Expats-Says-good-Bye-To-Kuwait

కువైట్‌ ప్రవాసానికి వీడ్కోలు!

కువైట్: కువైట్‌లో శరవేగంగా మారుతోన్న పరిస్థితులను చూసిన సుబ్బరాయుడు, తన నాలుగు దశాబ్దాల ప్రవాస జీవితానికి స్వస్తి పలకడానికి సంసిద్ధులవుతున్నారు. ఇలా వేలాది తెలుగు ప్రవాసులు స్వదేశీ బాట పడుతుండగా, కువైట్‌కు వలస వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ‌ఈ కొత్త, అనివార్య పరిణామ ప్రభావం తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా రాయలసీమపై అమితంగా ఉంటుంది.

ఐ‍దు దశాబ్దాల నాటి మాట. 1970దశకంలో చమురు ధరలు ఇతోధికంగా పెరిగాయి. చమురు ఎగుమతి దేశాలు, ముఖ్యంగా చమురుగర్భలైన అరబ్ దేశాలు అపార సిరిసంపదలకు నెలవులయ్యాయి. అరబ్ దేశాలకు బాగా కలిసివచ్చిన కాలమది. భారతదేశమూ ఆ ఎడారి దేశాల భాగ్యోదయం నుంచి విశేషంగా ప్రయోజనం పొందింది.
 
ఆ కాలంలో ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనేక మంది గల్ఫ్ దేశాల బాట పట్టారు. తెలుగు ప్రాంతాల నుంచి పశ్చిమాసియాకు జీవనోపాధి వలసలు ప్రారంభమవ్వడం, బహుశా, అదే మొదటిసారి. తొలుత ముంబై (అప్పుడు బొంబాయి)కి రైలు ప్రయాణం చేసేవారు. అక్కడి నుంచి నౌకాయానం ద్వారా గల్ఫ్ దేశాలకు చేరేవారు. అలా 1977లో కువైట్కు చేరుకున్న సుబ్బరాయుడు అనతికాలంలోనే తెలుగు ప్రవాసులలో ప్రముఖుడు అయ్యారు.
 
కడప జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన సుబ్బరాయుడూ ఇలా వారం రోజుల సముద్రయానం తర్వాత కువైట్‌కు చేరుకున్నారు. సొంత ఊరుకు సమీప గ్రామమైన పివిజి పల్లెలోని తన బాల్య స్నేహితుడు, కువైట్‌లో స్థిరపడిన నబీ సాబ్ సహాయంతో సుబ్బరాయుడు ఆ చమురు సంపన్న ఎడారి దేశానికి చేరారు. కువైట్ ప్రజా పనుల మంత్రిత్వ శాఖలో ఉద్యోగిగా ఆయన తన ప్రవాస జీవితాన్ని ప్రారంభించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ కాలంలో నౌకా యానంతో సముద్రాలను దాటి వచ్చిన రాయలసీమ వాసులు అనేక మంది వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులుగా చేరారు. ఆర్థిక భద్రతను సమకూర్చుకోవడంతో పాటు ప్రవాస సమాజంలో పేరు ప్రతిష్ఠలను, ఆతిథేయి సమాజంలో గౌరవాదరాలను పొందారు.
 
ఆధునిక ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా శిలాజ ఇంధనాలు విశేషంగా దోహదం చేశాయి. చమురు సంపన్న కువైట్ కూడా నవీన అభివృద్ధి కార్యకలాపాలకు కీలక తోడ్పాటునివ్వడం ద్వారా అపరిమితంగా లబ్ధి పొందింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇరవయో శతాబ్ది ఆర్థికాభివృద్ధిలో ఇంధనం కీలకం కావడమే కువైట్ తదితర గల్ఫ్ దేశాల పురోగతికి కారణం. చమురు ఎగుమతుల ద్వారా ఈ ఉన్నతిని పొందాయి.
 
