No-free-is-there

ఉచితాల ఊసే లేదిక్కడ?

ఏ రకమైన ఉచిత సామగ్రిని వ్యక్తిగతంగా తమ పౌరులకు పంపిణీ చే సి ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేందుకు అరబ్‌ పాలకులు ఆంగీకరించరు. తమిళనాడులో జయలలిత, అంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలు చేసిన ఉచిత వాగ్దానాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
 
గల్ఫ్‌లోనే కాకుండా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల జాబితాలో గల్ఫ్‌ కూటమిలోని కువైత్‌, ఆబుధాబి(యూఏఈ), సౌదీ అరేబియాలు ఉన్నాయి. ప్రత్యేకించి కువైత్‌, ఆబుధాబిలు స్వల్ప జనాభాకు తోడుగా ఎక్కువ ఆదాయం ఆర్జించే దేశాలు ఇవి. జనాభా పరంగా మొత్తం గల్ఫ్‌లో పెద్దదైన సౌదీ అరేబియా ఆదాయంతో పోల్చితే ఈ దేశాల్లో జన సంఖ్యను పెద్దగా పరిగణలోకి తీసుకోవల్సిన విషయం కాదు. చమురు ధర పది డాలర్లకు పడిపోయినా ఈ ప్రభుత్వాల వద్ద రెండు తరాల జనాభా ఖర్చును భరించే స్ధాయి నిధులు ఉన్నాయి. గల్ఫ్‌ జనాభాలో అత్యధికలు అరబ్బు తెగల బద్దులు. ఈ రాజ్యాల రూపకల్పనలో వీరిది కీలక పాత్ర. అందుకే అరబ్బు తెగల వ్యవహారాలను గల్ఫ్‌ రాజులే స్వయాన పరిశీలిస్తారు. ఎక్కడ కూడా ఏ తెగకు చెందిన వారికి ఇబ్బంది కల్గకుండా చూస్తారు. తమ ప్రజానీకం సంక్షేమానికి పెద్ద పీట వేస్తారు. వ్యక్తిగత ప్రయోజనాలకు, ప్రజాకర్ష పథకాలకు ఏ మాత్రం ఆవకాశం ఉండదు. వ్యక్తిగత లబ్ధి కాకుండా సామాజికంగా అందరికీ ఒక పద్ధతి ప్రకారం రాజ్యమే చేయూతనిస్తుంది.
 
చమురు నిక్షేపాలు వెలుగులోకి రాకముందు కనీసం తాగడానికి నీళ్ళు లేని గల్ఫ్‌ రాజ్యాలు అనతికాలంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ రంగంలో అన్యూహమైన పురోగతి సాధించాయి. అరబ్బు దేశాల నుంచి ఉపాధ్యాయులను భారత్, పాకిస్థాన్‌ దేశాల నుంచి వైద్యులను, ఇంజనీర్లను అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి, తమ ప్రజలు అభివృద్ధి చెందే విధంగా సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టాయి. 1940 దశకంలో చమురు నిక్షేపాలు వెలికితీసే సందర్భంగా చమురు రిగ్గుల వద్ద అమెరికన్లు అన్నం తింటుంటే వారి వైపు ఆకలిగా చూసిన అరబ్బులు, ఈ రోజు ఆర్థిక రంగంలో వారితో ఢీకొనే స్థాయికి ఎదిగారు. గల్ఫ్‌ రాజ్యాలు ఉచిత వరాలు ఇచ్చి తమ ప్రజలను సోమరిపోతులుగా చేయడంలేదు. కానీ ప్రభుత్వం కల్పిస్తున్న ఉదార సంక్షేమ పథకాలు, ఆకర్షణీయమైన వేతనాల వల్ల అరబ్బులలో కష్టపడే గుణం తగ్గి, దాని స్థానంలో విలాసాలు అలవాటు కావడం పాలకులకు నచ్చడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వాలు పడిపోతున్న ఆదాయాన్ని బూచిగా చూపి సబ్సిడీలలో కోత విఽధిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా తమ నైపుణ్యం, అర్హత ఆధారంగా ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉద్యోగాలు పొందే విధంగా తమ యువతను ప్రొత్సహిస్తున్నారు. విస్తారంగా ఎడారులలో గోధుమలను కూడా పండి స్తున్నారు. నీటి చుక్క లేని ఎడారిలో అవసరానికి తగినట్లుగా నీరు, ఎయిర్‌ కండిషన్‌కు నిరంతర విద్యుత్‌ తదితర సదుపాయాలను ప్రభుత్వం నామమాత్ర ధరకు సబ్సిడీపై ప్రజలకు అందిస్తుంది. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినా లేదా పాఠశాలకు వెళ్ళినా అక్కడి వసతులను చూసి ఆశ్చర్యపడక తప్పదు. అరబ్బు దేశాలలో స్థానిక అరబ్బులకు గృహ వసతి సమస్య ఉంది. అయి నప్పటికీ ప్రభుత్వాలు ఉచితంగా గృహ వసతిని కల్పించడానికి ఇప్పటికీ సుముఖంగా లేవు. భూమితో పాటు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వడం ఏ మాత్రం సమస్య కాదు. కానీ అది అలవాటుగా మారి కష్టపడే స్వభావం తగ్గుతుందని పాలకులు దాని జోలికి వెళ్ళలేదు. అతి అరుదుగా ఆబుధాబి, సౌదీ రాజులు ఉచిత ఇళ్ళను ఇస్తుంటారు. ఏ రకమైన ఉచిత సామగ్రిని వ్యక్తిగతంగా తమ పౌరులకు పంపిణీ చే సేందుకు అరబ్‌ పాలకులు ఆంగీకరించరు.
 

ఇక ఇప్పుడు మన దేశానికి వద్దాం.. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన ఉచిత వరాలు గానీ, గతంలో అంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలు చేసిన ఉచిత వాగ్దానాలను గానీ గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తలసరి ఆదాయం 50 వేల డాలర్లు కలిగిన ఆబుధాబిలోని కొద్దిమంది జనాభాకు ప్రపంచంలోనే అత్యధిక సంపద గల అల్‌ ఖలీఫా సైతం ఇవ్వని ఉచిత సేవలను, వారితో పోలిస్తే అత్యధికంగా ఉన్న తమిళనాడు ప్రజలకు అమ్మ జయలలిత పెద్ద సంఖ్యలో ఉచితాలు అందించ నున్నట్టు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ, రాష్ర్టాల స్థాయిలో తమిళనాడులో ఎమ్జీఆర్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌లు శ్రీకారం చుట్టిన ప్రజాకర్ష పథకాలు నేడు వికృత స్థాయికి చేరుకున్నాయి. ఇందుకు ప్రజలు, రాజకీయపార్టీలు ఇద్దరూ సమబాధ్యులే.

 మొహమ్మద్‌ ఇర్ఫాన్ 
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి