NRI-Dalits-in-Gulf-Jails-

మరణశయ్యపై ప్రవాస దళితుడు

గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న దళితుల సమస్యలు ఇతర సామాజిక వర్గాల వారి సమస్యల వలే వెలుగులోకి రావడం లేదు. దురదృష్టవశాత్తు దళిత నాయకులు ఇటు తెలంగాణలో గానీ అటు ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ దిశగా ఇప్పటి వరకు దృష్టి సారించినట్లుగా కనిపించదు. షార్జా జైలులో మగ్గుతున్న దరూరి బుచ్చన్నను విడుదల చేయించడానికి పౌర సమాజం,  ప్రత్యేకించి దళిత నాయకత్వం శ్రద్ధ చూపాలి.

 
అత్యవసర పరిస్థితి కాలం(1975-–77)లో ఇందిరా గాంధీ అమలుపరిచిన 20 సంక్షేమ సూత్రాలలో ఇళ్ళ నిర్మాణం, భూ పంపిణీ పథకాలతో పాటు అప్పుడే ప్రారంభమైన గల్ఫ్ వలసలు తెలుగు రాష్ట్రాల దళితుల జీవితాలపై పెను ప్రభావం చూపాయి. కోస్తాంధ్ర నుంచి మాలలు, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మాదిగలు ఎడారి దేశాలకు రావడం మొదలయింది.
 
ఆ రకంగా అప్పటి నుంచి మొదలయిన గల్ఫ్ వలసలు ఇంకా కొనసాగుతూనేవున్నాయి. ప్రభుత్వ పథకాల కంటె ఎన్నో రెట్లు ఎక్కువగా గల్ఫ్ సంపాదనతో తమ జీవిత దశ, దిశలను దళితులు మార్చుకున్నారు. ప్రవాసంలో ఇతర సామాజిక వర్గాల వారి మాదిరిగా దళితులు ప్రధాన స్రవంతిలో మిళితం కావడం అంత సులువుగా జరగలేదు. క్రైస్తవ మతాన్ని ఆచరించే కోస్తాంధ్ర మాలలు ఒకింత వ్యవస్థీకృతంగా ఉన్నప్పటికీ, హిందూ మతాన్ని ఆచరించే తెలంగాణ మాదిగలు ఇప్పటికీ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నారు. మాలల తరహాలో విద్యాధికులు కాకపోవడంవల్ల మధ్య లేదా చిన్న తరగతి ఉద్యోగాలు దక్కించుకోలేక భవన నిర్మాణరంగంలో కార్మికులుగా మాత్రమే అత్యధిక మాదిగలు పని చేస్తున్నారు. గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న ఇతర సామాజిక వర్గాల వారి సమస్యలు వివిధ మార్గాలలో విస్తృతంగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే దళితుల సమస్యలు అలా వెలుగులోకి రాకపోవడంతో వారి గూర్చి బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. దురదృష్టవశాత్తు దళిత నాయకులు ఇటు తెలంగాణలో గానీ అటు అంధ్రప్రదేశ్‌లో గానీ ఈ దిశగా ఇప్పటి వరకు దృష్టి సారించినట్లుగా కూడా కనిపించదు.
 
ప్రవాసంలో ఒక రకమైన ఏకాంత వాసంలో ఉండే దళితులలో కొందరు జీవన్మరణ సమస్యలు ఎదుర్కొంటున్నారు. తగు మార్గదర్శకత్వం, మద్దతు లేకపోవడంతో వారు మౌనంగా నలిగిపోతున్నారు. ఈ రకంగా తెలంగాణకు చెందిన ఒక దళితుడు నిస్సహాయంగా దాదాపు రెండు దశాబ్దాలుగా జైలులో గడుపుతూ మానసిక రోగానికి గురయ్యాడు. దీంతో ఇతర ఖైదీలతో అతను కనీసం తన గోడు చెప్పుకొనే అవకాశం లేదు.
 
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దరూరి బుచ్చన్న అనే వ్యక్తి అవేశంలో అనుకోకుండా జరిగిన ఒక ఘర్షణలో మరో తెలుగు వ్యక్తి మరణానికి కారణమై గత 19 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. షార్జా జైలులో శిక్ష గడుపుతున్న భారతీయ ఖైదీలందరిలోనూ బుచ్చన్నే అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇతర ఖైదీల కంటే బుచ్చన్నకు చాలా సులువుగా విడుదలయ్యే మార్గాలున్నప్పటికీ ఆయన దుస్థితిని పట్టించుకొనేవారెవరూ లేకపోయారు. ఫలితంగా ఆ అభాగ్యుడు తన జీవితంలో చాలా విలువైన కాలాన్ని జైలులోనే గడుప వలసివస్తున్నది. దీనికి జైలు లోపల ఉన్న బుచ్చన్న కంటే ఆయన సంబంధీకులే కారణం. మరీ ముఖ్యంగా వారి సామాజిక నేపథ్యం.
 
తనతో పాటు కలిసి ఉండే నిజామాబాద్ జిల్లావాసి బి. గోవర్ధన్‌తో వంట గది విషయంలో బుచ్చన్న గొడవ పడ్డాడు. ఆ గొడవ తీవ్ర ఘర్షణగా పరిణమించింది. ఆ కొట్లాటలో గోవర్ధన్‌ మరణించాడు. 2001లో ఈ దుర్ఘటన సంభవించింది. గోవర్ధన్‌ మరణానికి బుచ్చన్నను దోషిగా తేలుస్తూ షార్జా ఇస్లామిక్ న్యాయస్థానం అతనికి యావజ్జీవ శిక్ష విధించింది (అక్కడ ‘యావజ్జీవ శిక్ష’ అంటే మరణ పర్యంతం జైల్లో ఉండాల్సిందే).
  
గల్ఫ్‌లో ఇస్లామిక్ చట్టాల ప్రకారం, హత్యకు గురి కాబడ్డ వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమించినట్లుగా ప్రకటిస్తే, హంతకుడి శిక్షను రద్దు చేసి జైలు నుండి విడుదల చేయడం జరుగుతుంది. దీన్ని అరబ్బి భాషలో ‘తనజ్జుల్’ అని అంటారు. ఈ రకంగా చాలా కేసులలో అనేకమంది తెలుగువారు– సోమాలియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, చివరకు పాకిస్థాన్‌ నుంచి కూడా బాధితుల కుటుంబాల నుంచి తనజ్జుల్ తీసుకుని జైళ్ళ నుంచి విడుదలవ్వడం జరిగింది. ఇదే నిజామాబాద్ జిల్లా దోమకొండకు చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కారు నడిపి జైలు పాలైన సిరియా దేశస్థుడు ఒకరు 5 వేల కిలో మీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులకు డబ్బు చెల్లించి తనజ్జుల్ పొంది జైలు నుండి విడుదలయ్యాడు. ఇలా సుదూరాన ఉన్న దేశాల వారికి సాధ్యమయ్యే తనజ్జుల్, 63 కిలో మీటర్ల దూరంలో ఉన్న బాల్కొండ, రాయికల్ మండలాలలోని రెండు తెలుగు కుటుంబాల మధ్య సాధ్యం కావడం లేదు!
 
చనిపోయిన గోవర్ధన్‌ కూడా పేదరికం నుంచి వచ్చిన వాడే. వెనుకబడిన వర్గానికి చెందినవాడు కూడా. స్వగ్రామంలోని బంధువుల వద్ద అప్పు చేసి గల్ఫ్‌కు వచ్చి అనుకోకుండా బుచ్చన్న చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. బుచ్చన్నను క్షమించడానికి గోవర్ధన్ భార్య రాధ అడిగింది మూడు లక్షల రూపాయాలు, ఉండడానికి ఒక ఇంటి స్థలం మాత్రమే. అయితే సామాజిక సంబరాలకు లక్షల రూపాయలు ధారపోసే ప్రవాస సమాజం దురదృష్టవశాత్తు ఈ దళితుని పక్షాన మూడు లక్షల రూపాయలు సేకరించి ఇవ్వడానికి మాత్రం ముందుకు రాలేదు. జైలులో బుచ్చన్నను కలిసిన మహబూబ్ నగర్ జిల్లా ‘శ్రామిక శక్తి’ నాయకుడు పి. నారాయణ స్వామి తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు వ్యవహారం కావడంతో వెనక్కి వెళ్ళారు.
 
ఇక, బుచ్చన్న కుటుంబంలో అతని వృద్ధతల్లి మాత్రమే తన కుమారుని గురించి తపిస్తోంది, సోదరులలో ఒకరు గ్రామసేవకుడిగా, మరొకరు వ్యవసాయ కూలీగా పని చేస్తూ బతుకుబండి ఈడుస్తున్నారు. ఎవరూ ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో బుచ్చన్న మనోవేదనకు గురయి తీవ్ర మనో వైకల్యానికి గురయ్యాడు. మానసిక రుగ్మతలో జైలు గోడలకు, గ్రామంలో పంట పొలాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోలేని దుర్భర స్థితిలో ఒక జీవచ్ఛవంలా కాలం గడుపుతున్నాడు.
 
గోవర్ధన్‌ మరణం అనేది అకస్మాత్తుగా జరిగిన ఒక దుర్ఘటన. కానీ బుచ్చన్న రేపు మరణిస్తే అది అకస్మాత్తుగా సంభవించిన మరణం కాదు కదా. జైలులో కునారిల్లుతున్న బుచ్చన్న మరణిస్తే, దాని వలన గోవర్ధన్ కుటుంబం సాధించేది ఏమీ ఉండదు. పౌర సమాజం, ప్రత్యేకించి దళిత నాయకత్వం ఈ విషయంలో శ్రద్ధ చూపాలి.
 
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)