Woman-who-didn’t-know-she-was-pregnant-delivers-healthy-baby

గర్భం దాల్చినట్టు కూడా తెలీకుండా.. ఎనిమిది నెలల పాటు..

ఫ్లోరిడా: అమెరికాలో ఓ మహిళ తాను గర్భం దాల్చినట్టు తెలుసుకున్న గంటల వ్యవధిలో బిడ్డకు జన్మనిచ్చేసింది. గర్భం దాల్చిన వెంటనే ప్రసవం ఏంటని అనుకుంటున్నారా? వివరంగా చెప్పాలంటే.. ఫ్లోరిడాలోని ఫోర్ట్ వాల్టన్ బీచ్‌ నగరంలో నివసిస్తున్న డ్యారియా యాక్‌వ్యాక్ అనే మహిళ పదేళ్ల నుంచి పాలీసిస్టిస్ ఓవరీ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతోంది. ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి ఈ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, ఈ వ్యాధి కలిగిన వారు రోజురోజుకూ బరువు పెరుగుతూ ఉంటారు. దీని ద్వారా వారి శరీర ఆకృతి కూడా మారుతూ ఉంటుంది. డ్యారియా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ వ్యాధిగ్రస్థులు బిడ్డకు జన్మనివ్వడం కూడా కష్టమని చెప్పడంతో డ్యారియా ఎంతో బాధపడింది. జీవితంలో ఇక తాను తల్లిని అవ్వలేనని ఆవేదన చెందింది.

 అయితే గతేడాది డ్యారియా గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ సర్జరీ ద్వారా ఆమె కడుపు సైజు సగానికి సగం తగ్గుతుంది. అయితే ఆగస్ట్ నెలలో ఆమెకు ఒక్కసారిగా బ్యాక్ పెయిన్ వచ్చింది. లోపల ఏం జరుగుతుందో తనకు కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించగా.. వారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పారు. డ్యారియా 35 వారాల గర్భంతో ఉన్నట్టు, ప్రసవం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైనట్టు తెలిపారు. దీంతో డ్యారియా ఒక్కసారిగా షాకైంది. కనీసం తాను గర్భం దాల్చినట్టు కూడా తనకు తెలియదని.. తన వ్యాధి వల్ల ఏదేదో జరుగుతోందని అనుకుంటూ వచ్చానని డ్యారియా వివరించింది. ఆసుపత్రికి వెళ్లిన తొమ్మిది గంటలకే డ్యారియా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన కూతురు ఐదు వారాలు ముందే జన్మించిందని, గర్భవతి తీసుకోవాల్సిన ఏ ఒక్క జాగ్రత్తను, చెకప్‌ను తాను పాటించకుండానే పూర్తి ఆరోగ్యంతో ఉన్న పాపకు జన్మనిచ్చానని డ్యారియా ఆనందం వ్యక్తం చేసింది.