ohio-couple-arrested-for-serving-laxative-laced-cookies

ఇంటి ముందు హార్న్‌లు కొడుతున్నారని.. అమెరికా జంట ఏం చేసిందంటే..

ఒహియో:అమెరికాలోని ఒహియో ప్రాంతంలో ఏదో కారణంగా కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలో భాగంగా ఒహియోలోని ఉరిక్స్‌విల్లే ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి ముందు హార్న్‌లు కొడుతూ తమ నిరసన తెలుపుతున్నారు. ఆ ఇంట్లో ఉన్న బో కాసెన్స్(29), రాషెల్ షరాక్(25) అనే భార్యాభర్తలకు ఈ హార్న్‌ల చప్పుడు నచ్చలేదు. కార్మికుల గోల వారికి చిరాకు తెప్పించడంతో.. వారిని ఆపడానికి కార్మికులందరికీ బిస్కెట్లను పంచిపెట్టారు. మామూలు బిస్కెట్లు అయి ఉంటే.. ఈ వార్త రాసే అవసరం ఉండేది కాదు. బిస్కెట్లలో ఆ జంట మందును కలిపి ఇచ్చింది. మలబద్దకానికి వాడే లాక్సటివ్ అనే మందును కలిపి ఇవ్వడం ద్వారా కార్మికులకు కడుపు నొప్పి వస్తుందని.. తమ ఇంటి ముందు గోల తగ్గుతుందని వారు అనుకున్నారు. బిస్కెట్లలో మందు కలుసుతున్న వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరికీ పది లక్షల బాండ్‌ను కూడా విధించారు. మందు కలిపిన బిస్కెట్లను ఏ ఒక్కరూ తినలేదని.. ఎవరికీ ఏం కాలేదని పోలీసులు తెలిపారు. ఆ బిస్కెట్లను తినాల్సిందిగా పోలీసులు భార్యభర్తలకు సూచించగా.. తినడానికి వారిద్దరూ నిరాకరించారు.