NRI-Sikhs-Dream-fulfilled-with-Kartarpur-Corridor-Opening

ఫలించిన సిక్కుల స్వప్నం

ఉప్పు, నిప్పుగా ఉండే భారత్, పాకిస్థాన్‌లు ఒక ధార్మిక ఆచారం, ఆరాధనను గౌరవించేందుకు తమ పంతాలను పక్కన పెట్టి గురునానక్ జయంతి సందర్భంగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఉభయ దేశాల మధ్య కర్తార్‌పూర్ నడవా కార్యరూపం దాల్చడంలో ప్రవాస సిక్కులు ప్రశస్త పాత్ర నిర్వహించారు.

పంజాబీ సిక్కు ప్రవాసులు పశ్చిమాసియాలో కంటే అమెరికా, కెనడా, బ్రిటన్, యూరోపియన్ దేశాలలో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఈ ప్రవాస భారతీయులు తమ పూర్వీకుల మాతృభూమి, భాష, సంస్కృతిని అమితంగా అభిమానించడం కద్దు. విజయవాడలో పుట్టి పెరిగి దుబాయిలో స్ధిరపడ్డ సురేందర్ సింగ్ కందహారీని ఇందుకొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈయనకు విజయవాడ కంటే పాంచాళమే (పంజాబ్) ఆత్మీయమైనది. ఈ సర్దార్జీ సదా పంజాబ్‌ను పలవరిస్తుంటారు. దుబాయి గురుద్వారా కమిటీకి సురేందర్ సింగే అధ్యక్షుడు. దుబాయిలో ఆయన గృహం పాకిస్థాన్ మాజీ ప్రధాని కీర్తిశేషురాలు బేనజీర్ భుట్టో నివాసానికి సమీపంలో వుండేది. బేనజీర్‌కు ఆయన సుపరిచితుడే.
 
ఈ పరిచయాన్ని పురస్కరించుకుని కర్తార్‌పూర్ సాహిబ్‌ను భారతీయ యాత్రికులు సందర్శించేందుకు అనుమతించాలంటూ బేనజీర్‌కు సురేంద్ర సింగ్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు పరిచయమున్న ఇతర పాకిస్థాన్ నాయకులతో కూడా ఈ విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించేవారు. ఇదుగో ఇటువంటి ప్రవాస సిక్కులు పలు సంవత్సరాలుగా చేసిన అనేక ప్రయత్నాల ఫలితంగానే ఎట్టకేలకు కర్తార్‌పూర్ వారధి కార్యరూపం దాల్చింది. సిక్కుల చిరకాల ఆకాంక్ష నెరవేరడంలో ప్రవాస సిక్కుల కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వమూ గుర్తించింది. కనుకనే కర్తార్‌పూర్ నడవా ప్రారంభోత్సవానికి కొంత మంది ప్రవాస సిక్కులను ఆహ్వానించారు.
 
దేశ విభజన నిస్సందేహాంగా పంజాబీలను అందునా సిక్కులను, వారి ఆరాధనా మందిరాలైన గురుద్వారాలను సైతం చెల్లాచెదురు చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దుకు రావి నది తీరాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో ఆ నదికి ఆవలి వైపు వున్న కర్తార్‌పూర్‌లోని గురునానక్ దేవ్ సాహిబ్ పాకిస్థాన్‌కు వెళ్ళిపోయింది. దీంతో రావి నదికి ఈవల వైపు ఉన్న పంజాబ్ లోని సిక్కు మతస్థులకు తమ పుణ్య క్షేత్రాన్ని సందర్శించే అవకాశం లేకుండాపోయింది. సిక్కు మతానికి పుట్టినిల్లయిన కర్తార్ పూర్‌లోని గురుద్వారా కాలక్రమేణా శిథిలమైపోయింది. కనీసం అక్కడికి ఎవరైనా వెళ్ళి ప్రార్ధనలు చేసే అవకాశం గానీ వసతులు గానీ లేకుండాపోయాయి.
 
