TAMA-Republic-Day-Celebrations-in-US

తామా ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

అట్లాంటా: అమెరికాలోని తామా(తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా) ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా అట్లాంటా వాసులు పాల్గొని దేశభక్తిని చాటారు. ముందుగా సాంఘిక సేవా కార్యదర్శి సాయిరామ్ కారుమంచి అందరినీ ఆహ్వానించి ఎన్నో సంవత్సరాలుగా తామా క్రమం తప్పకుండా జాతీయ పండుగలను నిర్వహిస్తున్న సంగతిని గుర్తుచేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత లెక్కల ఆచార్యులు శ్రీ. ప్రభాకర్ కడియాల, రాయచూరు రైతు శ్రీ. నాగేశ్వరరావు వలిచేటి, వరంగల్ విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ. సోమయ్య కాసాని జెండా వందనం చేశారు. ముఖ్య అతిథులకు రామ్ మద్ది, అంజయ్య లావు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం ప్రభాకర్ గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటి మధ్య వ్యత్యాసం ఏమిటన్నది, ముఖ్యంగా చిన్నపిల్లలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. రైతుగా తన అనుభవాలు, చిన్ననాటి గణతంత్ర దినోత్సవ స్మృతులను నాగేశ్వరరావు పంచుకున్నారు. దేశభక్తిని పెంపొందించే విషయాలు వివరించి, జైహింద్, భారత్ మాతా కీ జై వంటి నినాదాలను సోమయ్య చేయించారు.

పిదప కొంతమంది తమ అనుభవాలు, గణతంత్ర దినోత్సవ ఘనత, పౌరుల బాధ్యతలు మున్నగు విషయాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తామా కార్యాలయాన్ని దేశ నాయకుల చిత్రపటాలతో, జెండాలతో, మువ్వన్నెల తోరణాలతో అందంగా అలంకరించారు. ఇంతమంది కలిసి ఇలా జాతీయ పండుగను చేసుకోవటం ప్రశంసనీయమని, ఈ కార్యక్రమం భారతదేశంలో చిన్నప్పుడు తమ పాఠశాలల్లో జరిగినట్లు అనిపించిందని కార్యక్రమానికి హాజరైన వారు హర్షం వ్యక్తం చేశారు. మరపురాని ఆ రోజులను తామా వారు మరోమారు తమకు గుర్తుచేసినందుకు, తమ పిల్లలను ఇందులో భాగం చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చివరగా ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేసిన ఆహుతులందరికీ, సహాయం చేసినవారికి తామా అధ్యక్షులు భరత్ మద్దినేని, బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ చుండూరి కృతజ్ఞతాభినందనలు తెలియజేసి ముగించారు.

 ఫొటోల కోసం క్లిక్ చేయండి