TAGKC-Bathukamma-and-Dasara-Celebrations

కాన్సాస్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు

కాన్సాస్: కాన్సాస్ తెలుగు సంఘం.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా స్థానిక హిందూ దేవాలయంలో తెలుగు సంఘం నిర్వహించిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ప్రాంగణాన్ని అలంకరించారు. సంప్రదాయ దుస్తులను ధరించి మహిళలంతా బతుకమ్మలను తీసుకుని కార్యక్రమ ప్రాంగణానికి రావడంతో అమెరికాలో అచ్చ తెలుగు పండుగ వాతావరణం కనిపించింది. కార్యక్రమంలో వ్యాఖ్యతలుగా చేసిన అదితి బావరాజు, శ్రీకాంత్ లంక తమ మాటల, పాటలతో సంబరాలకు మరింత ఊపు తెప్పించారు.

 బతుకమ్మను ఎలా తయారుచేయాలో చూపించేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది తెలుగు వారు పాల్గొనడంతో.. కాన్సాస్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని బతుకమ్మ పండుగల కంటే ఈ బతుకమ్మ సంబరం మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. మహిళలు బతుకమ్మ పాటలతో బతుకమ్మల చుట్టూ ఆడుతూ ఉత్సాహంగా నృత్యం చేశారు. అందరికంటే బతుకమ్మను బాగా చేసిన వారికి ఈ సారి పట్టుచీరలను బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలు అందరికీ తెగ నచ్చాయి. కాగా, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ కాన్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు శివ తీయగూర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఫొటోల కోసం క్లిక్ చేయండి