TPAD-Begin-Bathukamma-Celebratations-with-Boddemma-Pooja

డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ‘బొడ్డెమ్మ’ పూజ కార్యక్రమం

డల్లాస్: టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి(టీపీఏడీ) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు వచ్చే ‘బొడ్డెమ్మ’ పండుగను తెలుగు మహిళలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. భారీగా తరలి వచ్చిన మహిళలు బొడ్డెమ్మకు పూజలు చేసి, ఆడి పాడి ఉత్సాహంగా గడిపారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళలు బతుకమ్మను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పూజించడం జరుగుతుంది. తెలంగాణలో జరుపుకునే ఈ రెండు పండుగల్లో బతుకమ్మ పెద్దల పండుగైతే, బొడ్డెమ్మ పిల్లల పండుగ. తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే పలు పండుగల్లో బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. 

బతుకమ్మపండుగకు సరిగ్గా తొమ్మిది రోజుల ముందు అనగా భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంభమై ఈ తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజిస్తారు. ఆడి పాడి తొమ్మిదో రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు. ఒక పీట మీద పుట్టమన్నుతో ఐదు దొంతరలుగా పేర్చి ఒకటి త్రిభుజాకారంతో గోపురంగా చేస్తారు. చెక్కపీటపై నాలుగు వైపుల నాలుగు మట్టిముద్దలను పెట్టి, వాటిని బొడ్డెమ్మ బిడ్డలని పిలుస్తారు. ఈ త్రికోణ శిఖరంపై కొన్నిచోట్ల వెంపలి చెట్టును పూజిస్తారు. 

బొడ్డెమ్మ వేడుకలకు తరలి వచ్చిన మహిళలకు టీపీఏడీ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 27న కాప్పెల్‌లోని ఆండ్రూ బ్రౌన్ పార్క్‌లో నిర్వహించే చిన్న బతుకమ్మ వేడుకలకు, అక్టోబర్ 5న అలెన్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్‌లో నిర్వహించే బతుకమ్మ-దసరా సంబురాలకు మహిళలను ఆహ్వానించారు. అలెన్ ఈవెంట్ సెంటర్‌లో నిర్వహించే బతుకమ్మ-దసరా ఈ వేడుకలకు దాదాపు 10వేల మంది తెలుగు వారు హాజరవుతారని అంచనా.