House-Rent-in-Dubai

దుబాయిలో ఇంటి అద్దెల పోటు.. తెలుగువారి ఇక్కట్లు!

దుబాయిలో పెరిగిపోతున్న అద్దెల తాకిడిని తట్టుకోలేక ఇళ్ళల్లో పాచి పనులు చేసే వేలాదిమంది తెలుగు మహిళలు రెండేళ్ళుగా పొరుగున ఉన్న షార్జాకు మకాం మారుస్తున్నారు. చిన్నపాటి ఉద్యోగులే కాదు ఒకప్పుడు వ్యాపారాలు చేసి ఉన్నతంగా గడిపిన వారు కూడా పరిస్ధితులు ప్రతికూలించడంతో ఇరుకైన గదుల్లో గడుపుతున్నారు. గల్ఫ్‌లోని ఈ రకమైన దుర్భర పరిస్థితులను బయటకు చెప్పలేక, అలాగని భరించలేక సతమతమయ్యే కుటుంబాలు అనేకం. 
 
దుబాయి నగరంలో అనూహ్యంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు నగర జనాభాలో సింహ భాగంలో ఉన్న ప్రవాస భారతీయులను ఊపిరాడకుండా చేస్తున్నాయి. అరబ్బు యాజమానులు అలవాటుగా, నిర్దాక్షణ్యంగా హెచ్చిస్తున్న అద్దెలను సగటు ప్రవాసీయుడు తట్టుకోలేకపోతున్నాడు. వార్షిక అద్దె ఒప్పందాల పునరుద్ధరణ సందర్భంగా 25 శాతం నుంచి 50 శాతం వరకు అద్దె పెరగుతుండడంతో సంపాదనకు భారీగా గండిపడడమే కాకుండా కొందరు తమ కుటుంబాలను స్వస్థలాలకు పంపించవలసిన పరిస్ధితి దాపురిస్తోంది. విచక్షణా రహితంగా పెరుగుతున్న ఇంటి అద్దెలను అదుపు చేయడానికి దుబాయి ప్రభుత్వం అనేక నియమాలు రూపొందించింది. కిరాయిదారు, ఇంటి యాజమానుల అద్దె పెంపు వివాదాలను పరిష్కరించడానికి చివరకు ప్రత్యేక న్యాయస్ధానాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతుందనే ఫిర్యాదులు ఉన్నాయి. దుబాయితో పాటు ఇతర ఏమిరేట్లలో కూడా తమ దేశంలో కుటుంబ సమేతంగా ఉండాలనుకొనే విదేశీయులు విధిగా ఇంటి అద్దె ఒప్పంద పత్రాలను సమర్పించాలనే నిబంధన వచ్చినప్పటి నుంచి ఇంటి అద్దెలు పెరగడం ప్రారంభించాయి. నూతన వీసా నిబంధనల ప్రకారం ఇంటి అద్దె ఒప్పందం లేని పక్షంలో నూతన వీసా జారీ కాదు, ఉన్న వీసా రెన్యువల్‌ జరగదు. 
 
సంపన్నులు ఉండే జుమైరా, మధ్య తరగతి వారుండే కరమా, స్వల్ప జీతాలుండే వారు నివసించే సత్వా, బర్‌ దుబాయి, దెయిరా ప్రాంతాలు అనే బేధం లేకుండా ప్రతి చోటా ఇంటి అద్దె పెరిగిపోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇంటి అద్దెల వివాదాల సంఖ్య ఇప్పుడు పెరిగిపోయింది. తమ అల్లుడు లేదా కొడుకు భార్య, కుటుంబ సమేతంగా దుబాయిలో ఉంటున్నాడని సంతోషంగా చెప్పే అత్త మామలు, తల్లిదండ్రుల సంఖ్యకు తెలుగు రాష్ర్టాలలో కొదవలేదు. దుబాయిలో కుటుంబ సమేతంగా ఉండడాన్ని ఒక రకమైన హోదాగా భావించే వారు అనేకులు ఉన్నారు. కానీ దుబాయిలో ఏ రకమైన పరిస్ధితులలో ఉంటున్నారనేది మాత్రం స్వదేశంలో అత్యధికులకు తెలియదు. కిటికీ అద్దాల గుండా సముద్ర అలలను అస్వాదిస్తూ విల్లాలు లేదా అపార్ట్‌మెంట్లలో నివసించే సంపన్నులకు సమస్య లేదు. మధ్య తరగతి వారు ఏదో రకంగా నెట్టుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆదాయం అంతగా లేకున్నప్పటికీ కుటుంబ సమేతంగా ఉండాలనుకొనే భారతీయులు మాత్రం బయట చెప్పుకోలేక అలాగని భరించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎవరైనా బంధుమిత్రులు వస్తే ఒక పూట భోజనానికి పిలవాలనే కోరిక ఉన్నా స్థలం లేక నిట్టూర్చే వారు అసంఖ్యాకం. తమకు తెలిసిన వారు ఎవరైనా భారతదేశం నుంచి వచ్చి ఫోన్‌ చేస్తే, ఎప్పుడు ఇంటికి పిలవాల్సి వస్తుందో అని భయపడే వారు కూడా చాలా మంది ఉన్నారు. వయస్సులో పెరుగుతున్న పిల్లలు, స్థలాభావం, పెరుగుతున్న అద్దెల కారణాన స్వదేశానికి కుటుంబాలను పంపించాలనుకొన్నా స్వస్థలంలో ఆలనాపాలన చూసుకొనే వారు లేక.... మౌనంగా రోదించే వారి సంఖ్య పెరిగిపోతున్నది.
 
