Telugu-NRI-Received-Prestigious-Distinguished-Achievement-Award-in-Extension-Award-in-US

అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ప్రవాసాంధ్రుడు

సెయింట్ లూయిస్: ఇటీవల సెయింట్ లూయిస్ నగరంలో జరిగిన ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి వార్షిక వైజ్ఞానిక మహాసభలో కాలిఫోర్నియా వాసి, ప్రవాసాంధ్రుడు అయిన  డా. సురేంద్ర దారాకి "డిస్టింగ్విష్డ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇన్ ఎక్స్టెన్షన్" (కీటకశాస్త్ర విస్తరణలో విశిష్ట సాధన పురస్కారం) లభించింది.  ప్రపంచవ్యాప్తంగా 7000 మందికిపైగా సభ్యులున్న ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రతి సంవత్సరం వివిధ కీటకశాస్త్ర సంబంధిత రంగాల్లో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన శాస్త్రవేత్తలకు పురస్కార ప్రదానం చేస్తుంది. రైతులకు, ఇతరులకు ఉపయోగపడే విధంగా పరిశోధనలు చేసి, ఆ పరిశోధన ఫలాలను సమర్థవంతంగా ఉపయోక్తలకు అందేట్టు చేసే విభాగంలో పరిశోధకులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.  గత 40 ఏళ్లుగా ఈ పురస్కారాన్ని అందిస్తూ రాగా.. మొట్టమొదటిసారిగా ఆసియా ఖండం నుంచి తెలుగువాడైన సురేంద్ర ఈ అవార్డును అందుకోవడం విశేషం.