Arab-countries-on-rafel

అరబ్‌ దేశాలు, రాఫెల్

26-09-2018: యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్కు ఫ్రాన్స్‌తో సైనిక సంబంధాలు పటిష్ఠంగా ఉన్నాయి. ఫ్రెంచ్‌ సంస్థ డాస్సాల్ట్ ఉత్పాదక రాఫెల్ యుద్ధ విమానాలను యు.ఏ.ఇ. వాడుతోంది. పొరుగున ఉన్న ఇరాన్తో వివాదం కారణాన దాని కంటే ఎత్తయిన ప్రదేశాలలో ప్రత్యేకించి ఆబుధాబి సరిహద్దులలోని ఎత్తయిన ప్రాంతాల నుండి ఎగరడానికి తమ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అనువుగా ఉంటుందని రాఫెల్ యుద్ధ విమానాలను యు.ఏ.ఇ వాడుతోంది. పొరుగున ఉన్న సౌదీ అరేబియా వాడే అమెరికా ఉత్పాదక వివిధ రకాల యుద్ధ విమానాలలో నిరంతర వృద్ధిని గమనించి యు.ఏ.ఇ రాఫెల్ కొనుగోలును క్రమేణా తగ్గించింది. తమ మిత్ర దేశమైన ఈజిప్టుకు కూడా సైనికంగా, ఆర్థికంగా ఏమిరేట్స్ అండగా నిలుస్తోంది. తమ రక్షణ అవసరాల నిమిత్తం రాఫెల్ యుద్ధ విమానాలను ఈజిప్టు కూడ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఖతర్ కూడ కొనుగోలు చేసింది. రాఫెల్‌ విమానాలకు ఈ రెండు దేశాలు చెల్లిస్తున్న ధరకు భారత్ చెల్లిస్తున్న ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లుగా భారతీయ సంస్థలు పసిగట్టాయి. 41 వేల కోట్ల రూపాయిలు అదనంగా భారతదేశం చెల్లిస్తున్నట్లుగా గుర్తించారు. అదే ప్రస్తుతం భారతదేశంలో రాఫెల్ దుమారానికి కారణమైంది.

ధరతో పాటు కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి అంశం కూడా ఇందులో ఉంది కానీ దురదృష్టవశాత్తు ఈ దిశగా అంతగా చర్చ జరగడం లేదు. విదేశాలలోని భారతీయ దౌత్య కార్యాలయాలలో తరుచుగా కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పథకం గూర్చి వివిధ సమావేశాలు నిర్వహించడం, విదేశీ వ్యాపారవేత్తలకు దీని గూర్చి అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రధాని మోదీ కూడా మేక్ ఇన్ ఇండియా గూర్చి గంభీరంగా మాట్లాడుతారు. కానీ వాస్తవానికి ఈ పథకం క్రింద ఎన్ని విదేశీ పరిశ్రమలు మన దేశానికి వచ్చాయనేది మాత్రం చెప్పరు.
 
మేక్ ఇన్ ఇండియా పథకానికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వ రంగ సం‍స్థ అయిన బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు వైమానికదళ రక్షణ సామాగ్రి ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించడానికి గతంలోని యు.పి.ఏ ప్రభుత్వం రాఫెల్ ఉత్పాదక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే దేశీయ వైమానిక దళానికి అవసరమైన సామాగ్రిని ఉత్పత్తి చేసే దీనికి రాఫెల్ నుంచి సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి జరిగితె జాతికి లబ్ధి చేకూరుతుంది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని ప్రక్కన పెట్టి కొత్తగా పురుడుపోసుకున్న అనీల్ అంబానీ సంస్థ భారతీయ భాగస్వామిగా రంగంలో వచ్చింది. భారత ప్రభుత్వ సూచన మేరకు తాము అంబానీని భారతీయ భాగస్వామిగా చేర్చుకోవడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని ఈ కొనుగోలు ఒప్పందం జరిగినప్పుడు అధికారంలో ఉన్న ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హాలండే ఇటీవల వ్యాఖ్యానించడంతో రాజకీయంగా నరేంద్ర మోదీకి జరగవల్సినంత నష్టం జరిగిపోయింది.
 
ఒక వైపు భాజపా ప్రభావం తగ్గిపోతుందన్న వార్తలు మరో వైపు రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఉధృతం కావడంతో ఆత్మరక్షణలో పడ్డ మోదీ సర్కారు గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కేసులో దుబాయి కేంద్రంగా ముడుపులు చెల్లించారని తేల్చిన కేంద్ర ప్రభుత్వ విచారణాధికారులు ఈ దిశగా తమ చర్యలు వేగవంతం చేసారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఈ కేసులో జోక్యం చేసుకోని యు.ఏ.ఇ పాలకుల సహాయాన్ని అభ్యర్థించినట్లుగా ప్రచారం జరుగుతుంది. కేంద్ర సర్కారు పై కేసు విచారణ గూర్చి సంచలన ఆరోపణలు చేసిన బ్రిటిష్ జాతీయుడైన అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు మధ్యవర్తిని భారత్కు అప్పగించడానికి దుబాయి న్యాయస్థానం అనుమతించింది. దీనిపై అప్పీళ్ళకు వెళ్ళడానికి అతనికి మరో వారం వ్యవధి ఉంది. ఒక వేళ అతన్ని భారత్ కు తీసుకురావడంలో విజయం సాధిస్తే మోదీ సర్కారుకు కొంత మేరకు కాంగ్రెస్ పై ప్రతిదాడులు చేయడానికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)