NRIs-Met-Indian-Consulate-General-in-NewYork

ఇండియన్ కాన్సులేట్ జనరల్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు

న్యూయార్క్: అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రవాసాంధ్రులు న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులెట్ జనరల్ సందీప్ చక్రవర్తిని కలిసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమస్య గురించి, రైతులు, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి వివరించారు. గత ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్దానాలను, ప్రమాణాలను ఇప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న దానిపై రాజా కసుకుర్తి, పద్మ చావా కాన్సులేట్‌ జనరల్‌కు వివరించారు. బాల సుబ్రహ్మణ్యం రాయుడు, పవన్ తాత, విష్ణు కనపర్తి, నాయుడు ఈర్ల మాట్లాడుతూ.. వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. శ్రీహరి మాందాటి, రాధా, కార్తీక్, వంశీకృష్ణ, రామకృష్ణ, రమేష్ తదితరులు కాన్సులెట్ జనరల్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు భయపడి వెనక్కి పోతున్నారని వివరించారు. 

చివరగా.. ప్రవాసులందరూ కాన్సులేట్ జనరల్ సందీప్ చక్రవర్తికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించి భారత కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశ అధ్యక్షులకు పంపించవలసినదిగా కోరారు. ఈ విజ్ఞాపన పత్రాన్ని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు పంపించి తగు చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తానని గౌరవ కాన్సులెట్ జనరల్ సందీప్ చక్రవర్తి ప్రవాసులకు హామీనిచ్చారు. తెలుగు వారి సమస్యను అర్థం చేసుకొని అర్జీని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నందుకు కాన్సులెట్ జనరల్ సందీప్ చక్రవర్తికి ప్రవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.