NRIs-protest-in-US-against-Three-Capitals-Decision

అమరావతి కోసం అట్లాంటా ప్రవాసాంధ్రుల ర్యాలీ

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటా నగరంలో అమరావతి రైతులకు మద్దతుగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. జనవరి 12న స్థానిక శ్రీక్రిష్ణ విలాస్‌లో సుమారు 250 మందికిపైగా ఎన్నారైలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి సంబంధించిన 29 గ్రామాల రైతులపై.. ముఖ్యంగా మహిళలపై వ్యవహరిస్తున్న తీరును ఎన్నారైలు ఖండించారు. మహిళలపై పోలీసుల తీరును అప్రజాస్వామికమని తూర్పారపట్టారు. విభజించు - పాలించు అనే వైసీపీ రాజకీయ వికృతక్రీడలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు, పిల్లలు కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం అందరు ర్యాలీగా వెళ్లి.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'తుగ్లక్ పాలన నశించాలి', 'మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు', 'ఒక రాష్ట్రం.. ఒక రాజధాని', 'జై అమరావతి.. జై ఆంధ్రప్రదేశ్' వంటి నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. అమరావతి పరిరక్షణ సమితికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్‌లోని తమ బంధువులు, స్నేహితులతో అన్ని ప్రాంతాల్లోను మున్ముందు ఇలాంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్నారైలు తీర్మానించారు.