CBI-issue-starts-from-Dubai

సిబిఐ – దుబాయి కోణం!

07-11-2018, ఆంధ్రజ్యోతి: ముడుపులు స్వీకరించింది ఏ అధికారి అయినప్పటికి వారు సిబిఐలో కీలకమైన స్థానాలలో ఉన్న వారేనన్నది మాత్రం నిర్వివాదాంశం. ఆ రకమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితిని కల్పించిన అధికారులు అత్యున్నతమైన విచారణ, నిఘా సంస్థలలో ఏ విధంగా పోస్టింగులు పొందగలిగారు?

 
దుబాయి కేంద్రంగా గల్ఫ్ లోని తెలుగు ప్రవాసుల పరిచయంతో ఏర్పడ్డ సంబంధాలు, తదుపరి ముడుపుల వ్యవహారం చివరకు దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ సిబిఐను వీధికెక్కించాయి. ఎడారి నగరంలో గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ముడుపుల వ్యవహారం న్యూఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రచ్చకెక్కి కీలకమైన కేంద్ర విచారణ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసింది.
 
విదేశాలలో భారతీయ వ్యవహారాల పై నిఘా నేత్రంగా వ్యవహరించే ‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌’ (రా)‍కు చెందిన గల్ఫ్ విభాగాన్ని చూసే ఉన్నతాధికారి సామంత్ గోయెల్ పేరును నేరుగా ఒక కేసు ఎఫ్‌.ఐ.ఆర్ లో నమోదు చేశారు. ఈ చర్య గల్ఫ్‌ దేశాలలో భారతీయ నిఘా వ్యవస్థ గోప్యతకు తీవ్ర భంగం కలిగించింది. దీంతో సిబిఐ అధినేతకు అర్ధరాత్రి ఉద్వాసన పలకవల్సి వచ్చింది.
 
కీలకమైన ‘రా’లో సంక్లిష్టమైన కశ్మీర్, శ్రీలంక, పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ వ్యవహారాలను సమర్థంగా చూసే ఇద్దరు అధికారులను కాదని, వారి కంటె జూనియర్ అధికారి అయిన 1984 బ్యాచ్ ఐపియస్ అధికారి సామంత్‌ గోయెల్‌కు ఆ నిఘా సంస్థ పగ్గాలు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు దుబాయిలోని భారతీయ దౌత్య కార్యాలయంలో పని చేసిన గోయెల్‌ ఇప్పటికీ దుబాయి, ఇతర అరబ్బు దేశాలలోని వ్యవహారాలను పరిశీలిస్తుంటారు. జాతీయ నిఘా సంస్థలైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ‘రా’ కు చెందిన కొంత మంది అధికారులు విదేశాలలోని భారతీయ ఎంబసీలలో దౌత్యవేత్తలుగా కూడా కొంత కాలం పని చేస్తారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌, ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా గతంలో విదేశాలలో పని చేసిన వారే.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్ ప్రసాద్ బ్యాంకింగ్ పెట్టుబడి వ్యవహారాలలో ఆరితేరిన వ్యక్తి. దుబాయిలో అనతి కాలంలో పేరు ప్రతిష్ఠలతో పాటు ఆస్తులూ సంపాదించిన సమర్థుడు. అతని సోదరుడు సోమేష్ ప్రసాద్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఒక బ్యాంకింగ్, పెట్టుబడుల సంస్థ దుబాయి శాఖలో పని చేస్తున్నారు. దుబాయి కేంద్రంగా జరిగే చీకటి ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద ఆర్థిక వ్యవహారాలను గూర్చి ఈ సోదరులు గోయెల్‌కు ఉప్పందిస్తుంటారని తెలుస్తోంది.
 
సోమేశ్, గోయెల్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దుబాయిలో నివాసముంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో మనోజ్‌ ప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణాన సదరు తెలుగు వ్యాపారవేత్త తన కుమారుడిని ఆంధ్రప్రదేశ్‌లో భూముల కేటాయింపునకు సంబంధించిన ఒక కేసులో సిబిఐ విచారణ నుంచి కాపాడుకోలిగలిగినట్లుగా చెబుతారు. సిబిఐ అంతర్యుద్ధంలో కేంద్రబిందువు అయన సానా సతీష్‌కు దుబాయి పై మక్కువ ఎక్కువ, కొందరు అధికార ప్రముఖులతో కలిసి ఆయన దుబాయిలో పలు వ్యాపారాలు కూడా నిర్వహించాడు. దుబాయిలోని సదరు తెలుగు వ్యాపారవేత్త కుటుంబంతో కూడ సానా సతీష్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతని కొడుకు, మనోజ్ ప్రసాద్ గూర్చి వివరించి అతని ద్వారా ‘సమస్య లేకుండా చూసుకోవచ్చని’ సూచించడంతో ముడుపుల వ్యవహారం మొదలైంది.
 
మనోజ్ ప్రసాద్, దుబాయిలోనే ఉంటున్న తన సోదరుడు సోమేష్‌కు ఈ విషయం గూర్చి వివరించడం, ఆయన నేరుగా సిబిఐలో రాకేష్ ఆస్థానాకు ఫోన్ చేసి కేసు గూర్చి తెలియజేయడం, అవతలి వైపు నుంచి హామీ లభించడం జరిగినట్లుగా ప్రాసిక్యూషన్ కథనం. దుబాయి నుంచి న్యూ ఢిల్లీకి వచ్చిన వెంటనే మనోజ్ ప్రసాద్‌ను సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. అతని వాంగూల్మం ఆధారంగా ఆస్థానా నేతృత్వంలో పని చేసే దేవేందర్ కుమార్‌ను అరెస్ట్ చేయడం జరిగింది.
 
అప్రమత్తమైన ఆస్థానా, తనకు బదులుగా ఆ ముడుపులు ఆలోక్ వర్మకు ఇచ్చే ప్రయత్నం జరిగిందని సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు యత్నించారు. దేవేందర్ కుమార్ తర్వాత ఆస్థానా అరెస్ట్ అనివార్యమని భావిస్తున్న తరుణంలో ‘రా’ అధినేత అనిల్ ధస్మన ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. దరిమిలా ఆ అర్ధరాత్రే మూకుమ్మడి బదిలీలు, బలవంతపు సెలవులతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది.
 
ముడుపులు స్వీకరించింది ఏ అధికారి అయినప్పటికి సిబిఐలో కీలకమైన స్థానాలలో ఉన్న వారన్నది మాత్రం నిర్వివాదాంశం. ఆ రకమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి కల్పించిన అధికారులు అత్యున్నతమైన విచారణ, నిఘా సంస్థల్లో ఏ విధంగా పోస్టింగులు పొందగలిగారనేది ప్రశ్న. దుబాయిలో వ్యాపారాలు చేసే మోయిన్ ఖురేషీపై జరుగుతున్న విచారణలో భాగంగా సిబిఐ ఉన్నతాధికారుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని భావిస్తున్నారు. పత్రికల కథనాల ఆధారంగా, అనేక కేసులలో విచారణలను మోయిన్ ఖురేషీ ప్రభావితం చేసారనడంలో ఏలాంటి సందేహాం లేదు, కానీ తమకు నచ్చని తమకు సమవుజ్జీలైన అధికారులను ఖురేషీతో అంటగడుతూ కీలకమైన పోస్టింగులలో వారికి కొందరు అడ్డపడుతున్నారనే అభియోగాలు కూడా ఇటీవల వెలువడుతుండడం ఆందోళన కల్గిస్తుంది. సమర్థులైన అధికారులను లేదా తమ విధానాలకు భిన్నంగా వ్యవహరించే అధికారులను విపక్ష అనుకూలురుగా ముద్ర వేయడం లేదా మోయిన్ ఖురేషీ తరహా వివాదస్పద వ్యక్తులతో జోడించడం మొదలు చర్యలతో పాలన వ్యవస్థ పై ప్రత్యేకించి విచారణ సంస్థల తీరుతెన్నులపై దుష్ప్రభావం పడుతుంది. కేంద్ర విజిలెన్స్ కమీషన్ తన విచారణను ఎంత మేరకు నిష్పాక్షికంగా జరుపుతుందనే దానిపై విచారణ సంస్థల విశ్వసనీయత ఆధారపడి ఉంది.
 మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)