US-court-awards-RS-201-crores-to-cancer-victim-who-alleged-J-and-J-talcum-had-asbestos

జాన్సన్ పౌడర్ వాడటం వల్ల మహిళకు కేన్సర్.. రూ.200 కోట్ల నష్టపరిహారం

క్యాలిఫోర్నియా: జాన్సన్ పౌడర్ వాడటం వల్ల తనకు కేన్సర్ వచ్చిందంటూ అమెరికాలో ఓ మహిళ కోర్టులో కేసు వేసింది. 1960, 70 సంవత్సరాలలో తాను జాన్సన్ పౌడర్ వాడానని, అందులో రాతినార(ఆస్‌బెస్టస్) ఉండటంతో తనకు 2017లో కేన్సర్ వచ్చిందని టెర్రీ లీవిట్ అనే మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కేసు వేసింది. మహిళ కేసుకు సంబంధించి కంపెనీ స్పందించింది. మహిళ వాడిన పౌడర్‌లో ఆస్‌బెస్టస్ ఉన్నట్టు ధ్రువీకరణ కాలేదని, ఈ కేసులో స్పష్టత లేదని పేర్కొంది. ఎన్నో పరీక్షలు, అధ్యయనాలు చేసిన పిమ్మటే తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని కంపెనీ తెలిపింది. మరోపక్క టెర్రీ వాడిన ఉత్పత్తులలో లోపమున్నట్టు న్యాయమూర్తులు గుర్తించారు. ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ.. ఉత్పత్తులను వినియోగదారులు వాడకుండా కంపెనీ ఎలాంటి చర్చలు తీసుకోలేదని కోర్టు వాదించింది. టెర్రీకి 29 మిలియన్ డాలర్ల(రూ. 201 కోట్ల 8 లక్షలు) నష్ట పరిహారాన్ని చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. టాల్కమ్ పౌడర్ వాడకం వల్ల అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదమున్నట్టు గతంలో అనేక మంది వ్యాజ్యాలు వేశారు. టాల్కమ్‌లో రాతినార కారణంగనే అండాశయ కేన్సర్, మెసోథెలియోమాకు గురవుతున్నారని న్యాయవాదులు వాదిస్తున్నారు. టాల్కమ్ పౌడర్‌లో రాతినార ఉందంటూ ఇప్పటివరకు 11 కేసులు నమోదవగా.. మూడు కేసుల్లో కేసు వేసిన వారు విజయం సాధించారు. ఈ కేసుల్లో బాధితులకు 4.69 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. మరో మూడు కేసుల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ విజయం సాధించింది. మరో ఐదు కేసుల్లో ఎటువంటి తీర్పు వెలువడలేదు. కాగా, దేశవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై వేల ఫిర్యాదులు నమోదయ్యాయి.