వీరు కాకుండా ఇల్లు అంటే కేవలం పడుకోవడానికి మంచం, స్నానం చేయడానికి నీళ్ళు దొరికితే చాలు అనుకొనె తెలుగు జంటల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. శారీరక వాంఛ కోసం కొందరు, పిల్లలు లేని తమ కుటుంబం పొదుపు కోసం మరికొందరు ఈ విధానంలో కాలం గడుపుతున్నారు. బర్‌ దుబాయిలోని పాత పాకిస్థాన్‌ కాన్సులేట్‌ వద్ద, సత్వా, దెరాలలో ఇరుకైన పాత భవంతులలో కేవలం 150 గీ 200 పరిమాణం కలిగిన ఒక డబుల్‌ మంచం, 60-70 పరిమాణం కల్గిన ఒక చిన్నపాటి ఆల్మార మాత్రమే పెట్టుకొనేందుకు వీలున్న ఇరుకయిన స్థలంలో, అది కూడా నెలకు సుమారు 45 వేల రూపాయల చొప్పున అద్దె చెల్లించేవారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. దుబాయిలో పెరిగిపోతున్న అద్దెల తాకిడిని తట్టుకోలేక ఇళ్ళల్లో పాచి పనులు చేసే వేలాది మంది తెలుగు మహిళలు గత రెండు సంవత్సరాలుగా పొరుగున ఉన్న షార్జాకు మకాం మారుస్తున్నారు. పని చేసే భార్యాభర్తలు తమకు అనుకూలమైన ప్రాంతాలలో వేర్వేరుగా ఉంటూ వారానికి ఒక సారి కలిసి గడిపే విధానంలో కూడా కొన్ని తెలుగు కుటుంబాలు ఉంటున్నాయి. ఆర్థిక భారం తగ్గించుకోవడానికి షేర్డ్‌ అపార్ట్‌మెంట్‌గా ఒక ఇల్లును తీసుకొని నాలుగు కుటుంబాలు కలిసి పొత్తులో నివాసముండడానికి ఆసక్తి ప్రదర్శించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఏ రకమైన భవనంలోనైనా ఒకటికు మించి ఎక్కువ కుటుంబాలు నివాసముండడాన్ని దుబాయి, షార్జా మునిసిపాలిటీలు నిషేధించాయి. ఈ మేరకు మునిసిపాలిటీ అధికారులు తరచుగా తనఖీ చేస్తూ జరిమానాలు విధించడంతో పాటు నీరు, విద్యుత్‌ సేవలను తొలగించడం జరుగుతోంది. . ఇంటి యాజమానులైన అరబ్బులకు విధించే జరిమానాలను అందులో అద్దెకు నివసించే భారతీయులే చెల్లిస్తారు కాబట్టి జరిమానాల సమస్య లేదు.
 

చిన్నపాటి ఉద్యోగులే కాదు ఒకప్పుడు వ్యాపారాలు చేసి ఉన్నతంగా గడిపిన వారు కూడా పరిస్ధితులు ప్రతికూలించి ఎదిగిన పిల్లలతో పాటు ఇరుకైన స్థలాలలో గడుపుతున్నారు. గల్ఫ్‌ అనే బూటకపు అర్భాటం కారణాన ఈ రకమైన దుర్భర పరిస్థితులను బయటకు చెప్పలేక, అలాగని భరించలేక సతమతమయ్యే కుటుంబాలు అనేకం.

మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ 
అంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి