gulf-expats-are-not-happy-with-trs-govt

ప్రవాసులను అలరించని ‘కారు’

ప్రవాసుల సంక్షేమానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి ఎన్నికల ప్రణాళిక అనేక హామీలు ఇచ్చింది. దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవాసుల విషయంలో ఎలాంటి హామీలు ఇవ్వకుండా వ్యూహాత్మక మౌనం వహించింది. దీంతో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలలోనూ తెరాసకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రవాసులు ఈసారి మౌనంగా ఉన్నారు.

 
ఇంచుమించు మూడున్నర దశాబ్దాల క్రితం గల్ఫ్‌కు వచ్చి, అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షురకుడిగా పని చేస్తున్న దాసాని జయప్రకాశ్‌ (హైద్రాబాద్‌లోని నింబోలి అడ్డ స్థానీయుడు) కు రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు. జయప్రకాశ్‌ జీవితంలో ఎక్కువ భాగం ఎడారి దేశంలో గడిచిపోయింది. సొంత గడ్డ అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష కూడా నెరవేరింది. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలనలో, విద్యావంతుడైన తన కుమారుడికి స్వరాష్ట్రంలో ఉద్యోగం లభిస్తే స్వదేశంలో కొత్త జీవితాన్ని ఆరంభించాలని జయప్రకాశ్‌ కలలు కన్నాడు. అయితే కుమారునికి ఉద్యోగం ఎండమావిగానే ఉండిపోయింది. తత్కారణంగా జయప్రకాశ్‌ గత్యంతరం లేక ఎడారి దేశంలోనే ఉండిపోయాడు. సరే, తన సామాజికవర్గం వారికి సెలూన్లు ఏర్పాటు చేస్తామని స్వరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై జయప్రకాశ్‌ ఆశలు పెట్టుకున్నాడు. అయితే, కొత్త ప్రభుత్వం నుంచి అలాంటి సదుపాయం పొందామని చెప్పిన వారెవరి గూర్చి తాను వినలేదని జయప్రకాశ్‌ చెబుతున్నాడు.
 
యాన్బూ అనేది ఎర్ర సముద్ర తీరంలోని ఒక పారిశ్రామిక నగరం. ఈ నగరంలో ఒక పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాది ప్రవాస భారతీయ కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో తెలంగాణ కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని మరి చెప్పనవసరం లేదు. మధ్యాహ్నం ఒక గంట భోజన విరామ సమయం ఉంటుంది. ఆ సందర్భంగా పలువురు కార్మికులు ఒక్క సారిగా తమ తమ సెల్ ఫోన్లను ఆన్ చేసి తెలంగాణ ఎన్నికల సమాచారాన్ని చూస్తున్నారు. కొందరు తమ తమ గ్రామాలకు ఫోన్లు చేసి మరీ తాజా పరిస్ధితిని అడిగి తెలుసుకొంటున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత మళ్ళీ విధులకు హాజరవ్వడంలో ఆలస్యం జరిగితే వేతనాలలో కోత పడుతుంది, అయినా దాన్ని పట్టించుకోకుండా ప్రవాస కార్మికులు స్వదేశంలోని స్వరాష్ట్రంలోని ఎన్నికల సమాచారంలో మునిగి తేలుతున్నారంటే వారి ఆసక్తిని అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల పర్వం మొదలయినప్పటి నుంచి దాదాపు ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలలో ఇదే రకమైన పరిస్ధితి నెలకొని ఉంది.
 
హోరాహోరీగా జరుగుతున్న తెలంగాణ శాసన సభ ఎన్నికలను స్వదేశంలో ఉంటున్న స్ధానికులతో పాటుగా విదేశాలలో ఉంటున్న ప్రవాసులు కూడ అత్యంత ఆసక్తితో గమనిస్తున్నారు. విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన సమాచార విప్లవం, సామాజిక మాధ్యమాలు భౌగోళిక హద్దులను చెరిపి వేసాయి. ఒక్క తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు కూడ ఎన్నికల గూర్చి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొంటున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడ ఎన్నికలు జరుగుతున్నప్పటికి అందరి చూపులు ఒక్క తెలంగాణ పై కేంద్రీకృతమై ఉన్నాయి. ‍భవన నిర్మాణ రంగంలో కూలీ పని చేసుకోనె సగటు మాములు కార్మికుడి నుండి హవాల వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు ఎన్నికల తీరుతెన్నుల గూర్చి విచారిస్తున్నారు. గెలుపోటములు ఏ విధంగా ఉన్నప్పటికి నిస్తేజంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొంటున్న తీరు మాత్రం అందరికి అశ్చర్యం కల్గిస్తుంది.
 
