NTR-in-New-Jersey

న్యూజెర్సీలో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ, న్యూజెర్సీ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 96వ జయంతి సందర్భంగా బావార్చి హోటల్‌లో ఎన్నారై టీడీపీ నేతలు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఎన్నో విజయాలను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారని, కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించారని కొనియాడారు. ఎన్టీఆర్ జీవితం, ఆయన సాధించిన విజయాలు భావి తరాలకు స్ఫూర్తి అని అన్నారు. సినీజీవితం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుప్రజల నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్ అని, పేద బడుగు బలహీన వర్గాలు పడుతున్నకష్టాలకు చలించిపోయి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ పాటుపడ్డారని తెలిపారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన్నవ మోహన్ కృష్ణ, నల్లమల రాధాకృష్ణ, విద్య గారపాటి, మందాడి శ్రీహరి, వెనిగళ్ల వంశీ, గోగినేని కార్తిక్, నూతలపాటి రమేష్, కసుకుర్తి రాజా, ఆలోకం శ్రీరామ్, శ్రీ చౌదరి, వెనిగళ్ల కుమార్, వాసిరెడ్డి రామకృష్ణతోపాటు పెద్ద సంఖ్యలో నందమూరి అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.