NRIs-of-New-Jersey-Support-of-the-Initiation-of-Farmers-to-Keep-Amaravati-as-Capital-of-AP

రాజధాని రైతుల దీక్షలకు న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రుల సంఘీభావం

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు "న్యూజెర్సీ అమరావతి పరిరక్షణ జేఏసీ" తరుపున... నాట్స్(NATS) మాజీ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ రూ. 7,76,022.00 చెక్‌ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు అందజేశారు. 

అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ ఆర్.శివారెడ్డి, జనరల్ సెక్రటరీ గద్దె తిరుపతిరావు, అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కె. శ్రీనివాసరావు, సోషల్ మీడియా విభాగాధిపతి పి. కిరణ్ హాజరై ఈ చెక్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మరియు అమరావతి పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ, ప్రతాప్ చింతపల్లి మాట్లాడుతూ అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరూ అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగే విధంగా జేఏసీ పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా న్యాయపరమైన, చట్టపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తూ భవిష్యత్తులో ఒక రాజధాని ఒక రాష్ట్రం పోరాటానికి మా ప్రవాసాంద్రులు అందరూ కూడా అన్ని రకాలుగా మీ వెన్నంటి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొసరాజు విజయబాబు, చింతపల్లి ప్రవీణ్, రవి తదితరులు న్యూజెర్సీ అమరావతి జేఏసీ తరుపున పాల్గొన్నారు.