Woman-Fakes-being-Kidnapped-so-She-could-Steal-Truck-in-North-California

కిడ్నాప్ డ్రామా ఆడి.. కాలిఫోర్నియా మహిళ ఏం చేసిందంటే...

సోఫియా, నార్త్ కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఓ కిలాడి మహిళ కిడ్నాప్ డ్రామా ఆడి ఒక వ్యక్తి ట్రక్కు ఎత్తుకెళ్లబోయింది. కానీ బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ కిలాడి కటకటాలపాలైంది. వివరాల్లోకి వెళితే... నార్త్ కాలిఫోర్నియాలోని సోఫియాకు చెందిన వర్జీనియా సావేద్రా(37) అనే మహిళ బుధవారం తనను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించబోతే వారి నుంచి తప్పించుకోని వచ్చానని చెప్పి ఓ వ్యక్తి ఇంట్లోకి చోరబడింది. అనంతరం తనను ఎలాగైనా కాపాడమంటూ ఆ వ్యక్తిని వేడుకుంది. దాంతో అది నిజమని నమ్మిన వ్యక్తి తన ట్రక్కులో సావేద్రాను ఆమె చెప్పిన చోటుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. 

ఇంతలోనే బయల్దేరడానికి రెడీగా ఉన్న అతని ట్రక్కు తీసుకొని సావేద్రా అక్కడి నుంచి ఉడాయించింది. బాధితుడు వెంటనే 911కు కాల్ చేసి రాండోల్ఫ్ కౌంటీ పోలీసులకు సమాచారం అందించాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆమె వెళ్తున్న ట్రక్కును వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులను ఆమె మారణ ఆయుధాలతో బెదిరించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అలా సుమారు 42 కిలోమీటర్లు సావేద్రాను వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని దోపిడీ, రాష్ డ్రైవింగ్, ప్రభుత్వ అధికారులపై ఆయుధంతో దాడి కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కటకటాల్లోకి నెట్టారు.