woman-is-charged-with-murder-in-connection-with-the-1996-homicide

హత్య జరిగిన 23 ఏళ్ల తర్వాత.. పోలీసులకు దొరికిన సాక్ష్యం

కొలరాడో: చేసిన తప్పుకు ఎప్పటికైనా శిక్షను అనుభవించాల్సిందేనని అంటుంటారు. ఇప్పుడు చెప్పబోయే మహిళ కథ వింటే ఇది నిజమే అనిపిస్తుంది. ఇంతకూ ఏం జరిగిందంటే..  జెన్నిఫర్(42) అనే మహిళ అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో నివసిస్తోంది. 23 ఏళ్ల క్రితం.. అంటే 1996లో జెన్నిఫర్ తనకు పుట్టిన పాపను హత్యచేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఓ రిజర్వాయర్‌లో పడేసింది. ఆ పాప మృతదేహం చాలా దూరం ప్రవహించగా.. ఓ ప్రాంతం ఒడ్డున ఇద్దరు పిల్లలు పాపను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహం నుంచి తమకు కావాల్సిన శాంపిల్స్‌ను తీసుకోగా.. అనంతరం ఆ ప్రాంతవాసులే పాపకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ పాప పూర్తి ఆరోగ్యంతో పుట్టిన కొద్ది రోజులకే హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ పాపకు సంబంధించిన వివరాలు మాత్రం ఏళ్లు గడిచినా పోలీసులు చేధించలేకపోయారు. 

1998లో ఇక ఈ కేసు ముందుకు నడవదని పోలీసులు సాక్ష్యాల కోసం అన్వేషించడం కూడా ఆపేశారు. మరలా.. 2006లో చనిపోయిన పాప డీఎన్ఏను మరోసారి పరీక్ష చేసి వేరెవరి డీఎన్ఏతో అయినా మ్యాచ్ అవుతుందేమోనని చూడాలనుకున్నారు. అయినప్పటికీ.. అప్పుడు కూడా పోలీసులకు నిరాశే మిగిలింది. ఇక 2016లో టెక్నాలజీ భారీస్థాయిలో అభివృద్ధి చెందడంతో.. మూడోసారి డీఎన్ఏ మెటీరియల్‌ను పరీక్ష చేయగా.. ఆ పాప డీఎన్ఏతో ఐదుగురి డీఎన్ఏ మ్యాచ్ అయింది. దీంతో పోలీసులకు నూతనోత్తేజం వచ్చింది. ఐదుగురిలో ముగ్గురి డీఎన్‌ఏలు పూర్తి స్థాయిలో మ్యాచ్ కాకపోవడంతో.. పోలీసులు మిగతా ఇద్దరి కోసం గాలించడం మొదలుపెట్టారు.

 మేరీల్యాండ్‌లో నివసిస్తున్న నాలుగో వ్యక్తి తనకు ఏం తెలీదని చెప్పాడు. అయితే ఐదో వ్యక్తి అడ్రస్ తనకు తెలుసుని చెప్పడంతో.. ఐదో వ్యక్తి వద్దకు పోలీసులు వెళ్లగా.. ఆ ఐదో వ్యక్తే హంతకురాలు అని.. ఆమె జెన్నిఫర్ అని గుర్తించారు. చనిపోయిన పాప పేరు బేబీ ఫెయిత్ అని.. జెన్నిఫర్ పాపకు తల్లి అని పోలీసులు తెలుసుకున్నారు. మంగళవారం జెన్నిఫర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కోర్టులో 25వేల డాలర్ల బాండ్‌‌(దాదాపు రూ. 18 లక్షలు)తో ఆమె బెయిల్‌పై విడుదలైంది. కాగా, బేబీ ఫెయిత్ చనిపోయిన తరువాత కొలరాడోలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. బిడ్డను పెంచుకోవాలని లేకపోతే.. బిడ్డ పుట్టిన 72 గంటల్లోపు తల్లి దగ్గర్లోని ఆసుపత్రిలో లేదా ఫైర్ స్టేషన్లలో బిడ్డను అప్పగించి వెళ్లిపోవచ్చు. తల్లిపై ఎటువంటి కేసు కూడా నమోదు కాదు.