అన్ని వర్గాల వారిని ఆకట్టుకోనె ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ కూడ ఈ సారి ప్రజా కూటమి ఎన్నికల ప్రణాళికలో ప్రవాసుల సంక్షేమానికి అనేక హామీలను ఇచ్చింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి దుబాయిలో పర్యటించి కూడ వెళ్ళారు. దీనికి భిన్నంగా తెరాస ప్రవాసుల గూర్చి ఎలాంటి హామీలను ఇవ్వకుండా వ్యూహాత్మక మౌనం వహించింది. దీంతో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలోనూ తెరాసకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రవాసులు ఈ సారి మౌనంగా ఉన్నారు. ఉద్యమ సమయంలో ఆ తర్వాత కూడ అనేక సార్లు బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అంటూ తెలంగాణ వెనుకబాటు తనాన్ని ప్రధానంగా ప్రస్తావించి ఓటర్లను ఆకట్టుకోన్నారు. గల్ఫ్ లోని ఒక హత్య కేసులో వివక్ష గూర్చి ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనాన్ని ప్రచురించగా 2008 జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ఆ కథనాన్ని కేసిఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. అలాంటిది ఆయన అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గల్ఫ్ ప్రవాసులను పూర్తిగా విస్మరించారు. ప్రవాసుల సంక్షేమం గూర్చి అధికారులు కసరత్తు చేసి మంత్రి కేటిఆర్ సమ్మతితో ఒక ముసాయిదాను రూపొందించారు కానీ దాన్ని ప్రకటించకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆపారని చెబుతారు.
 
ఇక గల్ఫ్ లో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసులలో అత్యధికులు మైనార్టీలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారున్నారు. వీరిలో కొందరు తెరాసకు మద్దతు ఇస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ వర్గాలు లబ్ధి పొందినప్పటికీ దానికి తగినట్లుగా వారు పూర్తిగా తెరాసకు బాసటగా నిలవడం లేదు. డబుల్ బెడ్ రూమ్‌ గృహ పథకం ప్రభావం ఇక్కడి వరకు వ్యాపించి ఉంది. వర్గాలకు అతీతంగా ఈ హామీ అమలు గూర్చి అందరూ అడుగుతున్నారు. కాగజ్ నగర్ ఎన్నికల ప్రచారం లో ముఖ్యమంత్రి కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్ల గూర్చి అడిగిన ఒక యువకుడిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో, విపక్షాల కంటె ఎక్కువగా తెరాసకు నష్టం కల్గించింది. ఇప్పుడు గల్ఫ్లోని అన్ని రాష్ట్రాల భారతీయుల వాట్సప్‌లలో మారుమ్రోగుతున్న వీడియో అది. గల్ఫ్ ప్రవాసులలో అత్యధికులు వచ్చిన ప్రాంతమైన ఉత్తర తెలంగాణలోని ఒక నియోజకవర్గంలో ఒక సిట్టింగ్ అభ్యర్ధి ఓటరుకు రెండు వేలు చొప్పున నగదు పంచనున్నాడని, దాన్ని తీసుకోండంటూ తమ కుటుంబాలకు ఫోన్లు చేసి చెబుతున్నారు. తెరాస సంక్షేమ పథకాల వలన లబ్ధి పొందిన వారి కంటే జయప్రకాశ్ తరహా ఆశలు పెట్టుకున్నవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏ మేరకు ఏ రకంగా వ్యక్తం చేస్తారో ఎన్నికల ఫలితాలే చెబుతాయి.
మొహమ్మద్ ఇర్ఫాన్ (ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి).