Financial-Capability-of-Arabs

అరబ్‌ల ఆర్థిక దక్షత

ఆదాయ వనరులు ఉండడం ఒక్కటే అభివృద్ధికి మూల కారణం కాదు. వ్యక్తులకే గాక దేశం విషయంలోనూ ఈ వాస్తవం వర్తిస్తుంది. అపార సహజవనరులు ఉన్న అన్ని దేశాలు అభివృద్ధి చెందలేదు. వనరులు సమృద్ధిగా వున్నంత మాత్రాన అభివృద్ధి చెందడం సాధ్యం కాదు కూడా. చమురు ఒక కీలక సహజ వనరు. ప్రపంచంలో కెల్లా అత్యధికంగా చమురు నిల్వలు కల్గిన దేశం దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులా. అయితే ఆ దేశం ఇప్పుడు పెట్రోలు కొరకు అల్లాడిపోతున్నది. విద్యుత్‌ కొరత మూలంగా చీకటిలో మగ్గిపోతున్నది. దేశ రాజధానితో పాటు ప్రధాన నగరాలలో పగటి పూటే జనాలు బాహాటంగా దుకాణాలపై దాడులు చేసి రొట్టెలు, ఇతర నిత్యావసర సరుకులు లూటీ చేస్తున్నారు. దీన్నిబట్టి ఆ లాటిన్‌ అమెరికా దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఉహించవచ్చు.

 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పెట్రోలియం ఉత్పాదక దేశాల సమాఖ్య (ఒపెక్‌)లో వెనిజులా ఒక ప్రతిష్ఠాత్మక సభ్యదేశం. అయినా దానికంటే తక్కువ చమురు నిల్వలు కల్గిన సౌదీ అరేబియానే ఒపెక్‌ను శాసిస్తుంది. చమురుపై ఆధారపడ్డ సౌదీ అరేబియా, కువైట్‌, యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ (ఆబుధాబి ఏమిరేట్‌) అన్ని రంగాలలో అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తుండగా వెనిజులా మొదటి నుంచీ వెనుకబడి వున్నది. ఇందుకు కారణం ఆ దేశ పాలకులు, వారు అనుసరిం చిన విధానాలు అని చెప్పక తప్పదు.
 
చమురు నిక్షేపాలు అంతగా లేని భారతీయులు గల్ఫ్‌కు వచ్చి ఆబుధాబి, దహేరాన్‌, కువైట్‌ రిఫైనరీలలో పనిచేస్తున్నారు. ఇది అర్థం చేసుకోదగిన వాస్తవం. అయితే చమురునిక్షేపాలు అపారంగావున్న వెనిజులా దేశస్థులు కూడా గల్ఫ్‌కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగకుండా ఎలా వుంటుంది? వారికీ అవస్థ వెనిజులా పాలకుల విధాన వైఫల్యమని చెప్పకతప్పదు. ఒకవైపు విలయతాండవం చేస్తున్న కరువు, మరోవైపు పతనమవుతున్న చమురు ధరలు వెనిజులాను అభివృద్ధిలో అట్టడుగుకు నెట్టివేశాయి. అగ్నిగుండాన్ని మరిపించే ఎడారి ప్రాంతాలైన గల్ఫ్‌ దేశాలు తమ ప్రజలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తుండగా మాములు ఉష్ణోగ్రత కలిగిన వెనిజులాలో సరిపడా విద్యుత సరఫరా లేకపోవడంతో జనాలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ కొరత కారణంగా ఆ దేశంలో ప్రస్తుతం వారానికి ఐదు రోజుల సెలవు దినాలు కాగా కేవలం రెండు రోజులు మాత్రమే పని దినాలు!
 
రాచరిక వ్యవస్థలు కలిగిన గల్ఫ్‌దేశాలు వ్యూహాత్మకంగా తమ సహజ వనరులను తమ దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కొరకు ఒక పద్ధతి ప్రకారం వినియోగిస్తుండగా సోషలిజం ప్రభావం కల్గిన వెనీజులా పాల కులు మాత్రం ప్రజాకర్షక విధానాలపై వెచ్చించి దేశాన్నిపూర్తిగా దివాళా తీయించారు. గల్ఫ్‌లో లభించే చమురు తేలికపాటి రకం కాగా వెనిజులాలో లభించేది భారీ రకం, ఈ రకమైన చమురును శుద్ధి చేయడానికి ఖర్చు ఎక్కువ అనేది కూడా వాస్తవమే అయినప్పటికి ఆ దేశంలో నెలకొనివున్న దారిద్ర్యానికి ఇది ఒక సాకు కాగూడదు. ఎందుకంటే ఇరాన్‌కు కూడా అపార చమురు నిల్వలు, ఎగుమతి సామర్థ్యం ఉన్నప్పటికి గల్ఫ్‌ దేశాలతో పోల్చితే ఆ దేశం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఆ మాటకు వస్తే ఒపెక్‌ సభ్య దేశం, సమృద్ధిగా చమురు నిల్వలు కలిగివుండి, ఎగుమతులు పుష్కలంగా చేస్తున్న నైజీరియాలో కూడా కనీస సౌకర్యాలు కరువయి, తినడానికి తిండి కూడా లేకుండా జనాలు ఆకలితో అలమటిస్తున్నారు.
 
జార్ఖండ్‌ రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉన్నప్పటికీ ఆ రాష్ర్టానికి చెందిన యువకులు ఇతర రాష్ర్టాలలో కూలీ పనులు చేస్తున్నారు. ఒరిస్సా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టాలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కడప, విశాఖపట్టణం, ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఆపార సహజ వనరులు ఉన్నా ఆశించిన మేరకు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందడం లేదు.
 
మరి గల్ఫ్‌ దేశాలలో అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా సాధ్యపడ్డాయి? దూరదృష్టి, జోక్య రహితంగా మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంతో ఆదాయం పెరిగి సకల అభివృద్ధి జరుగుతోంది. పెట్రోలు ధర అంతర్జాతీయ విపణిలో ఎలా ఉన్నా దాంతో సంబంధం లేకుండా తమ వద్ద ఉన్న నగదు నిల్వలు, విదేశీ డిపాజిట్ల ఆదాయంతో తమ ప్రజలకు కావల్సిన సౌకర్యాలు, సేవలను అందించవచ్చు కానీ గల్ఫ్‌ దేశాలు ఆ విధంగా చేయడం లేదు. పైగా ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అభివృద్ధి సాధనకు అప్పులు చేసే మనకూ వారికీ తేడా అది. సహజ వనరులను సద్వినియోగం చేస్తూ దృఢ సంకల్పం, దూర దృష్టితో పని చేసినప్పుడే ఏ దేశమైనా పురోగతి సాధిస్తుంది. ఇందుకు గల్ఫ్‌ దేశాలే తిరుగులేని నిదర్శనాలు. 
మొహమ్మద్‌ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి