Tulsi-gabbard-apoloziges-to-Indian-PM

వెల్‌కమ్ మోదీ.. సారీ చెప్పిన తులసీ గబ్బార్డ్..

వాషింగ్టన్: వారం రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ప్రధాని మోదీ అమెరికాకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానికి భారత సంతతి మహిళ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపుతున్న తులసీ గబ్బార్డ్ ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. 

నమస్తే అంటూ తన ప్రసంగం ప్రారంభించిన ఆమె.. హౌదీ - మోదీ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నందుకు క్షమించమని కోరారు. ముందస్తు కార్యక్రమాల మేరకు కుదరడంలేదని వీడియోలో పేర్కొన్నారు.  హౌదీ - మోదీ కార్యక్రమంలో భాగంగా భారత సంతతి ప్రజలంతా ఒక్కచోట కలవడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లోని తన తోటి సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు అత్యంత ముఖ్య భాగస్వామి అన్నారు. వాతావరణ మార్పులు, అణుయుద్ధాల నిర్మూలన, ఆర్థికపురోగమనం వంటి అంశాల్లో కలిసి పని చేయాలని అభిలషించారు. సంపద సృష్టి, అసమానతలు తొలగించడం, ఉగ్రవాదంపై పోరు, సైన్స్, తదితర అంశాలపై ఇరు దేశాలు దృష్టి పెట్టాలన్నారు. రెండు దేశాల మధ్య బంధం మరింత దృఢమవ్వడానికి ప్రయత్నించాలన్నారు. భారతీయుల మూల సిద్ధాంతమైన వసుధైక కుటుంబకమనే భావనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచంలో ఉన్నవారంతా ఒకే కుటుంబం అన్న భావనను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈర్ష్యా, ద్వేషాలకు చోటు లేదని తెలిపారు. కుల, మత, ప్రాంత, సామాజిక, ఆర్థిక భేదాలు చూడకుండా.. పరస్పర గౌరవం, సహకారంతో, ప్రేమతో 21వ శతాబ్దంలో మెగాలని కోరారు.
 
ఒకవేళ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి.. తులసీ గబ్బార్డ్ గెలిస్తే.. అరుదైన ఘనతలు సొంతం చేసుకోనున్నారు. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళగా, పిన్నవయస్కురాలిగా, తొలి భారత సంతతి వ్యక్తిగా, హిందువుగా చరిత్రలో నిలవనున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థిని అయిన తులసీ.. హవాయ్ నుంచి నాలుగు సార్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌కు ఎంపికయ్యారు.