కువైట్‌లో ఉద్యోగవకాశాలు అపరిమితంగా ఉండడంతో సుబ్బరాయుడు తన బంధుమిత్రులు అనేక మందిని తీసుకు వచ్చి వారి జీవితాలకొక ఉన్నతిని సమకూర్చారు. సుబ్బరాయుడు వలే ఇంకా పలువురు ఆ కాలంలో తమ బంధుమిత్రులు, గ్రామస్థులను కువైట్‌కు రప్పించుకొని ఉద్యోగాలు కల్పించారు. ఏ వీసా అయితే ఏమి, మొత్తానికి కువైట్‌కు చేరుకొంటే చాలు ఉద్యోగానికి ఢోకా ఉండేది కాదు. నౌకాయానంలో మాట కలిసినా లేదా చెన్నై విమానాశ్రయంలో ఆప్యాయంగా పలకరింపులు జరిగినా కువైట్‌కు చేరిన తర్వాత ఉద్యోగం ఖాయమయ్యేది. దీంతో కడప జిల్లాలో ప్రత్యేకించి రాజంపేట డివిజన్‌లో దాదాపు ప్రతి ఒక్క కుటుంబం నుంచి కనీసం ఒకరు చొప్పున కువైట్‌కు వచ్చి వాలారు. దీంతో అటు కువైట్‌తో పాటు ఇటు కడప పల్లెల దశ, దిశ మారింది.
 
ఇప్పుడు కువైట్ ముఖ చిత్రం మారిపోయింది. కువైట్ యువజనులు విద్యాపరంగా పురోగతి సాధించారు. తమ దేశంలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులతో సహా ఇతర విదేశీయుల సంఖ్యను క్రమేణా తగ్గించుకోవడానికి కువైట్ ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్ళుతోంది. ఇందులో భాగంగా వీసా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. కువైట్ జనాభాలో కువైటీలు 14 లక్షల మందే కాగా విదేశీయులు 32 లక్షల మంది ఉన్నారు. ఈ పరదేశీయులలో భారతీయులే అధికం. వీరిలోనూ కడప, చిత్తూరు జిల్లాల వారి సంఖ్య గణనీయం. వచ్చే ఏడేళ్ళలో విదేశీయుల సంఖ్యను క్రమేణా సగానికి సగం తగ్గించాలని కువైట్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భారతీయుల, ఇతర ఆసియా దేశస్థుల వీసా ఉల్లంఘన మితిమీరిపోవడంతో కువైట్ ప్రభుత్వం సహజంగానే అనేక కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
 
విద్యాధికులైన కువైటీలు తమ ఉద్యోగాలు తమకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేస్తున్న విదేశీయుల స్థానంలో కువైటీలను భర్తీ చేసే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ప్రైవేటు రంగంలోనూ విధిగా కువైటీల కొరకు ఉద్యోగాలలో కోటా విధిస్తున్నారు. వీసాల జారీపై అనేక అంక్షలు విధించారు. పోలీసు తనిఖీ ముమ్మరమైంది. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కువైట్‌లోని అతి పెద్ద కంపెనీ ఖురేఫీలో ఒకప్పుడు వేల సంఖ్యలో విదేశీయులు పని చేసే వారు. ఇప్పుడు ఆ కంపెనీలో వేతనాలు ఇవ్వలేని దుస్ధితి! కంపెనీ ఉద్యోగులైన భారతీయులకు వేతన బకాయిలు, ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును ఇప్పించడానికి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె. సింగ్ స్వయంగా వచ్చి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శరవేగంగా మారుతోన్న పరిస్థితులను చూసిన సుబ్బరాయుడు, తన నాలుగు దశాబ్దాల ప్రవాస జీవితానికి స్వస్తి పలకడానికి సంసిద్ధులవుతున్నారు. ఇలా వేలాది తెలుగు ప్రవాసులు స్వదేశీ బాట పడుతుండగా, కువైట్‌కు వలస వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. ఎడారి దేశాలకు వలసలలో ఈ కొత్త, అనివార్య పరిణామ ప్రభావం తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా రాయలసీమ పై అమితంగా ఉంటుంది.
                                                                                                                                                                                                                     మొహమ్మద్ ఇర్ఫాన్
                                                                                                                                                                                                                   (ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)