Who-Is-Jeff-Bezos-Asks-US-Student-With-Amazon-CEO-Standing-Next-To-Him

ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఎదురుగా ఉండగా.. అమెరికాలో ఓ విద్యార్థి..

వాషింగ్టన్: జెఫ్ బెజోస్ పేరు వినగానే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు, అమెజాన్ కంపెనీకి సీఈఓ అని చాలా మందికి టక్కున గుర్తొస్తుంది. కానీ.. ప్రతి ఒక్కరికీ ఈయన గురించి తెలియాలనేం లేదు కదా. ఒకవేళ జెఫ్ బెజోస్ అత్యధిక ధనవంతుడని తెలిసినా కూడా చాలా మంది తమకేంటని అంటుంటారు. అమెరికాలో ఓ విద్యార్థి కూడా సరిగ్గా ఇలానే అన్నాడు. అయితే ఆ విద్యార్థి అలా అనే సమయంలో.. ఎదురుగా జెఫ్ బెజోస్ లెక్చర్ ఇస్తుండటం విశేషం. వివరంగా చెప్పాలంటే.. జెఫ్ బెజోస్ సోమవారం వాషింగ్టన్‌లోని డన్బార్ హై స్కూల్‌కు అనుకోకుండా వచ్చారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో సంభాషించారు. 

జెఫ్ బెజోస్‌ను చూసిన వెంటనే ఓ విద్యార్థి వెనక్కు తిరిగి మరో విద్యార్థితో ఎవరతను అని అడిగాడు. ఆయన ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడని వెనుక కూర్చున్న విద్యార్థి సమాధానమిచ్చాడు. కొద్దిసేపటి తరువాత డౌట్ అడిగిన విద్యార్థి వెనక్కు తిరిగి ‘ప్రపంచంలోనే ధనవంతుడా.. అయితే ఏంటి?’ అని అన్నాడు. వీరిద్దరూ మాట్లాడుకోవడం జెఫ్ బెజోస్ కూడా చూశారు. కొద్ది సేపటి తరువాత డౌట్ అడిగిన విద్యార్థితోనే కంప్యూటర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి జెఫ్ బెజోస్‌ సంభాషించడం విశేషం. ‘నువ్వు మంచి స్టోరీ టెల్లర్‌వి.. ఆ నైపుణ్యాన్ని ఎప్పుటికీ వదలకోకు ’ అంటూ జెఫ్ బెజోస్ ఆ విద్యార్థితో నవ్వుతూ అన్నారు. కాగా, జెఫ్ బెజోస్ తమ స్కూల్‌కు వస్తారని తమకు తెలియదని క్లాస్ టీచర్ చెప్పింది. క్లాస్‌లో మొత్తం 15 మంది విద్యార్థులు ఉండగా.. కేవలం ముగ్గురికి మాత్రమే జెఫ్ బెజోస్ అంటే ఎవరో తెలుసని టీచర్ తెలిపింది.