Texas-Cops-Hunting-For-The-Wedding-Crasher

పెళ్లైన కొత్త జంటలకు షాకిస్తున్న మహిళ దొంగ..!

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఓ మహిళ వెరైటీ చోరీలకు పాల్పడుతోంది. కేవలం వెడ్డింగ్ గిఫ్ట్‌లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తోందామె. ఇప్పటి వరకు ఇలా కొత్త పెళ్లైన ఆరు జంటలను దోచుకెళ్లిందా కిలాడీ మహిళ. ఆమె కోసం టెక్సాస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సదరు మహిళ పెళ్లిలు జరిగే చోట కొత్త బట్టలు వేసుకొని అతిథిలా ప్రవేశిస్తుంది. ఆ తరువాత కొత్త జంటకు బంధువులు, స్నేహితులు ఇచ్చే కానుకలపై కన్నేస్తుంది. నగదు, బ్యాంకు చెక్స్, గిఫ్ట్ కార్డ్స్‌లతో కూడిన కవర్లను తీసుకొని మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇలా ఇప్పటి వరకు ఒకే చోట ఆరుసార్లు చోరీలకు పాల్పడిందని కోమల్ కౌంటీ పోలీస్ అధికారి స్కాట్ ఫ్రేక్స్ తెలిపారు. కొత్త జంటలకు వారి పెళ్లి రోజును తీపిగుర్తుగా కాకుండా చేదు అనుభవాన్ని మిగిలిస్తోందామె. వెరైటీగా వారికిచ్చిన గిఫ్ట్‌లను కొట్టేస్తూ ఎప్పటికీ వారి మ్యారేజ్ డేను మరిచిపోకుండా చేస్తోందని స్కాట్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో ఓ పెళ్లివేడుకలో మొదటి దొంగతనం చేసిన ఆమె ఆ తరువాత ఇదే మాదిరిగా మరో ఐదు చోరీలు చేసిందని పోలీసులు తెలిపారు. ఇక సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా సదరు మహిళ దొంగ కోసం గాలిస్తున్నామని కోమల్ కౌంటీ పోలీసులు వెల్లడించారు. ఆమె ఆచూకీ చెప్పిన వారికి 4వేల డాలర్ల(రూ.2,83,520) రివార్డు కూడా ప్రకటించారు.