Bad-impact-by-less-oil-price

చౌక చమురుతో చెడు రోజులు

అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు అంతకంతకూ పతనమవుతున్నాయి. చమురు ధరల పతనం కారణంగా గల్ఫ్‌ దేశాలలో ఆర్థికాభివృద్ధి మందగించింది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ ఎడారి దేశాలలో జీవనోపాధి పొందుతున్న తెలుగు రాష్ట్రాల వారు, ముఖ్యంగా తెలంగాణ వారు చాలా మంది ఉన్నారు. తమ సొంత రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుండడంతో సగటు గ్రామీణ ప్రవాసుల కుటుంబాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

                     మాతృ భూమిలో ఉన్న దుర్భిక్ష పరిస్థితులు గల్ఫ్‌ దేశాలలోని పలువురు ప్రవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ ప్రవాసులయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా కలిసిన ప్రతి చోటా సొంత రాష్ట్రంలోని నీటి ఎద్దడి గురించి చర్చిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులలో సాధారణంగా ప్రవాసుల కుటుంబాలు స్వదేశానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే నీటి ఎద్దడి వార్తల కారణంగా వివిధ పట్టణ, నగర ప్రాంతాలకు చెందిన పలు కుటుంబాలు తమ స్వదేశీ ప్రయాణంపై పునరాలోచనలో పడ్డాయి. గతంలో విద్యుత్‌ కొరత వలన భయపడిన ప్రవాసుల కుటుంబాలు ఈ సారి నీటి ఎద్దడిపై ఆందోళన చెందుతున్నాయి. గొట్టపు బావుల తవ్వకాలకై, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసే వారితో పాటుగా పట్టణ ప్రాంతాలలోని ప్రవాసుల కుటుంబాలు కూడా డబ్బు పంపమని కోరుతున్నాయంటే పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. పట్టణాల నుంచి కూడా, మంచి నీటి కోసం బోరు బావులు వేస్తున్నా నీరు రాక బోరుమంటున్నాయంటూ నీటి ఖర్చులకు డబ్బు పంపమంటూ ఇక్కడి తమ ఆప్తులను కొందరు అడుగుతున్నారు.

               కరీంనగర్‌ జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన పలువురు గల్ఫ్‌ దేశాలలో పని చేస్తున్నారు. దాదాపు ప్రతి ప్రవాసుని కుటుంబం నుంచి నీళ్ళ డబ్బుకు వినతులు అందుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఇక సాగు నీటి ఎద్దడి కారణాన కొందరు ప్రవాసులు తమ ప్రాణాలు కోల్పోగా మరికొందరు ఇక్కడ అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వైనం దిగ్ర్భాంతి కలిగిస్తుంది. 

కరీంనగర్‌ జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన ఒక వ్యవసాయ కుటుంబం సాగునీటి వసతి కోసం పది బావులు తవ్వించింది. నీళ్ళు రాకపోవడంతో ఆ కుటుంబం అప్పుల పాలైంది. గత్యంతరం లేని పరిస్ధితులలో ఆ కుటుంబానికి చెందిన ఒక యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయి వచ్చాడు. బావుల తవ్వకానికి అయిన అప్పులకు తోడుగా దుబాయిలో పరిస్థితులు అనుకూలించలేదు. డబ్బులు రాకపోవడంతో అతని కుటుంబం మరింతగా అప్పుల బారిన పడి దివాలా తీసింది.
 
                  దినసరి కూలీ పని చేసేందుకు దుబాయిలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ యువకుడు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటికే అతని కుటుంబం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక సంఘటనలో ఆ యువకుడు తన తండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఎంత విషాదం! ఇలా ఆర్థిక సమస్యలతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి.
 

                  గత మూడు నెలలుగా ఖతర్‌లోని భారతీయ ఎంబసీ చుట్టూ ప్రదక్షిణలు చేసే బోడిబె రమేశ్‌ అనే యువకుడిది మరో విషాద గాథ. గోదావరి నది ప్రవహించే ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలానికి చెందిన రమేశ్‌ది వ్యవసాయిక కుటుంబం. గ్రామంలో నీటి కొరత కారణాన రెండు బావులు తవ్వినా ప్రయోజనం లేకపోవడంతో బోరు బావులు వేసాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. బావుల తవ్వకం, బోరు బావుల డిల్లింగ్‌ కోసం చేసిన అప్పు తీర్చడానికి మరి కొంత అప్పు చేసాడు. గల్ఫ్‌లో కొంత కాలం పని చేసి అప్పులు తీర్చవచ్చని గంపెడు ఆశతో ఇక్కడికి వచ్చాడు. మూడు నెలలు రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసినా ఒక్క రియాళు జీతం కూడా అందలేదు. దీంతో తాను మోసానికి గురయి సందర్శక వీసాపై వచ్చి ఎడారిలో బానిసగా ఇరుక్కుపోయినట్లుగా రమేశ్‌ తెలుసుకున్నాడు. అతి కష్టం మీద ఇటీవలే స్వదేశానికి తిరిగి వెళ్ళిన రమేశ్‌ను ఒక వైపు బోరు బావుల అప్పులు, మరోవైపు గల్ఫ్‌ దళారీకి చెల్లించిన అప్పులు వేధిస్తున్నాయి.

                  ఈ విషాద గాథలు, వ్యవసాయిక కుటుంబాల నేపథ్యం నుంచి గల్ఫ్‌ దేశాలకు వచ్చి పని చేస్తున్న అనేక మంది యువకుల ఆర్థిక పరిస్ధితిని ప్రతిబింబిస్తున్నాయనడం సత్యదూరం కాదు. స్వదేశంలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నప్పుడల్లా ఆర్థిక ఆసరాకు ఎడారి దేశాలకు రావడం పరిపాటి. ఇప్పుడు చమురు ధరలు తగ్గిపోతోన్న కారణంగా గల్ఫ్‌ దేశాలలో నెలకొన్న సంక్షోభ పరిస్ధితుల వల్ల ఆ కొద్ది పాటి ఆసరా కూడా దూరమవుతోంది. ఇది ఎంతైనా బాధాకరం. 

-మొహమ్మద్‌ ఇర్ఫాన్ 
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి