎక్కువ మొత్తం చెల్లించి పెట్రోలు పోయించుకుంటున్న వాహనదారులు, పతనమవుతున్న రూపాయి విలువకు ప్రతీకగా నిలుస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఏ రకమైన గణంకాలు చెబుతున్నా, ఇది వాస్తవ పరిస్థితి.

స్వదేశంలో ఉంటే, రూపాయి మారకం విలువ అందరికీ అంతగా తెలియకపోవచ్చు గానీ దేశం బయట నుండి చూస్తే మాత్రం క్షీణిస్తున్న రూపాయి విలువను అర్థం చేసుకోవచ్చు. 1947లో స్వాతంత్ర్వం వచ్చినప్పుడు డాలరు విలువ దాదాపు మూడున్నర రూపాయలు. అంటే, ప్రస్తుతం ప్రపంచంలోని శక్తివంతమైన కరెన్సీలలో ఒకటయిన ఇప్పటి సౌదీ అరేబియా రియాళుకు డాలర్తో ఉన్న రేటు. అలాంటి మన రూపాయి స్వాతంత్ర్య భారతంలో 77 రెట్లు పతనమయింది. చైనా, పాకిస్థాన్ యుద్ధాలు, తీవ్ర కరువు కారణంగా దిగుమతులు పెరిగిపోయి మొదటి సారిగా దిగజారిన రూపాయి విలువ నేటికి మరింతగా పడిపోతోంది. దేశం ఎంత వెలిగిపోతున్నప్పటికీ రూపాయి ఎందుకు పతనమవుతుందో పాలకులు చెప్పలేకపోతున్నారు.
 
1985లో ఒక డాలరుకు 12 రూపాయిలు ఉన్న విలువ, 1995లో 32 రూపాయిలకు పడిపోయింది. ఈ విధంగా ప్రతి ఏడాది రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతోంది తప్ప స్థిరపడింది లేదు. చారిత్రాత్మకంగా ఇప్పుడు ఏకంగా 72 రూపాయాలకు పతనమైంది. పని చేయని గత ప్రభుత్వాల హయాంలో రూపాయి విలువ పడిపోయిందంటె అర్థం చేసుకోవచ్చు గానీ, ప్రజల కొరకు పని చేస్తున్నట్లుగా చెప్పుకొనే మోదీ సర్కారు హయంలో కూడా రూపాయి విలువ గత ప్రభుత్వాల కంటే దారుణంగా పడిపోతుండడం దారుణం. అంతర్జాతీయ ప్రతికూలత కారణమంటున్న బిజెపి----- టర్కీ, బ్రెజిల్ దేశాల ఆర్థికాభివృద్ధి రేటు గురించి చెప్పడం లేదు. మన విదేశీ మారకం నిల్వలలో సింహభాగం గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకొనే చమురు కొరకు వెచ్చించడం జరుగుతుంది. అది నాణేనికి ఒక వైపు మాత్రమే, మరో వైపు గల్ఫ్ దేశాల నుంచి ప్రవాసీయులు భారీ మొత్తంలో పంపించే విదేశీ మారకం దాదాపుగా చమురు దిగుమతులకు సరిపోతుంది. అందుకే కేంద్రం గల్ఫ్ దేశాలలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వలసలను ప్రొత్సహిస్తోంది.
 

2004లో యుపిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగి, ప్రైవేటు రంగం పుంజుకుని, సరళీకరణ ఫలాలతో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఏకంగా 9 శాతాన్ని తాకింది. అయితే, 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం భారత వృద్ధి రేటుపై కూడ ప్రభావం చూపడంతో రూపాయి విలువ మందగించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా గత ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ ప్రజలలోకి విజయవంతంగా తీసుకెళ్ళింది. రూపాయి విలువ కాదు దేశ గౌరవం పడిపోయిందంటూ 2014 ఎన్నికలలో బిజెపి విమర్శించగా, ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలు వ్యూహాత్మకంగా ఇరాన్‌ను ఏకాకి చేస్తుండడం, చైనా – అమెరికా వాణిజ్య వివాదం కూడా భారతీయ రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా విదేశీ పెట్టుబడులు అంతగా వచ్చే అవకాశాలు లేవు. చైనాను కాదని భారత్ వైపు పెట్టుబడులు రావు. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశీ పెట్టుబడిదారులపై కాకుండా, విదేశాలలో ఉంటున్న ప్రవాసీయులపై ఆశగా చూడడం మొదలు పెట్టింది. భారతీయ రూపాయి బలహీనపడి, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితులలో ప్రవాసీయులు మాతృదేశానికి అండగా నిలిచారు. 1998, 2000, 2013లో రిజర్వు బ్యాంకు ప్రవాస భారతీయుల నుండి ప్రత్యేక పథకాల ద్వారా నిధులు సేకరించి విదేశీ మారకం నిల్వలను పెంచుకొంది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కూడా మళ్లీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. కానీ అప్పటికి, ఇప్పటికీ అటు అమెరికాలో గానీ ఇటు గల్ఫ్‌లో గానీ ఆర్థిక పరిస్థితులలో భారీగా మార్పులు చోటుచేసుకొన్నాయి. బలహీనమవుతున్న రూపాయి విలువ అనేది పెట్రోలు పంపు వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఈ పరిస్థితి ఏ ప్రభుత్వానికీ శ్రేయస్కరం కాదు. ఇందుకు ఎన్నికలలో తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

 మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)