Sankranti-and-Republic-Day-Celebrations-Event-of-TAGC-in-Chicago

టీఏజీసీ ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు

చికాగో: మొట్ట మొదటి తెలుగు సంస్థ అయిన చికాగో మహానగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో వారి ఆడిటోరియంలో ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 10.00 వరకు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో సంస్థ అధ్యక్షులు ప్రవీణ్ వేములపల్లి, శ్రీమతి క్రాంతి వేములపల్లి, వెంకట్ గూనుగంటి, ముఖ్యకార్యదర్శి అంజి రెడ్డి కందిమళ్ల, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి వినీత ప్రొద్దుటూరి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీమతి నీలిమ చేకీచర్ల, అలంకరణ సభ్యులు ముఖద్వారం, నృత్యవేదికను సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ ప్రతిమలతో సుందరంగా అలంకరించారు. నృత్యవేదిక ముందు బొమ్మలకొలువును చాలా చక్కగా ఏర్పాటు చేశారు. పిల్లలకు పతంగుల తయారీ పోటీ నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. 

అంజి రెడ్డి కందిమళ్ల, కోశాధికారి పాండు రంగారెడ్డి లెంకల, కో-కోశాధికారి రమణ కాల్వ, పరమేశ్వర యరసాని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీమతి ఉమా అవధూత, ఇతర మహిళా వాలంటీర్లు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ఆడపడుచులను సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి పన్నీరు చిలకరించి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో దాదాపు 1500 మంది సభ్యులు, అతిథులు పాల్గొన్నారని సభ్యత్వ నమోదు కార్యదర్శి పరమేశ్వర రెడ్డి యరసాని తెలిపారు. 

తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత తెలిపే బాలుర నృత్యప్రదర్శన, రైతుల ప్రాముఖ్యాన్ని, వారి కష్టాలను వివరించే "జై కిసాన్" పర్యావరణ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పే "వనం" కార్యక్రమం... ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వాటిని ఎలా ఎదిరించాలో వివరించే 'వుమెన్ ఎంపవర్మెంట్' నాటిక... గణతంత్ర దినోత్సవం, వివిధ చిత్ర గీతాల మాలిక 'చిత్రలహరి' ప్రోగ్రాం, చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 32 జట్ల ద్వారా 350 మంది ప్రదర్శనకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రదర్శనకారులకు టీఏజీసీ తరఫున సర్టిఫికెట్స్, పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా మొక్కలను టీం కోఆర్డినేటర్స్‌కు అందజేశామని సంస్థ సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి వినీత ప్రొద్దుటూరి తెలిపారు.

ఈ కార్యక్రమానలు విజయవంతం చేయటానికి రెండు నెలలుగా శ్రమించిన కల్చరల్ కో-చైర్స్ శ్రీమతి శిరీష మద్దూరి, శ్రీమతి మాధవి రాణి కొనకళ్ల, శ్రీమతి శిల్ప పైడిమర్రి, శ్రీకాంత్ బేతి మరియు కూర్పుకర్తలు, సమన్వయ కర్తలకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన అతిథులకు వడ్డించటానికి సంక్రాంతి పండుగ పిండి వంటలైన నేతి అరిసెలు, చెక్కినాలు, ఉలవచారు, వడియాలు, చల్ల మిరపకాయలు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించామన్నారు. వీటితోపాటు వివిధరకాలైన ఆహారాలను బావర్చి రెస్టారెంట్ నాపర్విల్లే వారు సమకూర్చారని పేర్కొన్నారు. కొన్ని వంటకాలను మట్టి కుండలలో పెట్టి వడ్డించామని తెలిపారు. భోజనశాల అలంకరణ చాలా బాగుందని ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అతిథులు ప్రశంసించారని ఫుడ్ కమిటీ కార్యదర్శి సంతోష్ కొండూరి తెలిపారు. ఆహార ఏర్పాట్లను పర్యవేక్షించిన యూత్ కార్యదర్శి విజయ్ బీరం, వెంకట్ గూనుగంటి, శశి చావా, నవీన్ ఎడుమ, రోహిత్ ఆకుల, శ్రీధర్ మరియు వాలింటీర్లకు సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ రోజు జరిగిన కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలు, లైవ్ వీడియోల రూపంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. మరిన్ని ఫొటోలు, వీడియోలను https://www.tagc.org/photos.php వెబ్‌సైట్‌ ద్వారా చూడొచ్చని మీడియా కార్యదర్శి శ్రీధర్ అలవల తెలియజేశారు. ఇల్లినాయిస్ స్టేట్ మెడికల్ డిస్సిప్లినరీ బోర్డుకు ఇల్లినాయిస్ గవర్నర్ నియమించిన తెలుగు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సన్మానించటం జరిగింది. ఈ కార్యక్రమంలో డొనేషన్ ద్వారా సేకరించిన నిధులను టీఏజీసీ నెల్లూరుకు చెందిన విశ్వ భారతి బ్లైండ్ స్కూల్‌కి విరాళంగా అందించింది. 

రెండు చేతులు కలవనిదే చప్పట్లు మ్రోగవు, నలుగురు లేనిదే సభను అలంకరించలేము. అలాగే కొన్ని కుటుంబాలు కలవనిదే ఒక పండుగ పూర్తికాదు. ఈ రోజు మన ఈ సంక్రాంతి పండుగ సంబరాలను వెయ్యి రేట్లు అద్భుతంగా, కన్నుల పండువగా తీర్చిదిద్ది విజయవంతం చెయ్యటానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు, కళాకారులకు, కళా అభిమానులకు, కళా పోషకులకు, కూర్పుకర్తలు, సమన్వయకర్తలు, కార్యకర్తలకు, కార్యవర్గ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అధ్యక్షులు ప్రవీణ్ వేములపల్లి ధన్యవాదములు తెలియజేశారు. చివరగా జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది.