Mahatma-nehru-and-jinna

రాజకీయ వైరాలు–వ్యక్తిగత మర్యాదలు

మలబార్ హిల్స్‌లోని బంగ్లాపై నెహ్రూ, జిన్నాలు చూపిన పరిణితిని ప్రజావేదిక విషయంలో ప్రస్తుత తరం నాయకులు ప్రదర్శిస్తారని అనుకోవడం పొరపాటు. రాజకీయ విలువలు శరవేగంగా పతనమవుతున్న ప్రస్తుత కాలంలో ఒకరిని తప్పుబట్టి మరొకరిపై సానుభూతి చూపించవలసిన అవసరం లేదు. 

రాజకీయ సిద్ధాంతాలు, వ్యక్తిగత విలువలు, గౌరవ మర్యాదలు అనేవి విభిన్న ఆంశాలు. వీటిని ఒక దానితో ఒకటి కలిపితే ప్రజాస్వామ్య వ్యవస్ధలలో ఒక సంఘర్షణాపూరితమైన పరిస్థితి నెలకొని ఉంటుంది. నిన్నటి తరం నాయకులలో రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ గౌరవ మర్యాదలు పాటించేవారు. అవతలి పక్షం వారి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లే వారు కారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని నిన్నటి తరం వరకూ నాయకులు ఈ సంప్రదాయం పాటించారు. దేశ విభజనకు మతం కంటే కూడా జవహర్‌లాల్ నెహ్రూ, మొహమ్మద్ అలీ జిన్నాల వ్యక్తిగత అహంభావాలు ఒక కారణమని చెబుతారు. దేశంలో ప్రముఖ న్యాయవాదిగా, కాంగ్రెస్ నాయకునిగా పేరున్న జిన్నాకు బొంబాయి, న్యూ ఢిల్లీలలో అనేక ఆస్తులు ఉండేవి. వాటిలో జిన్నాకు అత్యంత ఇష్టమైంది మాత్రం బొంబాయిలోని సముద్ర తీరంలో రెండున్నర ఎకరాల స్థలంలో నిర్మించుకున్న విశాల భవంతి. 1936లో బ్రిటన్ నుండి తిరిగి వచ్చిన తరువాత ముచ్చటపడి కట్టించుకున్న ఆ బంగ్లా నిర్మాణానికి జిన్నా ఇటలీ నుండి మేస్త్రీలను రప్పించారు. ఆ ఇంట్లోనే మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇతర అనేక నాయకులతో జిన్నా సమావేశమయ్యేవారు. దేశ విభజన అనంతరం, దేశాన్ని వదలి వెళ్ళిన వారి ఆస్తిగా గుర్తించిన ప్రభుత్వం ఆ భవంతిని స్వాధీనం చేసుకొని పాకిస్థాన్‌ నుండి శరణార్థులుగా వచ్చిన వారికి కేటాయించింది. తాను ముచ్చటపడి నిర్మించుకొన్న ఆ ఇల్లంటే తనకు చాలా అభిమానమని, దాన్ని స్వాధీనం చేసుకోకుండా చూడాలని ఆయన నెహ్రూను కోరారు. జిన్నా పట్ల గౌరవంతో దానికి నెహ్రూ ఆంగీకరించారు. ఆ భవనం ఇప్పటికీ ముంబైలో ఉంది.
 
కమ్యూనిస్టు దిగ్గజం, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు స్వస్థలం ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ సమీపంలోని సోనార్గాం పట్టణం. తన చిన్ననాటి స్మృతులకు చిహ్నంగా ఉన్న ఆ ఇంటిని కాపాడవల్సిందిగా తనను కలిసిన బంగ్లాదేశ్ దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులను ఆయన కోరారు. స్పందించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా, జ్యోతిబసు ఇంటిని చారిత్రక కట్టడంగా గుర్తించి అందులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించారు. రాజీవ్ గాంధీ హయాంలో 1988లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు బీజేపీ బలం లోక్ సభలో కేవలం ఇద్దరు సభ్యులే. అందులో ఒకరు తెలుగుదేశం మద్దతుతో హన్మకొండ నుండి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి. సోమనాథ్ ఛటర్జీ, ఇంద్రజిత్ గుప్తా, దినేష్ గోస్వామి వంటి హేమాహేమీ సభ్యులున్న లోక్ సభలో మోదటిసారిగా అడుగు పెట్టిన జంగారెడ్డికి భోఫోర్స్ పై చర్చ ప్రారంభించడం పెద్ద సవాల్. అప్పుడు జంగారెడ్డికి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అటల్ బిహారి వాజపేయి సూచనలిచ్చారు. (ట్రంక్ కాల్ పై అప్పటి శాసనసభ్యుడు, నేటి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు కూడా తగు సూచనలు ఇచ్చే వారు). రాజ్యసభలో వాజపేయి కూడా ప్రధాని రాజీవ్ గాంధీని బోఫోర్స్ అవినీతిపై తూర్పారపట్టారు. అలాంటి వాజపేయి కిడ్నీ చెడిపోయి ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుసుకొన్న రాజీవ్ గాంధీ, అమెరికాలో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనే భారతీయ బృందంతో పాటు తన వెంట వాజపేయిని కూడా తీసుకు వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయించారు. వాజపేయి పూర్తిగా కోలుకుని స్వదేశానికి తిరిగి వచ్చే వరకూ చికిత్సకు పూర్తి వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని కూడా అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి రాజీవ్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తాను జీవించి ఉన్నానంటే దానికి రాజీవ్ గాంధీయే కారణమని వాజపేయి బహిరంగంగా ఒక సందర్భంలో వెల్లడించారు. అయినప్పటికీ వాజపేయి రాజకీయంగా చివరి క్షణం వరకూ రాజీవ్‌తో విభేదించారు.
 
ఉమ్మడి అంధ్రప్రదేశ్ శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసే ప్రతిపక్షాలు, ప్రధానంగా మద్దికాయల ఓంకార్, నర్రా రాఘవరెడ్డి, సిహెచ్ విద్యాసాగర్ రావులు చేసే అభ్యర్థనలను సాధారణంగా ఎన్టీఆర్‌ కాదనకుండా మన్నించేవారు. ఈ సంప్రదాయం నుండి వచ్చిన మనకు, ఇప్పుడు అంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడుల మధ్య నెలకొని ఉన్న ‘పరిస్థితి’ దిగ్ర్భాంతి కలిగిస్తుంది. కృష్ణానది కరకట్టపై అనుమతులు లేకుండా జరిగిన కొన్ని నిర్మాణాలలో ప్రజావేదిక, చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే, చంద్రబాబు కట్టడం ఒక్కటే కాదు అక్కడ ఇతరులవీ ఉన్నాయి అనే వింతవాదన ప్రజాజీవితంలో ఉన్న వారికి తగదు. నిబంధనల ఉల్లంఘన కంటే ఎక్కువగా రాజకీయ ప్రతీకారంగా ఈ విషయంలో ప్రభుత్వం దూసుకెళ్తున్న తీరు సమంజసంగా లేదు. మలబార్ హిల్స్‌లోని బంగ్లాపై నెహ్రూ, జిన్నాలు చూపిన పరిణితిని ప్రజావేదిక విషయంలో ప్రస్తుత తరం నాయకులు ప్రదర్శిస్తారని అనుకోవడం పొరపాటు. రాజకీయ విలువలు శరవేగంగా పతనమవుతున్న ప్రస్తుత కాలంలో ఒకరిని తప్పుబట్టి మరొకరిపై సానుభూతి చూపించవలసిన అవసరం లేదు.
 
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)