US-students-called-suicide-hotline-but-got-something-inappropriate-instead

సరదాగా ఫోన్ చేద్దామనుకుంటే.. ఇలా జరిగిందేంటి!

లాన్‌క్యాస్టర్: అమెరికాలో ఓ విద్యార్థిని, తన స్నేహితురాళ్లకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎమిలీ ల్యావెల్ అనే యువతి కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాన్‌క్యాస్టర్ నగరంలో జీవిస్తోంది. అదే నగరంలోని న్యూవిస్టా మిడిల్ స్కూల్‌లో చదువుకుంటోంది. గత సోమవారం స్కూల్ అయిపోయిన తరువాత ఎమిలీకి బోర్ కొట్టి ఏదైనా సరదాగా చేయాలనుకుంది. వెంట స్నేహితురాళ్లు కూడా ఉండటంతో ఐడీ కార్డుపై ఉన్న సూసైడ్ ప్రివెన్షన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని అనుకున్నారు. ఎవరైనా ఒత్తిడికి, బాధకు లోనైప్పుడు, లేదా జీవితంపై విరక్తి చెందిన వారు ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. వారి బాధను తీర్చేందుకు సూసైడ్ ప్రివెన్షన్ నెంబరు పనిచేస్తోంది. విద్యార్థుల ఐడీ కార్డులపై కూడా ఈ నెంబర్ ఉంటుంది. 

ఎమిలీ, తన స్నేహితురాళ్లు సరదాగా ఆ నెంబరుకు ఫోన్ చేయగా.. అవతల కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ల మాటలు విని ఒక్కసారిగా షాకయ్యారు. ఎమిలీ సూసైడ్ ప్రివెన్షన్ నెంబర్‌కే ఫోన్ చేసినప్పటికీ.. ఆ నెంబర్ మాత్రం వేశ్యల గృహానికి వెళ్లింది. స్కూలు యాజమాన్యం ఐడీ కార్డుపై నెంబరును తప్పుగా ప్రింట్ చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎమిలీ స్కూలు యాజమాన్యానికి ఈ విషయం చెప్పాలనుకున్నప్పటికీ.. సాయంత్రం అవ్వడంతో మరుసటి రోజు చెప్పాలనుకుంది. ఘటన జరిగిన రోజే తన ఫేస్‌బుక్ ఖాతాలో ఐడీ కార్డు ఫొటోను పోస్ట్ చేసి తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. అంతే.. ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.

శృంగారానికి సంబంధించే విధంగా పోస్ట్ పెట్టినందుకు.. ఐడీ కార్డు ఫొటోను ఫేస్‌బుక్ సైతం డిలీట్ చేసేసింది. మరుసటి రోజు ఈ విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. స్కూల్‌లోని అందరి విద్యార్థుల ఐడీ కార్డులను తీసుకుని.. మరికొన్ని రోజుల్లో వారందరికీ కొత్త ఐడీ కార్డులను ఇస్తామని ప్రకటించింది. అప్పటివరకు ఐడీ కార్డులో ఉన్న నెంబరుకు ఎవరైనా ఫోన్ చేస్తే.. ఆ కాల్ సూసైడ్ ప్రివెన్షన్ నెంబర్‌కు ఫార్వార్డ్ అయ్యేలా చేస్తామని తెలిపారు. వేశ్య గృహానికి చెందిన వారు జరిగిన ఘటన గురించి తెలుసుకుని.. కాల్ ఫార్వార్డ్‌కు అంగీకరించడం విశేషం.