TATA-Grandly-Celebrates-Bathukamma-Event-in-Newyork

టాటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు

న్యూయార్క్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ లాంగ్ ఐల్యాండ్‌లోని రాడిసన్ హోటల్‌లో అక్టోబర్ 6వ తేదీన అంగరంగ వైభవంగా బతుకమ్మ, దసరా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడు వందల మందికి పైగా హాజరయ్యారు. టాటా అడ్వైజరీ చైర్‌పర్సన్ డా. పైళ్ల మల్లా రెడ్డి, ట్రెజరర్ రంజిత్ క్యాతం, బోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ శరత్ వేముగంటి, సహోదర్ పెద్దిరెడ్డి, ఉష మన్నెం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. టాటా అధ్యక్షుడు విక్రమ్ జంగం టెక్సాస్ నుంచి ప్రత్యేకంగా వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఫొటోల కోసం క్లిక్ చేయండి

కార్యక్రమంలో మొదటగా దుర్గా మాతకు పూజ చేసి, అనంతరం వందలాది మంది మహిళలు బతుకమ్మను ఆడారు. తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత్ నుంచి వచ్చిన ఆమె తన ఆటపాటలతో ప్రాంగణాన్ని ఉర్రూతలూగించింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, పిల్లలు తమ దాండియా, నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలు ప్రతి ఒక్కరికీ బాగా నచ్చాయి. టాటా అడ్వైజరీ చైర్‌పర్సన్ డా. పైళ్ల మల్లారెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అందరినీ ఒకచోటికి చేర్చిన టాటా న్యూయార్క్ టీంను ఆయన కొనియాడారు. టాటా అధ్యక్షుడు విక్రమ్ జంగం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు వారందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలియజేశారు. 
కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, స్థానిక ఉపాధ్యక్షులు మల్లిక్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో ఎటువంటి లోటు లేకుండా జరిగే విధంగా సహకరించిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంస్థ అధ్యక్షులు అశోక్ చింతకుంట, బీఓటీ చైర్మన్ పూర్ణచంద్రప్రసాద్ అట్లూరి తమ వంతు సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని టాటా న్యూయార్క్ సంస్థ ట్రెజరర్ రంజిత్ క్యాతం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శరత్ వేముగంటి, సహోదర్ పెద్దిరెడ్డి, ఉష మన్నెం, స్థానిక ఉపాధ్యక్షులు మల్లిక్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ పవన్ రవ్వ(మెంబర్‌షిప్), శ్రీనివాస్ గూడూరు(లిటరరీ), మాధవి సోలేటి(వుమెన్), స్టాండింగ్ కమిటీ కో-చైర్మన్ రమా వనమా(కల్చరల్), రఘురామ్ పన్నాల(లిటరరీ), స్థానిక కో-ఆర్డినేటర్లు ప్రహ్లాద కులకర్ణి, సత్య గగ్గెనపల్లి, యోగి వనమా దగ్గరుండి ఘనంగా నిర్వహించారు.