TANA-Former-President-Prasad-Thotakura-Pays-condolenses-to-Gollapudi

గొల్లపూడి మృతి పట్ల తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ దిగ్భ్రాంతి

డాలస్: రేడియో, సాహిత్య, నాటక, సినిమా రంగాలలో రచయితగా, నటుడిగా అనేక పురస్కారాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి డా. గొల్లపూడి మారుతీ రావు ఆకస్మిక మృతి పట్ల తానా మాజీ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి మారూతీరావుతో తనకు ఎన్నో ఏళ్లగా అనుబంధం ఉందని, ఆయనతో ఉన్న స్నేహం మరువలేనిదని గుర్తుచేశారు. గతంలో డాలస్ నగరంలో స్థానిక తెలుగు సంస్థ చేపట్టిన ‘నెల నెల తెలుగు వెన్నెల’ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావును కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయనతో తరుచూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడినని, ఎంతో ఆప్యాయంగా పలు విషయాలపై తరుచూ చర్చించేవాళ్ళమని గుర్తుచేసుకున్నారు.

సామాజిక స్పృహకలిగిన ఒక మంచి రచయితను, మేధావిని, మిత్రుడిని కోల్పోవడం దురదృష్టకరమని ప్రసాద్ తోటకూర ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో డాలస్‌లో జరిగిన తానా 19వ మహాసభల్లో ఆయనను సత్కరించుకొనే అవకాశం కలిగిందని ఆయన అన్నారు. 2017 డిసెంబర్ 16న అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున ఏలూరులో జరిగిన సభలో ఆయనకు సినీరత్న పురస్కారం అందజేసి గౌరవించుకున్నామని తెలిపారు. డా. గొల్లపూడి మరణం తెలుగు వారందరికి ఒక తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నామన్నారు.