Osmania-University-Prof-Presentation-at-Harvard

ఆన్‌లైన్ విద్యతో అక్షరాస్యత పెరుగుతుంది: హార్వర్డ్‌లో ఉస్మానియా ప్రొఫెసర్ జగదీశ్వర్ వీరనేని

బోస్టన్: హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఐజేఏఎస్) ఇంటిమేషనల్ కాన్ఫరెన్స్‌లో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జగదీశ్వర్ వీరనేని పాల్గొన్నారు. మే 28 నుంచి జూన్ 1 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుండగా.. జగదీశ్వర్ వీరనేని స్పీకర్ సెషన్ బుధవారం జరిగింది. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు విద్యావిధానంలో వచ్చిన మార్పులు, ఆన్‌లైన్ విద్య ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్యను తీసుకెళ్లడంపై స్పీకర్ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం యథాతథంగా.. 

‘ప్రాచీన కాలంలో భారతదేశంలో విద్య అనేది కేవలం గురువు, శిష్యుడు మధ్య మాత్రమే ఉండేది. అప్పటి విద్య ఎక్కువగా మతపరమైన, నైతిక విషయాలపై మాత్రమే సాగేది. అది కూడా కేవలం మాట్లాడటమే తప్ప రాయడం అనేది ఉండేది కాదు. అలా కొన్ని శతాబ్దాల తరువాత భారతదేశంలో రాతకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాతకు ప్రాధాన్యత వచ్చిన తరువాత కూడా మధ్య యుగం మొత్తం విద్య మతపరమైన, నైతిక విషయాలకే పరిమితమైంది. ఇక వలస పరిపాలకులు భారతదేశంలోకి ప్రవేశించాక స్థానిక భాషలను నిర్లక్ష్యం చేసి వారి పరిపాలనకు అనుగుణంగా ఉండేలా ఆంగ్ల భాషను ప్రోత్చహించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే నిర్మాణాత్మక విద్యావ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ ప్రాంతీయ, ఆంగ్ల భాషలను సమతూకం చేసింది. అయితే, స్వాతంత్ర్యం సాధించి 70 ఏళ్లు దాటినప్పటికీ.. ఇప్పటికీ భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విద్య చేరడం లేదు.  

ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఉన్నత విద్యలో భారతదేశ స్థూల నమోదు నిష్పత్తి కేవలం 25.8 శాతంగానే ఉంది. విద్య అనేది మనిషికి ఆయుధం వంటిది. కేవలం విద్య మాత్రమే మనిషిని విజయపథంలో నడిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా విద్య చేరాలంటే ఆన్‌లైన్ విద్యావిధానంపై దృష్టి సారించాలి. స్తూల నమోదు నిష్పత్తి పెరగడానికి ఆన్‌లైన్ విద్య ఉత్తమ మార్గం. పేదరికంతో పోరాడాలంటే అక్షరాస్యత అనేది అత్యవసరం. అక్షారాస్యత లేకుండా భారతదేశం పేదరికంతో పోరాడలేదు. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. టెక్నాలజీ ఆధారిత విద్యా వ్యవస్థ, ఆన్‌లైన్ విద్యా వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు సైతం తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన సమాజాన్ని చూడవచ్చు. ప్రస్తుతం డిజిటల్ కమ్యూనికేషన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. విద్యావేత్తలకు, అభ్యాసకులకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సరికొత్త డిజిటల్ ప్రపంచాన్ని అందిస్తున్నందున భారతదేశంలోనూ దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి పనిచేయాలి.’