Nayeem-encounter

నయీం దేనికి సంకేతం..?

స్వంత గ్రామంలో ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకోవడం గిట్టుబాటు కాక, మరో వైపు దొర భూములకు వ్యవసాయ పనులు చేయడం ఇష్టం లేక కరీంనగర్‌ జిల్లా కోరుట్ల సమీపంలోని తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు గల్ఫ్‌కు వచ్చి ఉద్యోగం చేసి కొంత సంపాదించాడు. మస్కట్‌ నుంచి బంగారు ఉంగరాలు, గొలుసు, ఒక టేపు రికార్డర్‌ తీసుకెళ్ళాడు. ఆభరణాలను ధరించి, టేప్‌రికార్డర్‌ వెంట వేసుకొని సమీపంలోని కోరుట్ల పట్టణంలో దినమంతా తిరిగేవాడు. సాయంకాలం బస్సులు ఆగే గ్రామపంచాయతీ కార్యాలయం (అప్పుడు కోరుట్లలో బస్టాండు లేదు) వద్ద ఒక టీ దుకాణంకు వచ్చి దాని వెనుక భాగంలో తన ప్యాంటు మార్చి, ధోవతి కట్టుకొని బంగారు గొలుసు, ఉంగరం, టేపు రికార్డర్‌ ఒక సంచిలో వేసుకొని బస్సులో తన గ్రామానికి తిరిగి వెళ్ళేవాడు. ఈ రకంగా కొద్ది నెలలు స్వదేశంలో గడిపి మళ్ళీ తిరిగి గల్ఫ్‌కు వచ్చేవాడు. ప్యాంటు ధరించి హాయిగా తిరిగితే కన్న ఊరులోని దొర కొడుకుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందనే భయంతో అతను గత్యంతరం లేక బట్టలు మార్చుకొని సొంత గ్రామానికి వెళ్ళేవాడు. ఇది, 1978 నాటి ముచ్చట. ఆ రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలలోని అనేక గ్రామాలలో ఇది ఒక సాధారణ విషయం.

ఆ తర్వాత వచ్చిన నక్సలైట్లు ఈ రకమైన పరిస్థితులను మార్చివేశారు. తుపాకులు చేతబట్టి వచ్చిన నక్సలైట్లు గ్రామస్థుల ద్వారా ఆప్యాయతగా అన్నం వడ్డించుకొనే అన్నలుగా ఆదరణ పొందారు. అలనాటి కొండపల్లి సీతారామయ్య మొదలు మామూలు దళ సభ్యుడి వరకు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేశారు. అందుకే వారు ప్రజాదరణ పొందారు.ఆలోచనా విధానంఏ విధంగా ఉన్నప్పటికీ అంకితభావం, అకుంఠిత దీక్షతో పనిచేయడం ముఖ్యం. సామాజిక మార్పులకు జరిగే పోరాటాలలో ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం వారి రాజకీయ లక్ష్యం కంటే ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

 

గల్ఫ్‌లో తన కుటుంబానికి చెందిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో రెండున్నర లక్షల మంది ఉద్యోగ, కార్మికులు, అపార స్థిరాస్థులు కలిగి వుండి కూడా, విలాసవంతమైన జీవితాన్ని కాదని తన వైఖరికి తగినట్లుగా సోవియట్‌ సేనలున్న అఫ్ఘానిస్తాన్‌ కొండలను ఎంచుకొన్నాడు ఉసామా బిన్‌ లాదెన్‌ (ఒసామా బిన్‌ లాడెన్‌ అనేది తప్పుడు ఉచ్ఛారణ). ఆ రకంగా అనేక మంది అరబ్బులు అప్పటి సోవియట్‌ యూనియన్‌ ఆ తర్వాత తమ సొంత దేశాలలో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జిహాదీ పోరాట పంథాను ఎంచుకోవడం జరిగింది. ఇది ఎంత వరకు సమర్థనీయం అనేది వేరే విషయం. అయితే వారి ‘జిహాదీ’ ఒక లక్ష్యానికి అంకితభావానికి ఉదాహరణ.
 
మన దేశంలోనూ, యవ్వనంలో అడుగుపెడుతుండగా సామాజిక దురాగతాలకు వ్యతిరేకంగా పాడే విప్లవ గేయాలకు ఆకర్షితులై సమాజం కొరకు ఏదో చేయాలనే ఆశయంతో ఎర్ర జెండా పట్టిన యువతకు ఒకప్పుడు కొదవ లేదు. పీపుల్స్‌ వార్‌ జిందాబాద్‌, కొండపల్లి సీతరామయ్యను వెంటనే విడుదల చేయాలి, భూమి లేని రైతులందరికీ భూమి పంచాలని, లేదా దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాసిన నినాదాలు అనేక మంది కుర్రాళ్ళను ఆడవుల బాట పట్టించాయనేది కూడా వాస్తవం. కానీ కాలం ఒత్తిళ్ళకు లొంగి వక్రమార్గం పట్టిన ప్రజాహితులలో (కొందరు) విప్లవవాదులూ వున్నారని కూడా చెప్పక తప్పదు. సమసమాజ స్థాపన కొరకు తుపాకులు పట్టిన కొంత మంది పోలీసుల ప్రోత్సాహంతో డబ్బు సంపాదనపై తెగబడ్డారు. ఈ రకంగా వచ్చిన వారందరిలోనూ భువనగిరి నయీం అగ్రగణ్యుడు. మానవీయతను మంటకలిపిన నయాం దురగాతాలు నిజంగా దిగ్ర్భాంతికరమైనవి. ఇటువంటి క్రూర స్వభావం కలిగిన మనషులను నక్సలైట్లు తమ దళాలలో ఏ సైద్ధాంతిక ప్రాతిపాదికన తీసుకున్నారో తెలియదు కానీ మారుతున్న కాలంలో ఉపయుక్తత కోల్పోతున్న విప్లవ సాయుధ పోరాటంలో నయీం తరహా వ్యక్తులు చేరడం విప్లవ పార్టీల దివాళాకోరుతనానికి నిదర్శనం.
 
నయీం కంటే ముందు, కత్తుల సమ్మయ్యపై అనేక కేసులు ఉన్నప్పటికీ పోలీసులు అతనికి పాస్‌ పోర్టు ఇప్పించి జర్మనికి పంపిస్తుండగా మార్గమధ్యంలో శ్రీలంకలో ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ రకంగా చిన్నా చితకా అనేక మంది లొంగిపోయిన నక్సలైట్లు గ్రామాల మీద పడి అరాచకాలు సృష్టించారు. లొంగిపోయి బ్యాంకు రుణం ద్వారా లభించే ట్రాక్టర్లకు తిరిగి, తిరిగి విసిగిపోయిన వారూ ఉన్నారు. అయితే ఇటువంటి వారి సంఖ్య స్వల్పం. 
వివిధ వ్యవస్థలలో పతనమవుతున్న విలువలు, మంటగలుస్తున్న మానవత్వానికి నయీం చరిత్ర ఒక ఉదాహరణ. 
 
మొహమ్మద్‌ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి