TANTEX-Nela-Nela-Vennela-Programme

టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 143వ సాహిత్య సదస్సు

త్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" 143వ సాహిత్య సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణారెడ్డి కోడూరు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. ప్రవాసంలో నిరాటంకంగా 143 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. చిన్నారులు రేణుశ్రీ బుస, ఉదయ్ వోమరవల్లి, వేముల సాహితి, వేముల సింధూర ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. డా. ఊరిమిండి నరసింహారెడ్డి ‘మన తెలుగు సిరి సంపదలు’ శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడుపు కథల గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. డా. ఆర్వీఎస్‌ఎస్ ప్రసాద్ గారు వేమన పద్యాలు - సామాజిక స్పృహ అనే అంశం మీద మాట్లాడుతూ, పద్య వైభవాన్ని, కొన్ని వేమన పద్యాలను చదివి వివరించారు.

మానవత సంస్థ స్థాపకులు అమర్ నాథ్ రెడ్డి తరిమెల సమాజంలో రక్తదానం ప్రాధాన్యత గురించి వివరించడమే కాకుండా వారు దేశ విదేశాల నుంచి పుట్టపర్తి హాస్పిటల్‌కు వచ్చే రోగులకు తమ సంస్థ మానవత ద్వారా రక్తదానం చేసి ముఖ్యంగా పేదవారిని ఆదుకుంటామని చెప్పారు. డా. పూదూర్ జగదీశ్వరన్ గారు ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధాన్ని వివరించారు. వేముల లెనిన్ గారు వాగ్భూషణ భూషణుడు ఏనుగు లక్ష్మణ కవి అనే అంశంపై మాట్లాడారు. ముఖ్య అతిథి శ్రీమతి గీతాంజలి గారు సమకాలీన కథ ఎలా ఉండాలి, మంచి కథకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, కథకు, నవలకు గల వ్యత్యాసాలు, కథలోని పాత్రలు, శిల్పం, కథకు సంబంధించి విమర్శకుని పాత్ర, కథకుడు విమర్శలను ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలను వివరించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు, సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి శరత్ యర్రం, సాహిత్య కమిటీ సభ్యులు సతీష్ బండారు, పూర్వాధ్యక్షులు డా.ఊర్మిండి నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డా.తోటకూర ప్రసాద్, భాను ఇవటూరి, లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చిన్నారులు సింధూర వేముల, సాహితీ వేముల, చిన్నారులు రేణుశ్రీ బుస, ఉదయ్ వోమరవల్లి, సురేష్ కాజ, చంద్రహాస మద్దుకూరి, ఆచార్య జగదీశ్వరన్ పూదూరి, సీఆర్‌రావ్, డా. ఆర్వీఎస్‌ఎస్ ప్రసాద్, తరుణ్, స్వాతి కృష్ణ మూర్తి, సాజి గోపాల్ తదితరులు హాజరయ్యారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణా రెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష తెలుగు మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి గీతాంజలి గారిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పాలకమండలి సభ్యులు జ్ఞాపికని ఇచ్చి ఘనంగా సత్కరించారు. మీడియా మిత్రులకు కృతఙ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.