NRIs-Get-together-in-Dallas

డాలస్‌లో విజయనగర ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థుల రీయూనియన్

డాలస్:  బెల్లారీలోని విజయనగర ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థుల, అధ్యాపకుల సమావేశం కన్నుల పండుగగా ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. నాట్స్‌లో అంతర్భాగంగా మూడురోజుల పాటు వేయిమందికి పైగా వీఈసీ విద్యార్థులు సందడి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి వివిధ దేశాలలో స్థిరపడిన విద్యార్థులు, వారికి విద్యాబోధన చేసిన ఆధ్యాపకులు కుటుంబసమేతంగా తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రధారణ చేసి మరింత శోభను తెచ్చారు.  వీఈసీ ఆధ్యాపకులు విద్యార్థులతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు. విద్యార్థులు కూడా కాలేజీ రోజుల్లో జరిగిన విశేషాలను, అధ్యాపకులకు పెట్టిన మారుపేర్ల గురించి వివరించి వినోదాన్ని పంచారు. అమ్మాయిల హాస్టల్ దగ్గర చేసే కామెంట్స్.. వాటికి అమ్మాయిల రియాక్షన్ గురించి, ఒక్కొక్కరికి ఉన్న నిక్ నేమ్‌ల గురించి గుర్తుచేసుకొని ఆనందబాష్పలతో మూడురోజులు సరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి ఇండియా, కెనడా, దుబాయ్, సింగపూర్, బెహ్రాన్, మలేషియా, అమెరికాలో వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన విద్యార్థులు, అధ్యాపకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులందరినీ పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సత్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకొన్నారు. అధ్యాపకులు మాట్లాడుతూ ఇది వారి జీవితంలో మరచిపోలేని మధురఘట్టంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత ప్రేమ ఆప్యాయతలు చూపిన విద్యార్థులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.