A-story-on-Sridevi-death-in-Dubai-

‘వెన్నెల’ నిష్క్రమ‍ణం

 

శ్రీదేవి మృతి వెనుక కుట్ర ఏమి లేదని, కేవలం మద్యం సేవించడంతో మరణించినట్లుగా సమాచారం. మద్యం సంబంధిత విషయాలతో కూడిన కథనాలతో తమ పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి సాధారణంగా అలాంటి విషయాలను దుబాయి ప్రభుత్వం బయటకు వెల్లడించదు.
 
బాలీవుడ్ తో సహా యావత్‌ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దుబాయి కొత్తదేమీ కాదు. పైగా పన్ను తాలూకు వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి భారతీయ చలనచిత్ర రంగ ప్రముఖులకు అంతకంటే అనువైన ప్రదేశం దగ్గర్లో మరొకటి లేదు. అనేక మంది భారతీయ సినీ తారలు దుబాయిను వివిధ కారణాల దృష్ట్యా తరుచుగా సందర్శిస్తుండడం పరిపాటి. తెలుగు రాష్ట్రాల అధికారులు, నాయకుల మొదలు ముంబై హిందీ చిత్ర సీమ అగ్ర నటీనటుల వరకు అందరూ తరచూ దుబాయికి వచ్చి వెళ్ళడం సాధారణమే. ముంబాయి సంపన్నులు అనేకులు తమ శుభ కార్యక్రమాలకు కూడా దుబాయి, ఇతర ఏమిరేట్లను ఎంచుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటి శ్రీదేవి కూడా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ కు రావడం జరిగింది. దుబాయికు సమీపంలోని రాస్ అల్ ఖైమా అనే ఏమిరేట్‌లో తన ఆడపడుచు ఇంట జరిగిన పెళ్ళి విందు కార్యక్రమంలో పాల్గోనడానికి వచ్చిన శ్రీ దేవి, విందు అనంతరం దుబాయిలోని తన బసకు వెళ్ళిన విషయం అందరికి విదితమే.
 
తనకు ఏ మాత్రం పడని తన సవతి పిల్లలతో సహా యావత్తు అత్తింటివారి కుటంబం ఆ పెళ్ళి విందుకు హాజరైంది. ఆ తర్వాత శ్రీదేవి దుబాయిలోని ఒక ప్రఖ్యాత హోటల్ లో బస చేసినప్పటి నుంచి మరణించే వరకు జరిగిన విషయాలు పలు సందేహాలకు తావిస్తున్నాయి. ఆ సందేహాలకు నిర్దిష్టమైన సమాధానాలు ఇప్పటి వరకు ఎవరి వద్ద లేవు. ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. తన పై వచ్చిన అరోపణలలో ఒక్క దానికి కూడా శ్రీదేవి భర్త బోనీ కపూర్ దుబాయిలో ఉండి కూడా సమాధానం ఇచ్చుకోలేని పరిస్ధితిని ఎదుర్కొన్నారు. ఇక ఆ సందేహాలను నివృతి చేసే విషయమై అంతకు మించి చెప్పదేమీ లేదు. దుబాయి నుంచి వెలువడే పత్రికలు గానీ దుబాయి పోలీసులు లేదా ప్రభుత్వ అధికారులు సంక్షిప్తంగా శ్రీదేవి మరణంపై ముసురుకున్న సందేహాల విషయమై ఒకటి రెండు ప్రకటనలు చేయడం మినహా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. భారతీయ రాయబారి ఇతర దౌత్యవేత్తలు కూడా చాల అచీతూచీ మాట్లాడారు. మన తెలుగు కార్మికుల మృతదేహాలను భద్రపరిచే చోటే శ్రీదేవి మృతదేహం గత మూడు రోజులుగా ఉంది. దుబాయిలో మరణ కేసుల విచారణలో స్ధానికంగా అమలులో ఉన్న విధి విధానాల గూర్చి ఏమాత్రం అవగాహన లేని భారతీయ మీడియా శ్రీదేవి మృతిపై తమకు తోచిన విధంగా కథనాలు వెలువరించింది. వీటిలో అత్యధికం వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. భారతీయ మీడియా కథనాలకు తోడుగా దుబాయి అధికారవర్గం మౌనం పరిస్ధితిని మరింత జటిలం చేసింది. దీంతో చివరకు దుబాయి పోలీసలు శ్రీదేవి స్నానపు గది టబ్ లో పడి మరణించారని ప్రకటించారు. భారతదేశంలో నెలకొన్న ఉత్కంఠను మన దేశంలో ఉన్న యు.ఏ.ఇ దౌత్యవర్గాలు తమ ప్రభుత్వానికి నివేదించాయి.
 
మంగళవారం మధ్యాహ్నం మాత్రం దుబాయి ప్రభుత్వ మీడియా కార్యాలయం శ్రీదేవి మృతి పై విచారణ పూర్తి చేశారని వెల్లడించింది. శ్రీదేవి కేసును మూసివేసి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయించినట్లుగా వెల్లడించింది. ఈ రకంగా మీడియా కార్యాలయం ఒక మృతి కేసుపై ప్రకటన చేయడం అనేది దుబాయి చరిత్రలో చాలా అరుదైన విషయం. శ్రీదేవి మృతి వెనుక కుట్ర ఏమి లేదని, కేవలం మద్యం సేవించడంతో మరణించినట్లుగా సమాచారం. మద్యం, వ్యభిచారం మొదలగు విషయాలతో కూడిన కథనాలతో తమ పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి సాధారణంగా అలాంటి విషయాలను దుబాయి ప్రభుత్వం బయటకు వెల్లడించదు. బోనీ కపూర్ ను శంకించవల్సిన అవసరం లేదని అతన్ని ప్రశ్నించిన పోలీసువర్గాలు కూడ ఒక అభిప్రాయానికి వచ్చాయి. శ్రీదేవి మృతదేహాన్ని రెండవ సారి కూడా పరిక్షించిన వైద్యులు, పోలీసులు ఆమె మరణంలో నేర కోణం లేదని నివృత్తి చేసుకున్నారు. పైగా దుబాయి అధికారుల విచారణకు తాను సహకరించానని బోనీ కపూర్ చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించడానికి అధికారులు అనుమతించారు. తెలుగు పేద కార్మికుల మరణాల కేసులలో సహకరించిన మలయాళీ మిత్రుడు అష్రఫ్ తమరసెర్రీ ఈ సారి సెలెబ్రటీ శ్రీదేవి కేసులో సహకరించారు, శ్రీదేవి మృతదేహాన్ని దుబాయి అధికారులు అతనికి అప్పగించారు.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి