new-taxes-in-gulf-countries-

గల్ఫ్‌లో పన్నుల పోటు

సౌదీ అరేబియాలో వ్యాట్‌తో పాటు విద్యుత్, పెట్రోలియం ధరలను అమాంతం పెంచడంతో స్థానిక పౌరులతో పాటు, సౌదీలో ఉంటున్న 32 లక్షలమంది భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో నిధులు అందక జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు ఇతర విదేశీ ఉద్యోగులు, కార్మికులకు నూతన పన్నుల విధానం శరాఘాతంగా పరిణమిస్తుంది.

 ఇప్పటి వరకూ ఎలాంటి పన్ను పోటు లేకుండా హాయిగా ఉన్న గల్ఫ్ దేశాలలో ఇప్పుడు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) గల్ఫ్‌ వాసుల జేబులకు చిల్లు కొడుతుంది. సంప్రదాయ చమురు ఎగుమతుల ఆదాయ వనరు కాకుండా ఇతర మార్గాల ద్వారా జాతీయ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ -వ్యాట్‌ను ప్రవేశపెట్టాయి. ఆదాయ వనరులను పొదుపుగా క్రమశిక్షణగా వాడుకోవాలనే భావం తమ పౌరులలో కల్పించాలని కూడా ఈ రెండు దేశాల ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. దీంతో, సగటు ప్రవాస భారతీయులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న భారీ భారతీయ కార్పోరేట్ సంస్థలకు కూడా పన్ను వాత గణనీయంగా పడనుంది.
 
ప్రపంచంలో కెల్లా స్వల్పంగా, కేవలం 5 శాతంతో వ్యాట్ ను ఈ రెండు దేశాలు వసూలు చేస్తున్నాయి. ప్రతి వస్తువును, దాదాపు అన్ని సేవలను వ్యాట్ పరిధిలోకి తీసుకురావడంతో తాగే నీళ్ళ నుండి ప్రతి వస్తువూ ప్రియం కానుంది. తాగు నీళ్ళు, బియ్యం, గోధుమ పిండి, పాలు, మందులు, పాఠశాల ఫీజులు... ఇలా ప్రతి వస్తువుపై పన్ను పడుతుంది. సాంకేతికంగా పన్ను 5 శాతం అని ప్రకటించినా షిప్పింగ్, బీమా, విద్యుత్, సేవలన్నీ కలిపి ఒక వస్తువు దిగుమతి పై 5 శాతం చొప్పున చెల్లించుకుపోతే సుమారు 15- – 20 శాతం వరకు పరోక్షంగా పన్ను పడుతుంది. పెద్ద సంస్థలలో దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నప్పటికీ భారతీయులు ఇతర దక్షిణాసియా దేశస్థులు నడిపే చిన్న చిన్న దుకాణాలు, టీ కొట్లు, లాండ్రీ మొదలగు చిన్న చిన్న సేవా సంస్థలు, దుకాణాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ పన్ను కంటే చిల్లర నాణేలు సమస్యగా మారాయి. ద్రవ్యోల్బణం నిమిత్త మాత్రమని సౌదీ అరేబియా, యు.ఏ.ఇ చెబుతున్నా ఎంత వరకు దీని ప్రభావం అన్నది మున్ముందు తేలనుంది.
 
తెలుగు రాష్ట్రాల వారితో పాటుగా అనేక మంది భారతీయులు యు.ఏ.ఇలోని ఫ్రీ ఎకానిమి జోన్ (స్వేచ్ఛాయుత ఆర్థిక మండళ్ళ)లలో కొన్ని వేల సంఖ్యలో వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నారు. యు.ఏ.ఇలో మొత్తం 45 వరకూ ఫ్రీ జోన్లు ఉన్నాయి. ఈ ఫ్రీజోన్ల పై ఇప్పటి వరకు ఎలాంటి పన్ను లేదు. కానీ ఇప్పుడు వ్యాట్ అమలు తర్వాత జోన్ల బయటకు సరఫరా అయ్యే వస్తువులు అందించే సేవలపై మాత్రం 5 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ ఫ్రీ జోన్లన్నీ యు.ఏ.ఇ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను సరఫరా చేస్తాయి కాబట్టి విధిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యాట్ ప్రవేశంతో ఫ్రీ జోన్ల సేవల దుర్వినియోగాన్ని కూడా చాలా వరకూ అరికట్టవచ్చు.
 
సౌదీ అరేబియాలో వ్యాట్‌తో పాటు విద్యుత్, పెట్రోలియం ధరలను అమాంతం పెంచడంతో స్థానిక పౌరులతో పాటు, సౌదీలో ఉంటున్న 32 లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో నిధులు అందక జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కోంటున్న భారతీయులు ఇతర విదేశీ ఉద్యోగులు, కార్మికులకు నూతన పన్నుల విధానం శరాఘాతంగా పరిణమిస్తుంది.
 
సందర్శక వీసాలపై వచ్చి వెళ్లే సందర్శకులకు మాత్రం తిరిగి వెళ్లే సమయంలో విమానాశ్రయాలలో వారు వ్యాట్‌పై వెచ్చించిన డబ్బును రసీదుల ఆధారంగా తిరిగి చెల్లిస్తారని చెబుతున్నా, ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.