AP-govts-policy-of-local-jobs-is-flawed

సబబు కాని ‘స్థానిక’ ఆదర్శం

చైనాలోని షాంఘై ఓడ రేవుకు దీటుగా ఎదిగే అవకాశాలున్న నవ్యాంధ్ర ఓడరేవు కృష్ణ పట్టణం. ఈ ఓడ రేవు అభివృద్ధిలో దుబాయి సంస్థలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. మరి, ఈ ఓడరేవు ఉద్యోగాలలో 70 శాతం స్థానికులకే ఇవ్వాలని నిర్దేశిస్తే ఆ సంస్థలన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెదుర్కోకతప్పదు. నాణ్యత, అర్హతలకు పెద్ద పీఠం వేసే ఈ ప్రపంచీకరణ యుగంలో భూమి పుత్రులు అనే వాదానికి ఆర్థికంగా విస్తరిస్తోన్న సమాజంలో అంతగా ప్రాధాన్యత లేదు. ఆ వాదమే గనుక నిజమై ఉంటే దుబాయి, ముంబాయి, హైదరాబాద్ అభివృద్ధి మరో రకంగా ఉండేది. అర్హతలకు సముచితంగా అవకాశం దొరికినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందనేది ఒక చారిత్రక సత్యం.
 
ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేటు రంగ సంస్థలలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్థానిక ప్రాధాన్యతలు, భూమి పుత్రులు అనే పాలకుల భావం దృష్ట్యా ఈ నిర్ణయం సబబుగా కనిపిస్తున్నప్పటికీ సువిశాల దృక్పథంలో పరిశీలిస్తే, అభివృద్ధిపరంగా అది ఆదిలోనే హంసపాదు అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా అభివృద్ధి అనేది ఏ విధంగా సాధ్యమవుతుందో ఒక్కసారి గల్ఫ్ దేశాలను గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక జిల్లా కంటే కూడా చిన్నదిగా ఉన్న దుబాయి, ఆసియాలోనే కాకుండా ప్రపంచ ప్రముఖ నగరాలలో ఒకటి. 30 లక్షల దుబాయి జనాభాలో స్థానిక జాతీయులైన ఇమరాతీలు పట్టుమని 10 శాతం మంది కూడా ఉండరు. ఆ పది శాతం మందిలోనూ ఆధునిక నైపుణ్యాలు ఉన్నవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ, దుబాయిలోని జబల్ అలీ పారిశ్రామిక వాడలో భారతదేశంలో సైతం లేనంత ఎక్కువగా బహుళ జాతి సంస్థల పరిశ్రమలు ఉన్నాయి.
 
2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తన యు.ఏ.ఇ. పర్యటన సందర్భంగా జబల్ అలీ సాధించిన పారిశ్రామిక ప్రగతి గురించి తెలుసుకొని అశ్చర్యపోయారు. ఆ పారిశ్రామిక వాడలో ఏ అంతర్జాతీయ బ్రాండును ఏ సంస్థ ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తుందో అధికారుల బృందం (అందులో ఐపియస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కూడా ఒకరు) వైయస్‌కు వివరించగా ఆయన మంత్రమగ్ధులైపోయారు. రాంకీ గ్రూప్ యాజమాన్యానికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే రాంకీ గ్రూప్ జబల్ అలీతో సహా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ వ్యాపారంలో ముందంజలో ఉంది. రసాయనాల నగరంగా ప్రసిద్ధికెక్కిన యాన్బూలో ఫ్రాన్స్, సౌదీ, అమెరికన్ సంస్ధలతో పోటీపడి రాంకీ నెగ్గుకొస్తోంది. అదే విధంగా పాకిస్థాన్‌ రాజకీయ దిగ్గజం నవాజ్ షరీఫ్ గల్ఫ్‌లో తమ కుటుంబ సంస్థల వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ కొరకు భారతీయులపై ఆధారపడుతున్నారు.
గల్ఫ్ దేశాలలో ఒకప్పుడు పేదరికం తాండవించింది. సంపన్న భారత్‌కు ఐరోపా నుంచి వెళ్ళే నౌకల పై దాడి చేసి దోచుకునేవారు. అదే విధంగా ఆ నౌకలపై ఎక్కి అరబ్బులు బొంబాయికి చేరుకుని అక్కడి నౌకాశ్రయంలో కూలీలుగా పని చేసేవారు.
 
భారత ఉప ఖండం నుంచి మక్కా యాత్రకు వచ్చే యాత్రికులు ఉదారంగా చేసే దానాల ద్వారా జీవించిన ఈ పేద దేశాలు చమురు ఉత్పత్తి ప్రారంభమైన అర్థ శతాబ్దిలోనే అదే భారతీయులను తమ వద్ద కూలీలుగా నియమించుకొనే స్థాయికి ఎదిగారు. చమురు ఉత్పాదక సంస్ధలు మొదలు సూపర్ మార్కెట్ల వరకు గల్ఫ్ దేశాలలో అర్హతలకు పట్టం కట్టడం వల్లే అభివృద్ధి సాధ్యమైంది. ఆర్థికంగా ఎదిగి, నైపుణ్యత సాధిస్తూ మరో వైపు నిరుద్యోగ సమస్య క్రమేణా పెరుగుతుండగా, సుమారు 50 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కొన్ని రంగాలలో ఉద్యోగాలను ‘భూమి పుత్రుల’కు ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక రకమైన రిజ్వరేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిభకు పట్టం కట్టే సంస్కృతి ఒక్క గల్ఫ్‌లోనే కాదు, ప్రపంచమంతా ఉంది. ముంబాయిలో ఇతర రాష్ట్రాల వారు కానీ, చివరకు ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు, ఆదిలాబాద్, విశాఖపట్టణం జిల్లాల అభివృద్ధిలో ఇతరుల పాత్రను విస్మరించలేం.
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ రంగ సంస్థలలో స్థానికులకు 70 శాతం ఉద్యోగాల కల్పన విషయమై ప్రభుత్వం చట్టం చేయడం అనేక ప్రశ్నలకు ఆస్కారం కలిగిస్తుంది. అంతా సవ్యంగా కొనసాగితే భవిష్యత్తులో చైనాలోని షాంఘై ఓడ రేవుకు దీటుగా ఎదిగే అవకాశాలున్న నవ్యాంధ్ర ఓడరేవు కృష్ణపట్టణం. ఈ ఓడ రేవు అభివృద్ధిలో దుబాయి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. మరి, ఈ ఓడరేవు ఉద్యోగాలలో 70 శాతం స్థానికులకే ఇవ్వాలని నిర్దేశిస్తే ఆ సంస్థలన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్ధితి నెదుర్కోకతప్పదు. సముద్ర తీరం, కష్టపడే స్వభావం, నైపుణ్యాలు నేర్చుకొనే కళ ఉన్న ఆంధ్రప్రదేశ్ అనతి కాలంలో అభివృద్ధిలో అగ్రగామిగా వెలుగొందేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. తక్షణ రాజకీయలబ్ధి కాకుండా, సుదీర్ఘ కాలంలో రాష్ట్రానికి ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపాధికి సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలి.
 
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)