Indians-brutally-killed-in-Iraq

ఇరాక్‌లో భారతీయుల ఊచకోత

నిఘా అధికారులతో సహా కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ భారతీయుల ఆచూకీ తెలుసుకోవడానికి అనేక మార్గాలలో తీవ్రంగా కృషి చేశారు. అమెరికా, అరబ్ దేశాల నిఘా సంస్థల సేవలను కూడా భారత ప్రభుత్వం విరివిగా వాడుకొంది. చివరికి, అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మసోల్‌కు సమీపంలో 39 మందిని సమాధి చేసినట్లుగా అధికారులు దాదాపు సంవత్సరం క్రితమే గుర్తించారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం సగర్వంగా ప్రచారం చేసుకొనే అంశాలలో– విదేశాలలో ప్రత్యేకించి అరబ్బు దేశాలలో పని చేస్తున్న భారతీయ కార్మికుల సంక్షేమం ఒకటి. కానీ ఇటీవల ఇరాక్‌లో మూకుమ్మడిగా వధించబడ్డ 39మంది భారతీయ కార్మికుల విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంతో, విదేశాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వాల విధానాలు బహిర్గతమయ్యాయి.

ఇరాక్‌లో అపహరించబడ్డ భారతీయ కార్మికుల ఆచూకీ తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తనకు వీలయిన రీతిలో ప్రయత్నాలు చేసింది. కానీ వాస్తవం తెలిసిన తర్వాత దాన్ని వీలయినంత వరకు దాచి పెట్టే ప్రయత్నం కూడా చేసింది. నరమేధంలో మరణించిన భారతీయ కార్మికులను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్లుగా ఇరాక్‌ ప్రభుత్వం బాగ్దాద్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి తెలియజేసి, విలేకరుల సమావేశంలో ప్రకటించడంతో గత్యంతరం లేని స్థితిలో పార్లమెంటులో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటన చేసింది.
 
39 మంది భారతీయులు మరణించినట్టు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఇరాక్‌ ప్రభుత్వం నుంచి సమాచారం వస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించిన ప్రభుత్వం అకస్మాత్తుగా వాస్తవాలను వెల్లడించింది.నిఘా అధికారులతో సహా కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ భారతీయుల ఆచూకీ తెలుసుకోవడానికి అనేక మార్గాలలో తీవ్రంగా కృషి చేశారు. అమెరికా, అరబ్ దేశాల నిఘా సంస్థల సేవలను కూడ భారత ప్రభుత్వం విరివిగా వాడుకొంది. ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇరాక్‌లో కూడా పర్యటించారు. చివరికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మసోల్‌కు సమీపంలో 39 మందిని సమాధి చేసినట్లుగా అధికారులు దాదాపు సంవత్సరం క్రితమే గుర్తించారు.
 
ఇరాక్‌లో మూడవ పెద్ద నగరమైన మసోల్‌లో సున్నీ తెగ ఆధిక్యతలో ఉన్నా క్రైస్తవులు, యూదులతో పాటు కుర్దీలు, యాజ్దీలు, తుర్కీలు, ఆర్మెనియన్ ప్రాచీన తెగలకు చెందిన ప్రజలు వేలాది సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. సిరియా, జోర్డాన్, టర్కీ, ఇతర అరబ్బు దేశాలకు మసోల్‌ మీదుగానే వెళ్ళాల్సి ఉంటుంది. పత్తి పంటకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.
 
ఇరాక్‌ను దురాక్రమణ చేసిన అనంతరం షియా రాజకీయాలలో భాగంగా అమెరికా ఐఎస్‌ఐఎస్‌ను పెంచి పోషించగా, దాయిష్‌గా అరబ్బిలో ప్రాచుర్యం పొందిన దీని మూకలు ఈ నగరాన్ని 2014లో ఆక్రమించుకొని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించినట్లుగా ప్రకటించాయి. సిరియాలో రష్యా ప్రాబల్యాన్ని నిర్మూలించడానికి అమెరికా దాని మిత్ర అరబ్బు దేశాలు దాయిష్‌కు లోపాయికారీగా సహకరించాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
మసోల్‌లో ఒక విశ్వవిద్యాలయ నిర్మాణ ప్రాజెక్టులో తారీఖ్ అల్ హుదా అనే కంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న కొందరు భారతీయ కార్మికులను దాయిష్ దుండగులు అపహరించారు. వెంటనే తోటి కార్మికులు బాగ్దాద్‌లోని భారతీయ ఎంబసీకి సమాచారమందించగా, భారతీయ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని రక్షించే లోపే పరిస్థితులు పూర్తిగా విషమించాయి. అరబ్బు ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని విధ్వంసకాండ మసోల్‌లో చోటుచేసుకోవడంతో ఇరాక్‌ ప్రభుత్వ అధికారులు గానీ అమెరికన్ సేనలు గానీ ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయాయి. ఈ సంక్షోభ సమయంలో అపహరించబడ్డ భారతీయులను మరో ప్రాంతానికి తరలించి ఇతర ఉగ్రవాదులకు అప్పగించగా వారు వీరిని వధించారు.
 
మొత్తం 40 మంది భారతీయ కార్మికులను అపహరించగా, అందులో హర్జీత్ మస్హీ అనే 24 ఏళ్ళ క్రైస్తవ యువకుడు మాత్రం ఇద్దరు బంగ్లాదేశీ ముస్లింలు – షఫీ, హసన్‌ల సహాయంతో తాను కూడ ముస్లింననీ, తన పేరు అలీ అని చెప్పి ఉగ్రవాదుల చెర నుంచి నాటకీయంగా తప్పించుకొన్నాడు. భారతీయ ఎంబసీ సహాయంతో భారత దేశానికి చేరుకొన్న అతన్ని మన అధికారులు సంవత్సర కాలం పాటు ఇంటరాగేట్ చేసి, స్వస్థలం పంజాబ్‌కు దూరంగా ఉంచారు. 39 మంది తన తోటి కార్మికులను హతమార్చారని అతను ఇంత కాలంగా చెబుతున్నా ప్రభుత్వ పెద్దలు విశ్వసించ లేదు. పైపెచ్చు 39 మందిని హతమార్చినట్లుగా ఎక్కడా చెప్పవద్దని హెచ్చరించి, వేధించారు.
 
అపహరించబడ్డ వారి ఆచూకీ అడిగినందుకు పంజాబ్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీని విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ట్విట్టర్‌లో ‘బ్లాక్’ చేసారంటే, ఈ హత్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మసోల్‌ ప్రాంతంలోనే గతంలో ఉగ్రవాదుల దాడులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంత మంది యువకులు మరణించినా వారి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు.
మొహమ్మద్ ఇర్ఫాన్‌
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి