Indian-govt-was-not-recognise-indians-in-Gulf

ప్రోత్సాహం దక్కని ప్రవాసులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సువిశాల ఆర్థిక ప్రయోజనాలు గల్ఫ్‌ దేశాలతో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని తెలుగు రాష్ట్రాల పాలకులు గుర్తించాలి. కార్యదక్షులైన ప్రవాసులు ప్రయోజనం పొందే దిశగా ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత ఉభయ రాష్ట్రాలపై ఉన్నది. 
 
పెట్టుబడులతో వచ్చే విదేశీయులకు ఇస్తున్న ప్రాధాన్యం భారతీ యులు లేదా విదేశాల్లో ఉంటున్న ప్రవాసులకు ఎందుకివ్వరు? మాతృదేశ పురోగతికి తమ సామర్థ్యం లేదా నైపుణ్యతకు అనుగుణంగా ప్రవాసులు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే అభ్యంతరమెందుకు? గల్ఫ్‌ దేశాల్లోని అనేక మంది ఔత్సాహిక తెలుగు ప్రవాసులు అడిగే ప్రశ్నలివి. ప్రవాసులను ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లోని వారిని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించదు? వారి గురించి ఎందుకు అలోచించదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించడం చాలా కష్టం. కేవలం భారీ పెట్టుబడులతో వచ్చే విదేశీయులను పారిశ్రామికవేత్తలుగా లేదా పెట్టుబడిదారులుగా గుర్తిస్తూ స్వదేశీయులైన చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం దేశ హితులకు ఎంతైనా బాధ కలిగిస్తోంది. తెలుగు రాష్ర్టాలలోనే కాక దేశవ్యాప్తంగా అనేక ఇతర రాష్ర్టాలలో నెలకొని ఉన్న విచిత్రమైన దుస్ధితి ఇది.
 
ఎగుమతుల విషయంలో ప్రతి అడుగులో చైనాతో పోటిపడాలనుకొనే మనం చైనా ఆర్థికాభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించడంలో విఫలమవుతున్నాం. చైనా ఎగుమతులకు గల్ఫ్‌ దేశాలు అత్యంతకీలకమైనవి. ఈ దేశాల్లో లభ్యమయ్యే చైనా ఉత్పత్తుల్లో అత్యధికం చిన్న, మధ్య తరహా పారిశ్రామిక ఉత్పత్తులే. ఒక్క గల్ఫ్‌లోనే కాదు, చైనా ఉత్పాదక రంగానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్ధితి ఉంది. చైనా చిరు ఉత్పత్తిదారులు భారత్‌ లాంటి పెద్ద మార్కెట్‌లో శతాబ్దాల తరబడి ఉన్న హస్తకళలు, ఇతర వృత్తులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను దెబ్బకొడుతున్నారనే విషయాన్ని మనం మరచిపోకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక రంగంలో చైనా వాటా 14 శాతం కాగా, భారత్‌ వాటా కేవలం 2 శాతానికి మించి లేదు. అణు శక్తి సాంకేతికత నుంచి అల్లం వరకు చైనా ఉత్పత్తులు గల్ఫ్‌లో లభిస్తుండగా ఇందులో అనేకం కుటీర, చిన్న తరహా రంగాలకు చెందినవి. 
దుబాయిలోని ఒక తెలుగు ప్రవాసుడు, భారతదేశంలో సాంగ్లీ తర్వాత ప్రసిద్ధి గాంచిన నిజామాబాద్‌ పసుపును ఇరాన్‌కు ఎగుమతి చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అదేవిధంగా పెరిగిపోతున్న ధరలు, ఆరోగ్య సలహాల కారణాన అనేక మంది బాస్మతి బియ్యాన్ని వదిలి తెలుగు రాష్ర్టాల మసూరి బియ్యాన్ని తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే అందుకు తగ్గట్లుగా మసూరి బియ్యం మార్కెట్‌లో లభించడం లేదు. అలాగే వివిధ కారణాల వలన కోస్తా తీరంలో అక్వా పరిశ్రమకు అవసరమైన సహాయం అందడం లేదు. ఈ పరిస్థితి రొయ్యల ఎగుమతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది.
 
చైనాలో మైక్రో, చిన్నతరహా పరిశ్రమలకు సముచిత ప్రాధాన్యం ఉండగా మన వద్ద కేవలం బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఎర్ర తివాచీలు పరిచే సంస్కృతి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడ్తానంటున్న ఆబుధాబి ప్రవాసుడు అయిన వ్యాపారవేత్త బి.ఆర్‌.శెట్టి గురించి ఘనంగా మాట్లాడే మనం తమ తమ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యాలతో అనేకమంది ప్రవాసులు ముందుకు రావాలనుకొంటున్నా వారికి చేయూతనిచ్చేవారు లేరు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా శ్రీకారం చుట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో కూడా ప్రవాసుల పాత్ర అంటూ ఏమీ లేకపోవడం విస్మయం కల్గిస్తుంది.
 
విదేశీ బహుళ జాతి సంస్ధలు లేదా బి.ఆర్‌. శెట్టి తరహా పారిశ్రామికవేత్తల్లా ఈ మధ్యతరగతి ప్రవాసులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాలేకపోవచ్చు. అయితే వారు తమ సమున్నత అనుభవం, కొద్దిపాటి పెట్టుబడితో శెట్టి కంటే ఎక్కువగా అనేకమందికి ఉపాధి కల్పించగలుగుతారు. ఉదాహరణకు ఎలక్ర్టిక్‌ ప్యానళ్ళు, ఆటో మోబైల్‌ సైలెన్సర్లు, ఇంటీరియర్‌ డెకోరేటివ్‌ మొదలగు రంగాల్లో గల్ఫ్‌ లోని భారతీయులు చైనాకు దీటుగా తమ ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తున్నారు కదా. మరి వారు అదే కార్యదక్షతను మన దేశంలో ఎందుకు చూపలేరు? మన పాలకులు ఈ విషయమై ఆలోచించాలి.
 
గల్ఫ్‌ నుంచి స్వదేశానికి తిరిగి రావాలనుకొంటున్న వారికి పునరావాసం కల్పించే దిశగా వారి పెట్టుబడులను ప్రోత్సహించవచ్చు. ఒమాన్‌లో కొందరు తెలుగు మిత్రులు దీని కొరకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరో విదేశీయులకు ఇచ్చే రాయితీలో కొంచమైనా తమకు ఇవ్వాలని తెలుగు రాష్ర్టాలను అడుగుతున్నారు. నిజామాబాద్‌, నెల్లూరు జిల్లాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీరు ఆయా రాష్ర్టాల నుంచి తోడ్పాటును ఆశిస్తున్నారు. గల్ఫ్‌ అంటే కేవలం కార్మిక సమస్యలు, శవపేటికలే కాదు. తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన సువిశాల ఆర్థిక ప్రయోజనాలు కూడా గల్ఫ్‌తో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని తెలుగు పాలకులు గ్రహించాలి. అలాగని కంటైనర్‌ తెప్పిస్తున్నామంటూ గల్ఫ్‌లో తిరిగే అసంఖ్యాక దళారులు కాకుండా నిజమైన అర్హులు, కార్యదక్షులైన ప్రవాసులు ప్రయోజనం పొందే దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. 

మొహమ్మద్‌ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి