NRI-arrested-in-Gulf

ఆరోగ్యం కోసం రాగులు తీసుకెళితే.. జైలు కూడు దిక్కయింది

  • హైదరాబాద్‌ నుంచి 2కిలోలతో గల్ఫ్‌కు... విమానం దిగగానే అరెస్టు
  • ఎడారి దేశంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు చిక్కులు
(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ఎండకాలంలో చల్లటి రాగి (తైద) అంబలి తాగినా..  రాగి పిండితో చేసిన వంటకాలు తిన్నా ఒంటికి ఎంతో మంచింది. గల్ఫ్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆ హైదరాబాదీ ఇలాగే ఆలోచించాడు. రెండు కిలోల రాగులను వెంటబెట్టుకొని విమానం ఎక్కాడు. ఇదే ఆయన చేసిన నేరమైంది. ఈ దినుసును గల్ఫ్‌కు తేవడాన్ని అక్కడి కస్టమ్స్‌ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అంబర్‌పేటవాసి కట్టకపు సంతోష్‌ రెడ్డికి ఎదురైందీ కష్టం! సంతోష్‌.. యూఏఈలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వెంట 2కిలోల బరువున్న నాలుగు రకాల రాగులను హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. అబుదాబి విమానాశ్రయంలో సంతోష్‌ లగేజీని తనిఖీ చేసిన అధికారులు.. అతడి వద్ద రాగులు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌  బావమరది, అతడి బంధుమిత్రులు కూడా దుబాయిలోనే పని చేస్తున్నారు. వారెవరికి కూడా కొన్ని దినుసులపై ఇక్కడ నిషేధం ఉందన్న సంగతి సంతోష్‌ పట్టుబడేదాకా తెలియదు. నిషేధిత వస్తువులతో పట్టుబడితే గల్ఫ్‌లో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అనంతరం వీసాను రద్దు చేసి దేశం నుంచి బహిష్కరిస్తారు.  కాగా సంతోష్‌ విడుదలకు సహకరించాలని ఆయన భార్య అనిత అబుదాబిలోని భారతీయ రాయబార కార్యాలయం అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంతోష్‌   తీసుకొచ్చిన రాగులను అధికారులు ల్యాబ్‌కు పంపించారని,  నివేదిక వచ్చాక కేసులో స్పష్టత వస్తుందని సమాచారం.   గసగసాలపై గల్ఫ్‌లో నిషేధం ఉంది. కప్ప.. పంది మాంసం, జంతువుల రక్తంతో వండిన పదార్థాలు, ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా తీసుకెళ్లే మందులను ఇక్కడికి తేవడంపై నిషేధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. గతంలో పచ్చళ్లు, అప్పడాలనూ అనుమతించేవారు కాదు.