North-Americas-Biggest-Bathukamma-Celebrations-in-SanRaman

ఉత్తర అమెరికాలో అతిపెద్ద బతుకమ్మ ఉత్సవాలు..

శాన్‌రామన్:అక్టోబరు నెల అమెరికాలోని తెలుగు వాళ్ళకు ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు పండుగల నెలగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలలో రెండు పెద్ద పండుగలు వస్తాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు.. అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలంతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగకాగా, మరొకటి దసరా. అయితే బతుకమ్మ పండుగ తెలంగాణ వాసులకు చాలా ప్రత్యేకం. తెలంగాణ సంస్కృతికి ఈ పండుగ ఓ ప్రతీక. ఈ విషయాన్ని చాటిచెప్పేలా ఈ నెల 5, 6 తేదీల్లో కాలిఫోర్నియాలో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద 'బతుకమ్మ' సంబరాలు జరిగాయి.

మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధానికి ప్రతీకగా బతుకమ్మ పండుగను చెప్పవచ్చు. ప్రతి మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుచేయడానికే బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తి చెయ్యాలనే సదుద్దేశంతో పుట్టిన మొట్ట మొదటి అమెరికా సంఘాలలో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఒకటి. ఈ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న శాన్‌రామన్‌లోని గేల్ రాంచ్ మిడిల్ స్కూల్‌లో, 6వ తేదీన సన్నీవేల్‌లోని ఓర్టెగా పార్క్ బతుకమ్మ ప్రాంగణం (గజెబో)లో మెగా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వ సహకారంతో ఈ రెండు  ప్రాంతాల్లో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఈ ఉత్సవాల్ని ఏర్పాటుచేసింది.