విద్య, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అగ్ర రాజ్యం అమెరికా వెళ్లిన తెలుగు ప్రజలు అక్కడ సత్తా చాటుతున్నారు. అమెరికా పౌరులకు ఏమాత్రం తీసిపోని విధంగా, మరింతగా చెప్పాలంటే... అమెరికా పౌరులకు ధీటుగానే తెలుగు వాళ్లు రాణిస్తున్నారు. ఈ క్రమంలో పలు సంస్థలను ఏర్పాటు చేసిన తెలుగు ప్రజలు... తమ బాగోగులతో పాటు సమాజం గురించి ఆలోచన చేస్తున్న వైనం నిజంగానే ఆసక్తిదాయకం. అక్కడ తెలుగు ప్రజల ఆధ్వర్యంలోని సంస్థలు నిర్వహించే కార్యక్రమాలు భారీ ఎత్తున, అంగరంగ వైభవంగా సాగుతున్న వైనం చూస్తుంటే... ఏ దేశంలో ఉన్నా మనోళ్లు మన సంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే ముందుకు సాగుతున్నారని చెప్పక తప్పదు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూనే సమాజానికి ఉపయోగపడే చాలా కార్యక్రమాలను చేపడుతున్న తెలుగు వాళ్ల సంఖ్య అక్కడ నానాటికీ పెరిగిపోతోంది. అమెరికాలోనే ఉంటూ సొంతూళ్ల అభివృద్ధికి ఇతోదికంగా సాయపడుతున్న మన తెలుగు వాళ్లు... అక్కడి సమాజానికి కూడా తమదైన రీతిలో చేయూత అందిస్తున్నారు. అలాంటి సంస్థలకు ఇప్పుడు కొత్తగా మరో కీలక సంస్థ జత చేరనుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలతోనే త్వరలో రంగంలోకి దిగనున్న ఆ సంస్థ పేరు వుమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్... పొట్టిగా పిలిస్తే... వెటా.
మాతృ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మేలో కార్యరంగంలోకి దిగనున్న ఈ సంస్థ నినాదం ఏమిటంటే... ఇది తెలుగు మహిళల కోటా... స్త్రీ ప్రగతి పథమే మా బాట! తెలుగు నేలకు చెందిన హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ఈ సంస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సంస్థ ఏర్పాటుకు మొత్తం కార్యరంగం సిద్ధం కాగా... ఈ ఏడాది మేలో దీనిని రంగంలోకి దించేందుకు ఝాన్సీ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసలు ఈ సంస్థ లక్ష్యాలు ఏమిటన్న విషయానికి వస్తే... మహిళలు ఏ రంగంలోనూ పురుషుల కంటే తక్కువ కాదు. పురుషులతో పోటీ అని కాదు గానీ... ఏ రంగంలోనైనా మహిళలు సత్తా చాటగలరు. ఈ విషయంలో మహిళలకు ఎలాంటి పరిమితులు ఉండరాదు. అనుకున్నది సాధించుకునే దిశగా మహిళలు ముందుకు సాగాలి. అలాంటి మహిళలకు వెన్నుదన్నుగా నిలవాలి. మహిళా సాధికారత దిశగా అడుగులు వేసే క్రమంలో స్వశక్తి దిశగా మహిళలను ముందుకు నడిపించాలి ఈ నినాదంతోనే వెటా రంగంలోకి దిగబోతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సభ్యులను కూడగట్టిన ఝాన్సీ రెడ్డి... ప్రస్తుతం అమెరికాలో మన తెలుగోళ్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రముఖ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా... మహిళలకు అండాదండగా నిలిచేలా వెటాను తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. అంతేకాకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వెటాతో కలిసి రావాలని కూడా ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు.
వెటా రంగంలోకి దిగగానే... తొలుత బాలికలకు సమాజంలో అనుకూలమైన వాతావరణం నెలకొల్పడంతో పాటు బాలికా విద్యపైనా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇందుకోసం వెటా గొడుగు కింద ఝాన్సీ రెడ్డి బృందవం ఇప్పటికే పలు ప్రత్యేక కార్యక్రమాలను పకడ్బందీగానే రచించారు. ఒక్కసారిగా వెటా రంగంలోకి దిగితే... ఇక ఆకాశమే హద్దుగా మహిళలకు అన్నింటి అండాదండా అందించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నట్లు ఝాన్సీ రెడ్డి చెబుతున్నారు. సమాజంలోని ప్రతి బాలికకు కనీస విద్యబోధనను అందించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయడమే కాకుండా... తాము ఏం సాధించాలనుకుంటున్నారో, వాటిని సాధించుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కూడా తమ లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు వెటా చెబుతోంది. మొత్తంగా వెటా ఎంట్రీతో అటు అమెరికాలోని మన తెలుగు మహిళలతో పాటుగా ఇటు తెలుగు నేలలోని మహిళలు, బాలికలకు మంచి అండ దొరికినట్టేనన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటిదాకా అమెరికాలో మన తెలుగు వాళ్ల చేతుల్లో పురుడుపోసుకుని దినదిన ప్రవర్ధమానం అన్న రీతిలో సాగుతున్న సంస్థల మాదిరే వెటా కూడా తనదైన శైలిలో రాణించాలని, మహిళా లోకానికి ఈ సంస్థ మెరుగైన సేవలు అందించాలని, ఆ సేవలను అందుకున్న మహిళా మణులు తమను తాము సమున్నతంగా తీర్చిదిద్దుకోవాలని మనం కూడా మనసారా ఆశిద్దాం.