దేశ సరిహద్దు సమీపంలో నిలువెత్తు గడ్డి మొక్కల మధ్యలో సుదూరంగా కనిపించే శిథిల గురుద్వారా భవంతిని చూస్తూ కీర్తనలు ఆలాపించి భారతీయ సిక్కులు సంతృప్తి పడుతుండేవారు. దీన్ని బట్టి సిక్కులు తమ పుణ్యస్థలిని సందర్శించేందుకు ఎంత దయనీయమైన పరిస్ధితి నెదుర్కొనేవారో ఉహించుకోవచ్చు. ఇటువంటి దుర్భర నేపథ్యంలో విదేశాలలో ఉన్న సిక్కులు 1995 నుంచి పాకిస్థాన్ వీసా పొంది కర్తార్ పూర్‌ను సందర్శించడం ప్రారంభమయింది. కర్తార్ పూర్‌ను సందర్శించేందుకు సిక్కు మతస్థులందరినీ అనుమతించాలని కోరుతూ వివిధ దేశాలలోని ప్రవాస సిక్కులు పాక్ పాలకులపై స్నేహపూర్వక శైలిలో ఒత్తిడి తెచ్చారు. జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌ హయాంలో ఈ విషయమై పురోగతి కనిపించింది, కర్తార్ పూర్‌ను సందర్శించేందుకు ఆయన పాకిస్థాన్‌లోని సిక్కులను అనుమతించారు. 2005లో ప్రప్రథమంగా భారతీయ సిక్కులను కర్తార్ పూర్ సందర్శనకు అధికారికంగా అనుమతించారు. ఆ తర్వాత నానక్ సాహిబ్‌కు మరమ్మత్తు పనులు చేపట్టారు. ప్రతి ఏటా గురునానక్ జయంతి, ఇతర ప్రధాన ఉత్సవాల సందర్భంగా సిక్కు సందర్శకుల బృందాలకు పాకిస్థాన్ వీసాలు జారీ చేసేవారు.
 
ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తరువాత సిక్కుల ఆకాంక్ష నెరవేరడంలో మరింత పురోగతి కన్పించింది. పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారతీయ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ఆ సందర్భంగా పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ బాజ్వా ఆయన్ని ప్రేమాదరాలతో ఆలింగనం చేసుకున్నారు. దీనిపై భారత్‌లో వెల్లువెత్తిన విమర్శలకు వివరణ ఇస్తూ కర్తార్ పూర్ వారధిని నిర్మించే ప్రతిపాదన పరిశీలనలో వున్నదని జనరల్ బాజ్వా అన్నారని సిద్ధూ చెప్పారు. ఆ తరువాత కర్తార్ పూర్ లో నానక్ సాహిబ్ పునరుద్ధరణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. అమృత్ సర్‌లోని స్వర్ణాలయానికి దీటుగా దర్బార్ సాహిబ్ సిద్ధమైంది.
 
కర్తార్ పూర్‌లో నానక్ సాహిబ్ వారధి ప్రారంభోత్సవ సభలో ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో సిద్ధూ చేసిన ప్రసంగానికి మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. కానీ, అదే సభలో ఒక సిక్కు మతస్ధురాలిగా కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ చేసిన ఉద్వేగభరిత ప్రసంగానికి దురదృష్టవశాత్తు మీడియాలో పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న బాబా గురునానక్ వద్దకు రావడానికి తాము 70 సంవత్సరాలు ప్రార్ధనలు చేసామని, దూరం నుండి తాము చేసిన ప్రార్ధనలను తమ దేవుడు చివరకు విన్నాడని కౌర్ ఎంతో ఉద్విగ్నంగా చెప్పినప్పుడు ఇమ్రాన్ ఖాన్‌తో సహా సభికులందరు ఒక్క సారిగా చలించిపోయారు. అందుకే ముస్లింలకు మదీనా ఏలాంటిదో, సిక్కులకు కర్తార్‌పూర్ అలాంటిదని ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో చెప్పారు. కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్ళడానికి చైనా ప్రభుత్వానికి రూ. 2400 వీసా ఫీజు చెల్లిస్తుండగా లేని ఇబ్బంది, సాహిబ్‌లో లంగర్ (అన్నదానం) నిర్వహిస్తున్న పాకిస్థాన్‌కు సర్వీసు పన్ను కింద రూ. 1420 చెల్లించే విషయమై మాత్రం ఎదురయింది. ఉప్పునిప్పుగా ఉండే భారత్, పాకిస్థాన్‌లు ఒక ధార్మిక ఆచారం, ఆరాధన కొరకు తమ పంతాలను పక్కన పెట్టి గురునానక్ జయంతి సందర్భంగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం ముదావహం.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)