Cinema-Theaters-in-Saudi

సౌదీలో సినిమాలు

హాలీవుడ్‌ (అమెరికా చలనచిత్ర రంగ నెలవు) సినిమాల ప్రభావం అద్వితీయమైనది. ఆ సినిమాల పట్ల ఆసక్తి చూపని ప్రేక్షకులు, వాటిని అనుసరించని చలనచిత్ర కళాకారులు ఏ దేశంలోనూ ఉండబోరనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. అటువంటి హాలీవుడ్‌ నుంచి ఈ ఏడాది వెలువడ్డ ఒక (చెప్పుకోదగ్గ) సినిమా ‘బ్లాక్ పాంథర్‌’. ఏమిటి దీని విశేషం? కథానాయకుడు ఒక యువరాజు. తండ్రి మరణంతో స్వదేశానికి తిరిగివచ్చి వారసత్వంగా అందిన దేశపాలనా బాధ్యతలు చేపడతాడు. వర్తమాన ప్రపంచ గమనంపై సంపూర్ణ అవగాహన ఉన్న ఈ యువ పాలకుడు సకల జీవన రంగాలలో సంస్కరణలు అమలుపరచడం ప్రారంభిస్తాడు. తన దేశాన్ని విశాల ప్రపంచంతో అనుసంధానిస్తాడు. అదే సమయంలో తన మాతృభూమిలోని అపార సహజ సంపదలను ఏ విధంగానూ దుర్వినియోగం కాకుండా పరిరక్షించేందుకు కంకణం కట్టుకుంటాడు. ఇదీ, ఈ సరికొత్త హాలీవుడ్‌ సినిమా ఇతివృత్తం.

ఈ హాలీవుడ్‌ సినిమా కథానాయకుడు, ప్రస్తుతం సంప్రదాయాల స్తబ్దత నుంచి పశ్చిమాసియా సమాజాలను మేలుకొలుపుతున్న ఒక ప్రగతిశీల యువ పాలకుడిని స్ఫురింప చేయడం లేదూ? సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆ యువ ప్రిన్స్‌ పాలకుడని మరి ప్రత్యేకంగా గుర్తుచేయాలా? అడుగడుగునా ఉన్న బంధనాలు తొలగిపోవాలని, తమ జీవితాలలో కొత్త వసంతాలు చిగురించాలని కోరుకొంటున్న అరబ్‌ ప్రజలకు ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న ప్రిన్స్‌ సల్మాన్‌ సంస్కరణల తీరు ‘బ్లాక్‌ పాంథర్‌’ కథనంతో పోలి వుందనడం సత్య దూరం కాదు. పాలనా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సల్మాన్, స్వదేశంలో వినోద పరిశ్రమ అభివృద్ధికి కూడా సంకల్పించుకున్నారు. ఈ సంకల్పంలో భాగంగానే సౌదీ అరేబియాలో సినిమాల ప్రదర్శనకు అనుమతినిచ్చారు. ఈ కొత్త స్వేచ్ఛతో సౌదీ ప్రజల ముంగిటకు ప్రప్రథమంగా వచ్చిన చలన చిత్రం హాలీవుడ్‌ ‘బ్లాక్ పాంథర్‌’. ఇదొక విశేష సంఘటనే కాదు, గమనార్హమైన వాస్తవం కూడా.
 
సౌదీ అరేబియాలో సినిమాల ప్రదర్శన సహజంగానే అంతర్జాతీయ మీడియాలో విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. ఒకప్పుడు సౌదీలో రేడియో కేంద్రాన్ని ప్రారంభించినందుకు నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ తరువాత టీవీ ఛానల్ ప్రారంభించడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసనలు ఆందోళనకారులపై కాల్పులకు సైతం దారితీసాయి! మరి ఇటువంటి వింత పరిస్థితులు ఉన్న సౌదీలో సినిమాల ప్రదర్శన అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగదా మరి. ఛాందస వహాబీ సంప్రదాయ కఠోర ఇస్లామిక్ నియమాలను అనుసరించె దేశంలో సినిమాల ప్రదర్శన అనేది దేశం లోపల బయటా అందరికీ సహజంగానే ఆశ్చర్యం కల్గించింది.
 
తమ దేశంలో చలన చిత్రాల ప్రదర్శనలకు అనుమతి లేకపోవడంతో పొరుగు దేశాలకు వెళ్ళి సినిమాలు చూడడం సౌదీ అరేబియా ప్రజలకు అలవాటయింది. ఈ వినోదానికి వారు పెద్ద మొత్తంలో డబ్బును ఇతర దేశాలలో వెచ్చిస్తున్నారని ప్రిన్స్‌ సల్మాన్‌ భావించారు. సౌదీ ప్రజలు ఒక బిలియన్ డాలర్లకు పైగా డబ్బును పొరుగు దేశాలలో సినిమాలు, ఇతర వినోదాల పై ఖర్చు పెడుతున్నారని ఒక అంచనా. ఇంత పెద్ద మొత్తాన్ని దేశం వెలుపల కాకుండా దేశం లోపల మాత్రమే ఖర్చు పెడితే దేశ ఆదాయం ఇతోధికంగా పెరుగుతుంది కదా అని ఆయన ఆలోచించారు. ఈ ఆలోచన ఫలితమే సౌదీలో సినిమా ప్రదర్శనలకు అనుమతి. సినిమా హాళ్ళు లేకపోయిన కారణంగా సౌదీ ప్రజలు వినోద కార్యక్రమాలను టెలివిజన్ చానళ్ళ ద్వారా పొద్దస్తమానం వీక్షించడం జరుగుతోంది. ఈజిప్టు, ఇతర అరబ్బు దేశాలలో రూపొందే సినిమాలు, ధారావాహికలకు సౌదీ ప్రధాన మార్కెట్‌గా ఉంది.
 
సౌదీ అరేబియా జనాభాలో అత్యధికులు 25 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న యువతీ యువకులే. ప్రస్తుత ఇంటర్నెట్‌ యుగంలో సినిమాలను ఇంకా నిషేధపు జాబితాలో ఉంచడం భావ్యం కాదని ప్రిన్స్‌ సల్మాన్‌ భావించారు, అందుకే తన ప్రతిష్ఠాత్మక ‘విజన్– 2030’లో వినోద రంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లుగా ఆయన ప్రకటించారు. 1000 కోట్ల డాలర్ల పెట్టుబడితో సౌదీ అరేబియాలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యువ పాలకుడు పటిష్ఠ ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇస్లాంకు పుట్టినిల్లయిన సౌదీ అరేబియాలో మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఈ పవిత్ర గడ్డపై సినిమాల అపవిత్రత ఎందుకంటూ గతంలో అక్షేపణలు తెలిపిన అనేక మంది ధార్మిక పండితులు సైతం ఈ సారి మౌనంగా ఉండిపోయారు. హాలీవుడ్ సినిమాల పంపిణీ దిగ్గజాలైన ఎ.యం.సి, వోక్స్ మొదలైన సంస్ధలు సౌదీలో చలన చిత్ర పంపిణీ, ప్రదర్శన రంగాలలో పెత్తనం వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ సంవత్సరాంతం లోగా 40 సినిమా హాళ్ళను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే పదేళ్ళలో 350 బహుళ సినిమా హాళ్ళను ప్రారంభించి 2500 స్క్రీన్ల ద్వారా సినిమాలను ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు కృత నిశ్చయంతో ఉన్నారు.
అమెరికా, పాశ్చాత్య లేదా విదేశీ సినిమాల కథా కథనాలు సౌదీ అరేబియా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండవని సినిమా రంగంతో సంబంధం ఉన్న స్ధానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నిర్మాణం, ప్రదర్శన రంగాలలో తమకు పాత్ర ఏమీ లేకపోవడం పట్ల వారు ఎంతైనా అసంతృప్తితో ఉన్నరు. భారతీయ సినిమాల గురించి సౌదీ ప్రజలకు ప్రస్తుతానికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే సినిమా ప్రదర్శనలు ఉధృతస్థాయికి చేరిన తరువాత, స్ధానికులు వాటిని చూడడం మొదలు పెట్టిన తర్వాత క్రమేణా భారతీయ సినిమాలు కూడా సౌదీలను ఆకర్షించడం తప్పకుండా మొదలవుతుంది. భారతీయులతో పాటు పాకిస్థానీ, బంగ్లాదేశీయులు కూడా భారతీయ సినిమాలకు పెద్ద అభిమానులు కావడంతో అరబ్బి సినిమాల కంటె ఎక్కువగా భారతీయ సినిమాలకు డిమాండ్ ఉండవచ్చని భావిస్తున్నారు.
 
మోహమ్మద్ ఇర్ఫాన్‌
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి