Janapada-Batukamma-celebrated-in-Khatar

ఖతర్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘జానపద బతుకమ్మ’

ఖతర్‌: తెలంగాణ జాగృతి - ఖతర్ ఆధ్వర్యంలో తెలంగాణ జానపదాల ఔన్నత్యాన్ని తెలుపుతూ ‘జానపద బతుకమ్మ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ జానపద కళాకారులు తేలు విజయ, అష్ట గంగాధర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పాత, కొత్త జానపదాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఏపీ మణికంఠణ్, ఐసీబీఎఫ్ అధ్యక్షుడు బాబు రాజన్, ఎంబసీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖతర్‌లో ఉంటున్న ప్రముఖ విద్యావేత్త, కేయస్ ప్రసాద్‌తో పాటు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురిని ఈ సందర్భంగా జ్ఞాపికలతో సత్కరించారు.

తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షులు నందిని అబ్బగౌని మాట్లడుతూ.. గత సంవత్సరం చేనేతకు చేయూతనిస్తూ ‘చేనేత బతుకమ్మ’ నిర్వహించామని‌, ఈ యేడు జానపదాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో ‘జానపద బతుకమ్మ’ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఖతర్ ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా కార్మికులకు, ఉద్యోగులకు  నైపుణ్య అభివృద్ధి శిబిరాలు,  మహిళలకు సాంప్రదాయ వంటల పోటీలు, మహిళా సాధికారత సెమినార్లు వంటి సామాజిక కార్యక్రమాలు కూడా తాము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక గల్ఫ్ కార్మికులకు అండగా ఉండేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తున్నామన్నారు.

 ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.