Gulf-letter-about-NRIs

దగాపడిన ప్రవాసులు

తల్లిదండ్రులు, తోబుట్టువులకు ఆనందప్రద జీవితాన్ని అందించడానికి ఎడారి ప్రవాసానికి వచ్చిన అనేకమంది కష్ట జీవులు చివరకు కుటుంబాల నుంచి దూరమవుతున్నారు, ఆత్మీయతలను కోల్పోతున్నారు. రేయింబవళ్ళు అహర్నిశలు కష్టపడి, కడుపు కాల్చుకొని పైసకు పైసా జతచేసి కుటుంబాలకు పంపితే ఆ త్యాగధనుల కష్టం తెలియని వారి కుటుంబాలు డబ్బుతో మాత్రమే తమకు పని అని, మనిషితో కాదంటున్నాయి! యవ్వనంలో అడుగుపెట్టిన అనతికాలంలో ఎడారులకు చేరుకున్న ఎంతోమంది అరబ్బుల అభిజాత్యానికి వ్యతిరే కంగా పోరాడి గెలిచినప్పటికీ ఇంట్లో అన్నదమ్ములతో ఓడిపోయి చివరకు రిక్తహస్తాలతో, నిరాశ నిస్పృహలతో కొట్టామిట్టాడుతున్నారు.
 
అనారోగ్యంతో మరణించిన తండ్రి, అడుగడుగునా ఉన్న అప్పులు, పట్టించుకోని బంధువులు, అరకొరగా కూలీ చేసి సంపాదించే అన్నకు తోడుగా భారీ కుటుంబానికి చేయూతనిచ్చేందుకు నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఒక యువకుడు తన సంపాదననంతా కుటుంబానికే ఇచ్చివేశాడు. యజమాని నుంచి దెబ్బలతో సహా ఆకలితో గడిపిన అతను అతి కష్టంగా సంపాదించిన సొమ్మును నెల్లూరు జిల్లాలోని తన అన్న పేరిట పంపాడు. ఆ అన్న, తమ్ముడి డబ్బును పూర్తిగా సొంతానికి వినియోగించుకున్నాడు. ఆ డబ్బుతో సొంత పిల్లల పెళ్ళిళ్ళు చేసాడు. చదువులు చెప్పించాడు. తమ్ముడు పంపిన డబ్బుతో ఆస్తులను తన పేర కొనుక్కున్న ఆ అన్న ఇప్పుడు అవన్నీ తనవేనంటున్నాడు. న్యాయస్థానానికి వెళ్ళి కేసు వేసుకోమంటున్నాడు. సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేసి స్వదేశానికి తిరిగివెళ్ళిన తమ్ముడు తనకు జరిగిన మోసం గూర్చి బంధుమిత్రులలో చెప్పి విలపించాడు. చివరకు చేసేది ఏమీ లేక గల్ఫ్‌లోని తన పాత మిత్రుల సహాయంతో వీసాను పొంది మళ్ళీ ఎడారి దేశాలకు తిరిగి వచ్చాడు. అయితే అనారోగ్యం కారణాన సక్రమంగా ఉద్యోగం చేయలేకపోతున్నాడు. అలాగని ఆర్థిక కారణాలతో స్వదేశానికి వెళ్ళడానికి వెనుకంజ వేస్తున్నాడు. మధుమేహం వ్యాధితో కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా తన పిల్లల కొరకు విధిలేక అష్టకష్టాలతో పనిచేస్తున్నాడు.
 

మెదక్‌ జిల్లాకు చెందిన ఒక యువకుడికి ఏడుగురు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వున్నారు. తండ్రి అనారోగ్యంతో మంచం పాలై అప్పులు పెనుభారంగా మారగా అతి కష్టంతో కుటుంబం గడిచేది. పెళ్ళికి ఎదుగుతున్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళ విద్య కొరకు అందరికంటే పెద్దవాడయిన అన్న తన డిగ్రీ చదువును వదిలిపెట్టి అప్పులుచేసి ఎడారి విమానమెక్కాడు. కంపెనీ వీసా అంటూ మోసపోయి అరబ్బు చేతికి చిక్కాడు. పొద్దున అయిదు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రేయింబవళ్ళు కష్టపడ్డాడు. సెలవు, పండుగ, పబ్బం లేకుండా యాంత్రికంగా పని చేసినా ఒక్క నయాపైసా అందలేదు. పైగా అరబ్బు యజమాని చేతిలో నిత్యం దెబ్బలు తిన్నాడు, గత్యంతరం లేని పరిస్ధితులలో పారిపోయి ఎడారిలో ఆకలితో కొన్నిరోజులు నడుచుకొంటూ రోడ్డుకు చేరాడు. అక్కడ కనిపించిన ఒక పాకిస్థానీ డ్రైవర్‌ అతని పరిస్థితికి జాలిపడి ధైర్యం చేసి అఖమా లేకున్నా ఆ యువకుడిని తన ట్రక్కులో దాచి 1000 కిలోమీ టర్ల దూరంలోని రియాద్‌ నగర సమీపంలోకి తీసుకువచ్చి ఒక హోటల్‌ వద్ద వదిలి పెట్టాడు. ఎటు వెళ్ళాలో తెలియక ఆ హోటల్‌ గిన్నెలు కడుగుతూ అక్కడి నుంచి ఎడారి దేశంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఇంట్లో అందర్నీ ఆదుకున్నాడు. సంపాదించిన ప్రతి నయా పైసాను ఇంటికి పంపించాడు. సొంతానికి కనీసం బ్యాంకు ఖాతా కూడా తెరువలేదు. తోబుట్టువులను పెంచి పెద్ద చేసి చదివించాడు. అందరూ స్థిరపడ్డారు. చెల్లెళ్ళ వివాహాలను ఘనంగా జరిపించాడు. సంపాదించింది మొత్తం తల్లికి పంపించగా అది తమ్ముళ్ళ చేతికి వచ్చింది. అన్న గల్ఫ్‌ వెళ్ళే వరకు అన్నం కొరకు తిప్పలు పడ్డ కుటుంబం గతాన్ని మరిచింది. జీవితంలో ఎక్కువ కాలం తాను విదేశాలలో గడపడంతో తన తోబుట్టువుల నైజాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. పెళ్ళి చేసుకున్న తర్వాత పరిస్థితి మరింతగా మారిపోయింది. ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా కనీసం ఇంట్లోకి అతని పిల్లలను కూడా రానివ్వలేదు. ఎవరికొరకు తాను రేయింబవళ్ళు కష్టపడ్డాడో వారే పరాయివారు కావడాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యం బాగా లేకున్నా తన బిడ్డల కొరకు కష్టపడ్డాడు. చివరకు గల్ఫ్‌ ఆసుపత్రిలో కన్ను మూసాడు. ఇప్పుడు స్వదేశంలో అతని పిల్లలు, భార్య అతి కష్టంగా అద్దె ఇంట్లో గడుపుతున్నారు. భార్య ఒక ప్రైవేట్‌ పాఠశాలలో దినం పూట ఉపాధ్యాయురాలిగా, రాత్రి పూట ఇంట్లో బట్టలు కుడుతూ పిల్లలను పోషించుకొంటుంది. ఈ రకంగా కుటుంబ బాధ్యతలతో చిన్న వయసులో ఎడారులకు వచ్చి చివరకు తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకున్న తెలుగు ప్రవాసులు చాలా మంది వున్నారు. వారి మనోవేదన వర్ణనాతీతం. 

*** మొహమ్మద్‌ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి